
ఇటీవల పీజీ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వివిధ విశ్వవిద్యాలయాలలో పీజీ అడ్మిషన్ల కోసం నిర్వహించిన సీపీగేట్ పరీక్షా ఫలితాలు ఇటీవలే ప్రకటించారు. వివిధ విశ్వవిద్యాలయాలు కేటాయించిన సీట్లు వేలల్లో ఉండగా, అర్హుల సంఖ్య మాత్రం అతి తక్కువ స్థాయికి పడిపోయింది. ఉదాహరణకు ఎం.కాం. విభాగంలో 6,562 సీట్లకు 3,858 మంది మాత్రమే అర్హత సాధించడం, సీట్ల కంటే అర్హుల సంఖ్య సగం వరకు కూడా చేరకపోవడం సమస్య తీవ్రతను అర్థం చేసుకునేలా చేస్తోంది. అలాగే ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో 3,607 సీట్లకు 3,291 మంది, కంప్యూటర్ సైన్స్‌లో 2,950 సీట్లకు 1,936 మంది మాత్రమే అర్హత సాధించారు. గణితశాస్త్రంలో 3,648 సీట్లకు 2,070 మంది, ఫిజిక్స్‌లో 1,767 సీట్లకు 1,122 మంది మాత్రమే ఉన్నారు. ఇలాంటి అన్ని విభాగాల్లో పూర్తిస్థాయి అడ్మిషన్లు జరిగే అవకాశాలు ప్రస్తుతం కనబడటం లేదు.
సా ధారణంగా ఒక కోర్సు చదవడానికి నియమిత సంఖ్యలో సీట్లు ఉన్నప్పుడు వాటిని చదవడానికి పోటీపడేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తారు. గతంలో ఉన్నంత స్థాయిలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థుల్లో ఆసక్తి తగ్గిపోయిందని ప్రస్తుత గణాంకాలు చెప్తున్నాయి. పూర్తి సీట్లను భర్తీ చెయ్యాలంటే క్వాలిఫై అయ్యేవారి సంఖ్య తగ్గిపోవడంతో క్వాలిఫై కానివారిని భర్తీ చేసే అవకాశం ఉంటుందా లేదా భవిష్యత్తులో క్వాలిఫై మార్కులు తగ్గించే అవకాశం ఉంటుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. వీరిలో ఏది చేసినా విద్యా ప్రమాణాలు పడిపోయే అవకాశం ఉంది.
ఖాళీగా మిగిలే సీట్లు – భవిష్యత్తుకు పెనుముప్పు
సీట్ల కంటే అర్హుల సంఖ్య తక్కువగా ఉండటంతో చాలా విభాగాల్లో కోర్సుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా భాషా విభాగాలు.. అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్ వంటి విభాగాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సెరీకల్చర్ వంటి వృత్తి విద్యా నైపుణ్య కోర్సులకు కూడా తగినంత దరఖాస్తులు రాకపోవడం గమనార్హం. వీటికి పరీక్షలు కూడా నిర్వహించని పరిస్థితి ఏర్పడటంతో, అర్హత లేని వారికీ సీట్లు కేటాయించే పరిస్థితి వస్తోందని అనిపిస్తోంది. దీని ఫలితంగా విద్యా ప్రమాణాలు బలహీనపడటమే కాకుండా, భవిష్యత్తులో ఈ కోర్సుల పట్ల ఆసక్తి పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది.
ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమా?
