- ఇన్నాళ్లు గ్రామస్థాయి సిబ్బంది లేక పెండింగ్‌లో అప్లికేషన్లు
- ఇప్పటికే విధుల్లో చేరిన జీపీవోలు.. త్వరలో రానున్న లైసెన్డ్స్ సర్వేయర్లు
- పెండింగ్ దరఖాస్తులు పరిష్కారమయ్యే అవకాశం
- కోర్టు క్లియరెన్స్‌తో కొలిక్కిరానున్న సాదాబైనామాలు
కరీంనగర్, వెలుగు :
రాష్ట్రంలో రెవెన్యూ శాఖను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రెవెన్యూ గ్రామానికో జీపీవోను కేటాయించిన సర్కార్.. త్వరలోనే మండలానికో ఇద్దరు, ముగ్గురు సర్వేయర్లు నియమించనుంది. దీంతో రెవెన్యూ శాఖ మరింత బలోపేతం కానుంది. రెవెన్యూ శాఖలోని అత్యంత కీలకమైన వీఆర్‌వో, వీఆర్ఏ వ్యవస్థను బీఆర్‌ఎస్ సర్కార్ రద్దు చేయడంతో భూసమస్యల పరిష్కారం తహసీల్దార్లకు సవాల్‌గా మారింది.
ఈ ఏడాది మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 8 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తే.. కేవలం 80 వేలలోపే పరిష్కారం కావడంతో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో రెవెన్యూ శాఖకు ప్రతినిధి ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వీఆర్‌వో వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు సాదాబైనామా వివాదంపై హైకోర్టు స్టే ఎత్తేయడంతో భూసమస్యలకు సంబంధించి పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రెవెన్యూ శాఖకు దూరమైన 20 వేల మంది
రెవెన్యూ శాఖ ప్రక్షాళన పేరిట 2020లో అప్పటి సర్కార్ ఫీల్డ్‌లో పనిచేసే విలేజీ రెవెన్యూ ఆఫీసర్(వీఆర్వో) వ్యవస్థను రద్దు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా 7,039 వీఆర్వో పోస్టులు రద్దయ్యాయి. అప్పటికే వీఆర్వోలుగా పనిచేస్తున్న సుమారు ఐదు వేల మందిని ఇతర శాఖలకు పంపించారు. అలాగే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్(వీఆర్ఏ) వ్యవస్థ సైతం రద్దు చేయడంతో 23 వేల పోస్టులు క్యాన్సిల్ అయ్యాయి.
అప్పటికే పనిచేస్తున్న 20,555 మంది వీఆర్‌ఏలను అర్హత ప్రకారం మున్సిపల్, మిషన్‌భగీరథ, ఇరిగేషన్, ఎడ్యుకేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేశారు. కొందరు రెవెన్యూశాఖలోనే జూనియర్, రికార్డ్ అసిస్టెంట్లుగా కొనసాగుతున్నారు. ఇలా సుమారు 20 వేల మంది ఒక్కసారిగా రెవెన్యూ శాఖకు దూరం కావడంతో ధరణి కారణంగా క్షేత్ర స్థాయిలో వచ్చిన భూసమస్యలను పరిష్కరించడం, వివిధ రకాల సర్టిఫికెట్ల జారీ కోసం గ్రామాల నుంచి రిపోర్టులు తెప్పించుకోవడం తహసీల్దార్లకు తలనొప్పిగా మారింది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం... ఇతర శాఖల్లో పనిచేస్తున్న 5,101 మంది వీఆర్ఏ, వీఆర్‌వోలను జీపీఓ (గ్రామ పాలనాధికారులు)లుగా నియమించడంతో తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లకు ఊపిరి పీల్చుకున్నట్లయింది. వీరితో పాటు సుమారు ఏడు వేల మందికి లైసెన్డ్స్ సర్వేయర్లుగా ట్రెయినింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేస్తుండడంతో రెవెన్యూ శాఖకు అదనపు బలగం సమకూరినట్లైంది.
8,27,330 దరఖాస్తులు.. 80 వేలలోపే పరిష్కారం
రాష్ట్రవ్యాప్తంగా 605 మండలాలు, 10,889 రెవెన్యూ గ్రామాల్లో ఈ ఏడాది మేలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. మొత్తం 20 రకాల భూసమస్యలకు సంబంధించి 8,27,330 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇప్పటి వరకు సుమారు 80వేల లోపు అప్లికేషన్లు మాత్రమే విచారణ పూర్తి కాగా.. అప్రూవల్ కోసం భూభారతి పోర్టల్‌లో ఆన్‌లైన్ చేశారు.
వీటిలో సుమారు 25 వేల అప్లికేషన్లకు సంబంధించిన సమస్యలు అప్రూవల్ అయి ఆన్‌లైన్‌లోనూ అప్‌డేట్ అయ్యాయి. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్లలో సాదాబైనామా, మిస్సింగ్ సర్వే నంబర్లు, ల్యాండ్ ఓనర్ పేరు, ఇంటి పేరులో తప్పులు, నిషేధిత భూముల జాబితాలో పట్టా భూమి సర్వే నంబర్లు రావడం, విస్తీర్ణం తక్కువగా నమోదవడం, పెండింగ్ మ్యుటేషన్, అసైన్డ్ ల్యాండ్ కొనుగోలు, వారసత్వ పట్టా వంటి అనేక సమస్యలు ఉన్నాయి.
ఇందులోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా దరఖాస్తులు రావడం గమనార్హం. ఖమ్మం జిల్లాలో 67,378 దరఖాస్తులు రాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 61,145 అప్లికేషన్లు అందాయి. ఆ తర్వాత వరంగల్ జిల్లాలో 54,933 అప్లికేషన్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 48,651 అప్లికేషన్లు, సూర్యాపేట జిల్లాలో 44,741, నల్గొండ జిల్లాలో 43,545, సిద్ధిపేట జిల్లాలో 42,639 దరఖాస్తులు వచ్చాయి.
కోర్టు క్లియరెన్స్‌తో సాదాబైనామాలు కొలిక్కి
సాదాబైనామాలు, స్టాంప్ పేపర్ల మీద రాసుకుని భూములు కొనుగోలు చేసిన వారికి పట్టాదారు పాస్‌బుక్స్ జారీ చేసేందుకు ఉన్న అడ్డంకులు ఇటీవల తొలగిపోయాయి. 2014కు ముందు భూమి కొని 12 ఏండ్లుగా కబ్జాలో ఉన్న రైతుల భూములను రెగ్యులరైజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో కొన్ని జిల్లాల్లో జీపీవోలు, ఆర్‌ఐలు క్షేత్ర స్థాయిలో ఎంక్వైరీ చేస్తూ సంబంధిత అమ్మకం, కొనుగోలుదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే పాస్‌బుక్ జారీ చేయడానికి ముందు భూమి కొన్న వ్యక్తితో పాటు, అమ్మిన వ్యక్తి నుంచి కూడా అఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధన కొత్త సమస్యను సృష్టించేలా ఉందన్న వాదన వినిపిస్తోంది.
