
లండన్: వింబుల్డన్‌లో సీడెడ్ ప్లేయర్లకు ఈసారి కలిసి రావడం లేదు. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ఆరోసీడ్ మాడిసన్ కీస్ ఇంటిముఖం పట్టింది. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో కీస్ 3–6, 3–6తో 104వ ర్యాంకర్ లారా సీజ్మండ్ (జర్మనీ) చేతిలో కంగుతిన్నది. ఫలితంగా టాప్–6లో ఒకే ఒక్క ప్లేయర్ టాప్‌సీడ్ ఆరీనా సబలెంకా రేసులో ఉంది. రెండు నుంచి ఐదో సీడ్ వరకు కోకో గాఫ్, జెసికా పెగులా, జాస్మిన్ పోలిని, జెంగ్ క్విన్‌వెన్ ఇప్పటికే వెనుదిరిగారు. మెన్స్‌లోనూ 13 మంది సీడెడ్ ప్లేయర్లు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. గంటా 33 నిమిషాల మ్యాచ్‌లో కీస్ పవర్ ఫుల్ సర్వీస్‌లతో ఆకట్టుకున్నా.. సీజ్మండ్ బ్యాక్ లైన్ గేమ్ ముందు నిలువలేకపోయింది.
రెండో నంబర్ కోర్టులో విపరీతంగా గాలి వీచడం సీజ్మండ్‌కు కలిసొచ్చింది. మ్యాచ్ మొత్తంలో కీస్ 31 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేస్తే, సీజ్మండ్ 11కి పరిమితమైంది. ఆరు బ్రేక్ పాయింట్లలో రెండింటిని కాచుకున్న కీస్ 16 విన్నర్లు, నాలుగు డబుల్ ఫాల్ట్స్ చేసింది. ఐదు బ్రేక్ పాయింట్లు సాధించిన సీజ్మండ్ 19 విన్నర్లు, ఒక్క డబుల్ ఫాల్ట్స్ చేసింది. ఇతర మ్యాచ్‌ల్లో నవొమి ఒసాకా (జపాన్) 6–3, 4–6, 4–6తో పావ్లుచెకోవా (రష్యా) చేతిలో ఓడగా, కర్తాల్ (బ్రిటన్) 6–4, 6–2తో ప్యారీ (ఫ్రాన్స్)పై, అన్సిమోవా (అమెరికా) 6–3, 5–7, 6–3తో గ్లాఫి (హంగేరి)పై, సియరా (అర్జెంటీనా) 7–5, 1–6, 6–1తో బుక్సా (స్పెయిన్)పై, నోస్కోవా (చెక్) 7–6 (6), 7–5తో రకిమోవా (రష్యా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.
ఇక మెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో ఐదోసీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–4, 6–3, 6–7 (5), 6–1తో డేవిడోవిచ్ ఫోకినా (స్పెయిన్)పై, రబ్లెవ్ (రష్యా) 7–5, 6–2, 6–3తో మనారినో (ఫ్రాన్స్)పై, కామెరూన్ నోరి (బ్రిటన్) 7–6 (5), 6–4, 6–3తో బెలుచి (ఇటలీ)పై, షెల్టన్ (అమెరికా) 6–2, 7–5, 6–4తో హిజికటా (ఆస్ట్రేలియా)పై నెగ్గి ముందంజ వేశారు. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో యూకీ భాంబ్రీ (ఇండియా)–జినియు జియాంగ్ (చైనా) 6–3, 1–6, 7–6 (6)తో అమెరికా జోడీ హారిసన్–మెలిచర్ మార్టినెజ్‌పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.