
- శంషాబాద్ ఎయిర్పోర్టులో
- 1261 గ్రాములు స్వాధీనం
శంషాబాద్, వెలుగు: కరెంటు ఇస్త్రీ పెట్టెలో దాచి భారీగా బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించగా శంషాబాద్ ఎయిర్పోర్టులో డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఆగస్ట్ 22న కువైట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికుల్లో ఓ వ్యక్తి బ్యాగు మరిచిపోయి వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు. బ్యాగు కోసం తిరిగి వస్తాడని అధికారులు ఎదురుచూసినా రాలేదు.
అనుమానం వచ్చిన ఆఫీసర్లు బ్యాగ్ పరిశీలించగా కరెంట్ ఇస్త్రీ పెట్టెలో 1261.800 గ్రాముల బంగారం లభించింది. బ్యాగ్ తెచ్చిన వ్యక్తిని కస్టమ్స్అధికారులు ఏపీ జిల్లా అన్నమయ్య జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. అతడికి సహకరించిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురి వద్ద 3379.600 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ సుమారు రూ.3.36 కోట్లు ఉంటుందని తెలిపారు.