మెట్రోను కాపాడుకోవడం సామాజిక బాధ్యత

మెట్రోను కాపాడుకోవడం సామాజిక బాధ్యత

హైదరాబాద్  మెట్రో రైలు ప్రాజెక్టు నిర్వహణ ఆర్థికంగా భారంగా మారిందని, ఈ ప్రాజెక్టును కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు అభ్యంతరం లేదని.. ఎల్&టీ హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ఇటీవల కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసిందని వార్తలు వెలువడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్న కీలక దశలో ఈ పరిణామం ఆందోళనకరం.


హైదరాబాద్ మెట్రో రెండో దశ 'ఏ' భాగానికి సంబంధించిన డీపీఆర్​ను  జులై 2024 లో,   ‘బి’ భాగానికి సంబంధించిన డీపీఆర్​ను  జూన్ 2025లో  రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది.  'ఏ' భాగంలో  ఐదు కారిడార్లలో  76.4 కి.మీ. మార్గాలను,  ‘బి’ భాగంలో మూడు కారిడార్లలో  86.1 కి.మీ. మార్గాలను ప్రతిపాదించారు.  నగరానికి  ప్రజారవాణా వ్యవస్థ ఆత్మవంటిది.  కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో  రాష్ట్ర రోడ్డు  రవాణా సంస్థ బస్సులు రోజూ 20 లక్షల మందిని, ఎంఎంటిఎస్ మరో లక్షమందిని చేరవేస్తుండగా, 50% మంది ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడుతున్నారు. నగరంలో 80 లక్షలకు పైగా వాహనాలు ఉండగా, ఏటా 2 లక్షల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి.  ఇది తీవ్రమైన ట్రాఫిక్ రద్దీకి, ప్రమాదాలకు (ఏటా 300 మరణాలు), కాలుష్యానికి దారితీస్తోంది. వాహనాల వల్ల రోజూ గాలిలో కలుస్తున్న 1500 టన్నుల కాలుష్య కారకాలు ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్దేశించిన ప్రమాణాల కంటే 20 రెట్లు అధికం.

ఈ ఆర్థిక సంవత్సరంలో  రూ.625.88 కోట్ల నష్టం

మెట్రోలో  ప్రయాణికుల సంఖ్య పెంచడం ద్వారా ఈ సమస్యలను చాలావరకు తగ్గించవచ్చు. ఢిల్లీ మెట్రో రోజుకు సుమారు 78.67 లక్షల మంది ప్రయాణికులతో, 2.3 లక్షల వాహనాలను రోడ్ల పైనుంచి తప్పించి, ఏటా రూ.10,400 కోట్ల ఇంధనాన్ని ఆదా చేస్తోంది.  ప్రాణాంతక ప్రమాదాలు కూడా తగ్గాయి.  కానీ, హైదరాబాద్  మెట్రో రైలు ప్రారంభం నుంచే అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.  విధానపరమైన జాప్యాలు, ఆ వెంటనే  కొవిడ్ మహమ్మారి ప్రభావం, ఆశించిన స్థాయిలో రియల్ ఎస్టేట్ అద్దెలు, ఇతర  ఆదాయాలు రాకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతోంది.  ఇప్పటికీ మెట్రో స్టేషన్లలో ఖాళీ స్థలాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మొత్తం రూ.6,605.51 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.625.88 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఎల్&టీ  మెట్రో వార్షిక నివేదికలో వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం ఎల్&టీ హైదరాబాద్ మెట్రో రైల్ మొత్తం ఆదాయం రూ.1,108.54 కోట్లు కాగా, మొత్తం నిర్వహణ ఖర్చు రూ.1,734.45 కోట్ల వరకు నమోదైంది. దీనికి ఒక ప్రధాన కారణం తక్కువ ప్రయాణికుల సంఖ్య. జులై 2024 నాటికి నెలవారీ ప్రయాణికుల సంఖ్య 1.44 కోట్లు (రోజుకు 4.66 లక్షలు).  క్రమంగా తగ్గుతూ జూన్ 2025 నాటికి 1.24 కోట్లకు (రోజుకు 4.14 లక్షలు) చేరింది. 2017లోనే రూ.10,  రూ.60 మధ్య నిర్ణయించిన అధిక ఛార్జీలు ప్రయాణికులకు భారం అయింది. ఇది తెలంగాణ ట్రామ్‌వేస్ చట్టం 2008లో పేర్కొన్న  రూ.8–19 ఛార్జీలకు విరుద్ధం.  కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్  నిబంధన ప్రకారం కూడా ఛార్జీలు ఆ స్థాయిలో ఉండాలి. అయినా, 2012లో  గెజిట్ ద్వారా  మెట్రో రైల్వేస్ (ఆపరేషన్స్ & మెయింటెనెన్స్) చట్టం, 2002ను వర్తింపజేసి, సెక్షన్ 33 ప్రకారం ఆపరేటర్లకు చార్జీలు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇచ్చారు.

