
హిందువులు.. పండుగులకు.. వ్రతాలు.. పూజలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆషాఢమాసం శూన్యమాసం. అయినా ఈ నెలలో తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఆషాఢం మాసం శుక్లపక్షం.. ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏడాది ( 2025) జులై 6న వచ్చింది.ఆ రోజు కొన్ని ఉపచారాలు పాటిస్తే అదృష్టం మన తలుపు తడుతుందని పండితులు చెబుతున్నారు. తొలి ఏకాదశి రోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. . . !
హిందూ పురాణాల ప్రకారం తొలి ఏకాదశి పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆరోజు లక్ష్మీనారాయణులను వారిని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి. ముఖ్యంగా ఈ ఏకాదశిని దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలోని 11వ రోజున తొలి ఏకాదశిని జరుపుకుంటారు. ఈరోజు విష్ణువును పూజించడం ఆనవాయితీగా వస్తోంది.
పురాణాల ప్రకారం విష్ణుమూర్తి క్షీర సాగరంలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లే నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు.. దేవశయని ఏకాదశి రోజున మనం కొన్ని పనులు చేయకూడదని అంటారు.
విష్ణుపూజలో తులసీ దళం వాడాల్సిందే: దేవశయని ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం పాటించాలి. విష్ణువుకు ప్రార్థనలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు విష్ణుమూర్తి అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. విష్ణుమూర్తికి తులసి ఆకులు అంటే చాలా ఇష్టం . తులసీ దళం సమర్పించకుండా విష్ణుపూజ అసంపూర్ణం అని నమ్ముతారు. కాబట్టి శ్రీమహా విష్ణు దర్శనానికి వెళ్లినా, పూజ చేసిన కచ్చితంగా తులసి ఆకులు వాడాల్సిందేనని పండితులు చెబుతున్నారు. అయితే ఏకాదశి రోజు తులసి మాత ఉపవాస దీక్షను పాటిస్తారు. అందువలన ఆరోజు తులసి మొక్కకు నీరు పోయరాదు. పసుపు.. కుంకుమ.. పూలతో పూజించాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి.
ఆహారానికి దూరంగా ఉండాలి:తొలి ఏకాదశి రోజు ఆహారం అస్సలే తీసుకోవద్దు. అంటే బియ్యంతో తయారు చేసిన ఎలాంటి పదార్దాన్ని తినకూడదని పండితులు చెబుతున్నారు. ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి. మాంసం, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని ముట్టుకోకూడదు. ఎందుకంటే ఈ విషయాలు మనసులో ప్రతికూల ఆలోచనలకు దారి తీస్తాయి. అలాంటిఆలోచనలతో మనం ఆరాధనపై దృష్టి పెట్ట లేకపోవచ్చు.
దానం చేయడం మంచిది: తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకున్నా, పూజ చేసినా చేయకపోయినా... దానం మాత్రం చేయాల్సిందే. బియ్యం, బట్టలు, ధనం,ధాన్యం నీళ్లు ఇలా ఏదైనా దానం చేయవచ్చు. ఎందుకంటే దేవశయని ఏకాదశి రోజున ఇలాంటి పనులు చేస్తే గొప్పు పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు.
బ్రహ్మచర్యం పాటించాలి:తొలి ఏకాదశి వ్రతం రోజున ఓ వ్యక్తి బ్రహ్మచర్యం పాటించాలి. భక్తులు తమ శరీరం, మనస్సుపై నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈరోజును మీరు విష్ణు మంత్రాలను పటిస్తూ.. రోజంతా గడవడం వల్ల చాలా మంచి జరుగుతుంది.
ఉపవాసం ఉంటే మరింత మంచిది
తొలి ఏకాదశి రోజున భక్తులు అన్న తినకూడదు. అంటే ఉపవాసం ఉండాలని అర్థం. పండ్లు, ఫలాలు, తాగితే ఏం కాదు. కాబట్టి ఆహారానికి మాత్రమే దూరంగా ఉండండి.
విష్ణు మంత్రాలు పఠించాలి:దేవశయని ఏకాదశి రోజున విష్ణు మంత్రాలను పఠించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మీరు పఠించే విష్ణు మంత్రం మీకు ఏకాదశి ఫలాలను అనుగ్రహిస్తుంది. తొలి ఏకాదశి నాడు మీరు.. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది. పైన చెప్పినవన్నీ ఫాలో అవుతూ.. పూజ చేస్తే కచ్చితంగా మంచి ఫలితాలు పలభిస్తాయి. ఇంట్లోనే ఉండి విష్ణు ఆరాధన చేసుకొని పుణ్యంతో పాటు మోక్షం పొందండి.