విద్యావ్యవస్థలో నాణ్యతను పెంపొందించడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల విద్యార్థుల ఆసక్తి తగ్గిపోతోంది. పీజీ కోర్సులు చదవాలనుకునే విద్యార్థులకు సరైన పరిశోధన సదుపాయాలు, ప్రాక్టికల్ ల్యాబ్‌లు, ఆధునిక పాఠ్యాంశాలు అందుబాటులో
లేకపోవడం మరో ప్రధాన సమస్య. అలాగే అధ్యాపకుల కొరత కూడా తీవ్రంగా ఉంది. సరిపడా ప్రొఫెసర్లు లేకపోవడం వల్ల పాఠ్యాంశ బోధన నాణ్యత తగ్గిపోతోంది. ఈ లోపాలను పూడ్చేందుకు ఎటువంటి కచ్చితమైన చర్యలు తీసుకోకపోవడం, ప్రభుత్వంలో స్పష్టమైన దృష్టి లేకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారింది. గత 15 ఏళ్లుగా ఎటువంటి నియామకాలు వర్సిటీల్లో చేపట్టలేదు. తాత్కాలిక అధ్యాపకులను నియమించినా పూర్తిస్థాయిలో జీతాలు ఇవ్వకపోవడం, పరిశోధనలకు అవకాశం లేకపోవడం వంటి సమస్యతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా గత మూడేళ్లుగా ప్రభుత్వం నుంచి సరిగ్గా రాకపోవడంతో, కాలేజీ యాజమాన్యాల నుంచి విద్యార్థుల మీద ఫీజు చెల్లింపుల కోసం ఒత్తిడి పెరుగుతోంది. దీంతో విద్యార్థులు పూర్తిస్థాయిలో కోర్సును కూడా పూర్తి చేయలేక మధ్యలోనే వదిలేయాల్సి వస్తున్నది. కొన్నేళ్లుగా రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు పెద్దస్థాయిలో నిధులు కేటాయిస్తున్నప్పటికీ వాటిని సరైన సమయంలో పూర్తి స్థాయిలో విడుదల చేయలేక ప్రభుత్వాలు చేతులు ఎత్తేస్తున్నాయి. ఒక వైపు ప్రభుత్వం విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడానికి విద్యా కమిషన్ లాంటి వాటిని ఏర్పాటు చేసింది. కానీ, విద్యా కమిషన్ రిపోర్టును పరిశీలించి చర్యలు తీసుకునే దాఖలాలు కనబడటంలేదు.
పీజీపై ఆసక్తి తగ్గుతోందా?
మరోవైపు విద్యార్థులే పీజీ చదువుపై ఆసక్తి కోల్పోవడానికి పలు కారణాలు ఉన్నాయని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండటం, పీజీ పూర్తిచేసినా పెద్దగా ఉపయోగం లేదన్న భావన, పరిశోధనకు తగిన ప్రోత్సాహం లేకపోవడం వంటి అంశాలు విద్యార్థులను వెనక్కునెడుతున్నాయి. అలాగే ప్రభుత్వ రంగంలో నియామకాలు తగ్గిపోవడం, ప్రైవేట్ రంగంలో సైన్స్ గ్రాడ్యుయేట్లకు తగిన గుర్తింపు రాకపోవడం కూడా పెద్ద సమస్య. విద్యార్థులు వృత్తి ప్రాధాన్యత కలిగిన కోర్సులవైపు ఎక్కువగా మళ్లిపోతుండటంతో సంప్రదాయ విభాగాలు ఆకర్షణ కోల్పోతున్నాయి.
సమగ్ర దృష్టితో పరిష్కారం
ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి కృషి చేయాలి. ముందుగా పీజీ కోర్సుల నాణ్యతను పెంపొందించడానికి సరైన పాఠ్యాంశ సవరణలు చేయాలి. పరిశోధన కేంద్రాలు, ల్యాబ్‌లు, ఆధునిక సాంకేతిక సదుపాయాలు ఏర్పాటుచేయాలి.
ప్రొఫెసర్ల నియామకాలను వేగవంతం చేసి, విద్యార్థులకి నాణ్యమైన బోధన అందించాలి. తాత్కాలిక, ఒప్పంద అధ్యాపకులకు పూర్తిస్థాయిలో జీతాలు చెల్లిస్తూ పరిశోధనలకు అవకాశం కల్పించాలి. పీజీ పూర్తి చేసినవారికి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. స్కాలర్‌షిప్‌లు, ప్రోత్సాహకాలు అందించడం ద్వారా విద్యార్థుల ఆసక్తిని పెంచాలి. ముఖ్యంగా ప్రభుత్వం విద్యా రంగానికి మొదటి ప్రాధాన్యతిచ్చి తగిన నిధులను కేటాయించాలి. అలా చేస్తే పీజీ విద్యార్థుల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.
- డా. మామిడాల ఇస్తారీ,
ప్రొఫెసర్,
కాకతీయ యూనివర్సిటీ