జగిత్యాల టౌన్, వెలుగు: కన్న కూతుళ్లు తమను పట్టించుకోవడం లేదని ఓ వృద్ధురాలు జగిత్యాల ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల పట్టణం మిషన్ కాంపౌండ్ ప్రాంతానికి చెందిన గుండ మల్లీశ్వరి– శంకర్ దంపతులకు నలుగురు కూతుళ్లు. అందరికీ పెళ్లిళ్లు కాగా.. వృద్ధులైన తమను ఒక్క పెద్దకూతురే చూసుకుంటోందని, మిగతా వారు పట్టించుకోవడం లేదని ఆరోపించింది.
మంగళవారం ఆర్డీవో ఆఫీస్‌లో మీడియా ప్రతినిధులకు తన బాధను వివరించింది. తన ఆస్తులను రాయించుకున్న కూతుళ్లు.. తనతోపాటు పక్షవాతంతో బాధపడుతున్న తన భర్తను కూడా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ సాయంతో ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. వయో వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆర్డీవో ఏవో రవికాంత్ తెలిపారు.
