ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరదొస్తున్నా.. సాగునీటికి కటకటే..

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరదొస్తున్నా.. సాగునీటికి కటకటే..
  • లిఫ్ట్​ స్కీములు, రిజర్వాయర్లకే నీటి తరలింపు
  • తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో వట్టిపోయిన చెరువులు
  • రిజర్వాయర్ల కింద చెరువులను నింపాలని కోరుతున్న రైతులు

మహబూబ్​నగర్, వెలుగు:ఎగువ నుంచి వరద వస్తున్నా.. ఆ నీటిని సాగు కోసం వాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. రెండు వారాలుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 80 వేల క్యూసెక్కుల నుంచి లక్ష క్యూసెక్కుల చొప్పున వరద వస్తున్నా.. దిగువకే ఆ నీటిని విడుదల చేయాల్సి వస్తోంది. వచ్చిన వరదలో కొద్దిపాటి నీటిని మాత్రమే ఈ ప్రాజెక్టు కింద లిఫ్ట్​ స్కీముల పరిధిలోని రిజర్వాయర్లకు తరలిస్తున్నారు. కానీ, తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ రిజర్వాయర్ల కింద వట్టిపోయిన చెరువులను నింపే ప్రయత్నాలు చేయడం లేదు. ఓ వైపు సాగునీరు అందక, మరోవైపు వానలు పడక ఉమ్మడి జిల్లాలో వానాకాలం సాగు పనులు ఊపందుకోలేదు.

1,500కు పైగా గొలుసుకట్టు చెరువులు..

ఉమ్మడి జిల్లాలో 1,500కు పైగా గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. వీటి కింద 60 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువులు ఫుల్​ కెపాసిటీకి చేరితే గ్రౌండ్​ వాటర్​ పెరిగి మరో 50 వేల ఎకరాల వరకు సాగునీరు అందుతుంది. రెండేళ్లు వానాకాలంతో పాటు యాసంగి పంటలకు సాగునీటికి ఢోకా ఉండదు. అయితే ఈ సీజన్​లో ఇప్పటి వరకు భారీ వర్షాలు పడలేదు. ఆడపాదడపా జల్లులే పడడంతో చెరువులు నిండలేదు.  మార్చి నుంచే ఎండలు దంచికొట్టడంతో చెరువులన్నీ వట్టిపోయాయి. దీంతో వీటి కింద ఉన్న ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు లేక, చెరువుల్లో నీరు లేక సాగు పనులు ప్రారంభించలేదు.

రిజర్వాయర్లకు వరద జలాలు..

ఉమ్మడి జిల్లాకు జీవనాధారమైన జూరాలకు కొద్ది రోజులుగా స్థిరంగా వరద కొనసాగుతోంది. వరద వస్తుండడంతో ఈ ప్రాజెక్టు ద్వారా రోజూ దిగువన ఉన్న శ్రీశైలానికి నీటిని విడుదల చేస్తున్నారు. మహబూబ్​నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ఉన్న భీమా–1, భీమా–-2 పరిధిలోని ఆరు రిజర్వాయర్లు, కోయిల్​ సాగర్​ను నింపేందుకు కెనాల్స్​ ద్వారా నీటిని వదులుతున్నారు. ఇందులో కోయిల్​సాగుకు 315 క్యూసెక్కులు, భీమా-–1కు 650, భీమా–-2కు 750 క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నారు. అయితే రిజర్వాయర్లను నింపడంతో పాటు వాటి పరిధిలోని చెరువులను కూడా నింపాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే సాగు అదును దాటుతోందని, మరికొద్ది రోజులు కాలం ఇలాగే ఉంటే ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు.వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రిజర్వాయర్ల కింద ఉన్న చెరువులను నింపాలని కోరుతున్నారు. 

ఊపందుకోని సాగు పనులు..

జులై వచ్చినా ఇప్పటి వరకు పంటల సాగు పూర్తిగా ప్రారంభం కాలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులు వానాకాలం వరితో పాటు పత్తి, జొన్న, మక్కలు, కందులు, వేరుశనగ సాగు చేస్తారు. ఇప్పటి వరకు పత్తి, జొన్న, మక్క, కంది పంటలు మాత్రమే సాగు చేశారు. వరి, వేరుశనగ సాగు ప్రారంభించలేదు. జులై మొదటి వారంలోనే రైతులు వరి తుకాలు పోసుకొని నాట్లకు సిద్ధం కావాల్సి ఉంది. వర్షాలు లేకపోవడంతో రైతులు ఇప్పటి వరకు కరిగెట్టలను కూడా చేసుకుంటలేరు.

చెరువును నింపాలి..

నాకు గూడూరు చెరువు కింద నాలుగు ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం ఈ చెరువులో నీరు లేదు. ఇప్పటికీ  వరి సాగు మొదలు పెట్టలేదు. జూరాల నుంచి కోయిల్​సాగర్​కు నీటిని వదులుతున్నారు. కోయిల్​సాగర్​ నుంచి కాలువల ద్వారా చెరువును నింపాలి.

మిట్టమీద నారాయణ, గూడూరు

కెనాల్​ నీరు వదలాలి..

నాకు 12 ఎకరాల పొలం ఉంది. ప్రతి వర్షాకాలం సీజన్​లో వరి సాగు చేస్తా. కానీ, ఈసారి వర్షాలు రాలేదు. దీంతో వరి సాగు పనులు మొదలు పెట్టలేదు. బోరు కూడా ఆశించిన స్థాయిలో నీరు పోయడం లేదు. కోయిల్​సాగర్​ కెనాల్  ద్వారా నీటిని విడుదల చేయడంతో పాటు చెరువులను నింపితే సాగుకు ఢోకా ఉండదు. 

కుర్వ మల్లేశ్, పెద్దచింతకుంట