పెరిగిన బస్సు పాస్ చార్జీల ప్రభావం

మెట్రో ఎదుర్కొంటున్న అసలు సమస్య ‘అసమగ్ర చివరి మైలు అనుసంధానం’.  మెట్రో స్టేషన్ల  నుంచి వారి గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులు ఆటోలు, ఇతర వాహనాలపై ఆధారపడుతున్నారు. ఇందుకు అసలు మెట్రో ఛార్జీ కన్నా ఎక్కువ ఖర్చు అవుతోంది. ఈ అదనపు వ్యయం ఎగువ మధ్యతరగతి  ప్రయాణికులను కూడా మెట్రోకు దూరం చేస్తోంది. ఉదాహరణకు సైనికపురిలో ఉండే వ్యక్తి మెట్టుగూడ నుంచి మాదాపూర్ వెళ్ళి రావడానికి (32 కి. మీ.) మెట్రో కోసం రూ.102 ఖర్చవుతే,  తన ఇంటి నుంచి మెట్రో స్టేషన్ కు వెళ్ళి రావడానికి (16 కి. మీ.) ఆటో, క్యాబ్ కోసం కనీసం రూ.200 ఖర్చు చేయాలి.   మే 17 నుంచి హైదరాబాద్ మెట్రో 
యాజమాన్యం చార్జీలను, జూన్ 9 నుంచి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుపాస్ చార్జీలను పెంచడం కూడా ప్రజారవాణా వ్యవస్థపై మరింత ప్రభావం చూపించాయి.  ఈ చర్యలు  ప్రజలను ప్రజా రవాణా వ్యవస్థ నుంచి ప్రైవేట్ వాహనాల వైపు నెట్టే ప్రమాదం ఉంది. తద్వారా ట్రాఫిక్, కాలుష్యం వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఈ సమస్యకు పరిష్కారాలు ఉన్నాయి. ఢిల్లీ మెట్రో, చివరి మైలు అనుసంధానం కోసం  ‘ఢిల్లీ మెట్రో లాస్ట్ మైల్ సర్వీసెస్ లిమిటెడ్’ అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేసి ఫీడర్ సేవలను సమర్థవంతంగా నడుపుతోంది.

బస్సులు, మెట్రోలను అనుసంధానించాలి

 సింగపూర్‌లో బస్సులు, మెట్రోలను అనుసంధానిస్తూ ఒకే టికెట్‌తో ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నమూనాలను అధ్యయనం చేయాలి. బస్సు సర్వీసులను విస్తరించి, 
మెట్రో స్టేషన్లకు సమీపంలో బస్సులు, ఇతర వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలి.  మెట్రో–ఆర్టీసీ–ఎంఎంటిఎస్‌లను ఒకే గొడుగు కిందకు తెచ్చి సమీకృత రవాణా ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలి.  చార్జీలను హేతుబద్ధీకరించి, ఒకే టికెట్‌తో అన్నింటిలో ప్రయాణించే అవకాశం కల్పించాలి.  జులై–డిసెంబర్ 2024లో సగటు నెలవారీ ప్రయాణికుల సంఖ్య 1.39 కోట్లు (రోజుకు 4.56 లక్షలు) కాగా, జనవరి–జూన్ 2025 నాటికి 1.27 కోట్లకు (రోజుకు 4.23 లక్షలు) పడిపోవడం గమనార్హం.  ప్రయాణికుల సంఖ్య  పెరిగితే  మెట్రో రైలు మలిదశ విస్తరణకు అనుమతులు పొందడం కూడా సులభం అవుతుంది.  సుస్థిర, సురక్షిత, పర్యావరణహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంలో  మెరుగైన ప్రజారవాణా పాత్ర కీలకం.  వ్యక్తిగత వాహనాలకు బదులు మెట్రోలో  ప్రయాణించడం ప్రజల సామాజిక బాధ్యత కూడా!  ప్రమాదాలు తగ్గడమనే తక్షణ లాభాలు,  మెరుగైన పర్యావరణం వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా ప్రజలు పరిగణించాలి.  హైదరాబాద్‌ను రాబోయే తరాలకు సజీవంగా అందించాలంటే మెట్రోను కాపాడాలి!


- శ్రీనివాస్ మాధవ్,
సమాచార హక్కు పరిశోధకుడు