మెడికోలపై దాడి అమానుషం

మెడికోలపై దాడి అమానుషం
  • చల్మెడ ఆనందరావు కాలేజీపై చర్యలు తీసుకోవాలి
  • జూడా అసోసియేషన్ డిమాండ్

బషీర్​బాగ్, వెలుగు: కరీంనగర్​లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో మెడికోలపై దాడి అమానుషమని, సదరు కాలేజీపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ డిమాండ్​చేసింది. కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డా.అజయ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. 

తమకు రావాల్సిన స్టైపెండ్ కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న హౌస్ సర్జన్లపై కాలేజీ యాజమాన్యం పోలీసులతో దౌర్జన్యం చేయించిందన్నారు. పోలీసులు మెడికోలను దుర్భాషలాడుతూ లాఠీచార్జ్​ చేసేందుకు యత్నించారని ఆరోపించారు. 

స్టైపెండ్ కోసం ప్రశ్నించిన 64 మందిని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసిందన్నారు. మెడికోలపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్​చేశారు. అలాగే కాలేజీ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకొని, మెడికోలపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలన్నారు.