
- ఇక్కడ పర్యటించిన డిప్యూటీ సీఎం, మంత్రులు
- పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశం
- రూ.2 కోట్లకు టెండర్లు పిలిచిన అధికారులు
- ఆక్రమణలో భూమిని స్వాధీనం చేసుకుని హద్దురాళ్లు పాతేందుకు చర్యలు
ఖమ్మం, వెలుగు : నేలకొండపల్లి బౌద్ధ స్థూపం అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్ దృష్టి పెట్టింది. వివిధ దేశాల బౌద్ధ ఆరాధకులు, టూరిస్టులను ఆకర్షించేలా వసతులు కల్పిస్తోంది. గతేడాది రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. బౌద్ధ స్థూపం అభివృద్ధికి చేపట్టాల్సి పనులపై సమీక్షించారు. టూరిజం అట్రాక్షన్‌గా, దేశంలోనే అతిపెద్ద బౌద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పష్టంచేశారు. ఇందుకు రూ.2 కోట్లు ప్రకటించారు. ఇక్కడ బుద్ధిస్ట్ మ్యూజియం డెవలప్ చేస్తామని, పాత ఆరామాలను మళ్లీ ప్రారంభించి బుద్ధిస్టులను రప్పిస్తామని, వాళ్లతో చర్చించి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్టెండర్లు పిలిచింది. బౌద్ధ స్థూపానికి మరమ్మతులు చేయడంతో పాటు ఇతర సదుపాయాలు కల్పించనుంది. ఇంతకుముందే నిర్మించిన వసతి గృహాల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదిలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం
ఖమ్మం జిల్లా కేంద్రానికి 24 కిలోమీటర్ల దూరంలోని నేలకొండపల్లి బౌద్ధక్షేత్రం దక్షిణ భారత్ లోనే అతిపెద్దది. క్రీస్తు శకం 2 వ శతాబ్దానికి చెందినదిగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. చాళుక్యుల కాలంలో బౌద్ధుల ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లినట్టు పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. దీన్ని 1976లో నేలకొండపల్లి, ముజ్జుగూడెం మధ్య తవ్వకాలు జరపడంతో 106 అడుగుల వ్యాసం, 60 అడుగుల ఎత్తులోని స్థూపం బయటపడింది. దీనికి సమీప ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లోనూ బుద్ధుని పాలరాతి విగ్రహాలు, మట్టి పాత్రలు, మట్టి పూసలు, ఇక్ష్వాకులు, శాతవాహనుల కాలం నాటి నాణేలు, పంచలోహ విగ్రహాలు చాలా వెలుగు చూశాయి. వీటన్నింటిని మ్యూజియంలో భద్రపరిచారు.
ఆక్రమణకు గురైన భూమి స్వాధీనం
ఈ స్థూపాన్ని ఆనుకొని 42 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. చాలావరకు ఆక్రమణకు గురైంది. ప్రస్తుతం స్థూపం చుట్టూ 7 ఎకరాల భూమి మాత్రమే టూరిజం శాఖ పరిధిలో ఉంది. కాగా.. కబ్జాకు గురైన భూమిని కొందరు సాగు చేసుకుంటుండగా, మరికొంత ఖాళీగా ఉంది. అక్కడే ఉన్న ఆశ్రమం ఆధీనంలోనూ కొంత భూమి ఉందని రెవెన్యూ అధికారులు సర్వే ద్వారా తేల్చారు. సర్వే నంబర్ 256లోని మొత్తం 49 ఎకరాలను స్వాధీనం చేసుకుని చుట్టూ హద్దులు నిర్ణయించారు. కాంక్రీట్ హద్దురాళ్లతో మళ్లీ ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు.