పేరుకే మహిళా భద్రత కమిటీలు..ఫిర్యాదు చేస్తే సర్ధి చెప్పే ప్రయత్నాలు

పేరుకే మహిళా భద్రత కమిటీలు..ఫిర్యాదు చేస్తే సర్ధి చెప్పే ప్రయత్నాలు
  • మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల నివారణకు అంతర్గత కమిటీలు
  • లైంగిక వేధింపుల ఫిర్యాదులపై సీరియస్‌‌‌‌‌‌‌‌గా తీసుకోని కమిటీలు 
  •  ఫిర్యాదు చేస్తే సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు 
  • ఉమ్మడి జిల్లాలో ఇటీవల మూడు శాఖల్లో బయటపడిన వేధింపుల ఘటనలు 

జగిత్యాల, వెలుగు: మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి శాఖలో లైంగిక వేధింపులపై మహిళా భద్రతా కమిటీలను ఏర్పాటు చేసింది. లైంగిక, ఇతర వేధింపులపై ఫిర్యాదులు స్వీకరించి అంతర్గతంగా పరిష్కరించడం ఈ కమిటీల బాధ్యత. ఇందుకోసం జిల్లా స్థాయి నుంచి డివిజన్లు, మున్సిపాలిటీలు, మండల స్థాయిల వరకు నోడల్ అధికారులను నియమించింది. కాగా ఈ కమిటీలు మహిళా ఉద్యోగుల ఫిర్యాదులపై పెద్దగా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు తగ్గడం లేదు. 

కమిటీల  పాత్ర అంతంతమాత్రమే 

ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో మహిళా ఉద్యోగులు, టీచర్లు కలిపి దాదాపు 8 వేలకు పైగా ఉన్నారు. ప్రతి శాఖలో లైంగిక వేధింపుల నివారణ కమిటీలు ఉన్నా అవి నామమాత్రంగానే పనిచేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అవగాహన లేకపోవడం లేదా బయటకు చెబితే కెరీర్​పరంగా సమస్యలు వస్తాయన్న భయంతో మహిళా ఉద్యోగులు ఫిర్యాదులు చేయడం లేదు. 

సమస్య తీవ్రమైతేనే కలెక్టర్‌‌‌‌‌‌‌‌, ఎస్పీ.. వంటి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ కమిటీల్లో చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ సహా ఉద్యోగులు, ఉన్నతాధికారులు, అడ్వకేట్ల నుంచి నలుగురు సభ్యులుగా ఉంటారు. వీరు లైంగిక వేధింపులపై ఫిర్యాదు అందగానే బాధితులకు అండగా ఉంటూ విచారణకు సిఫార్సు చేస్తారు. కొన్ని సమస్యల్లో శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేయొచ్చు. సమస్య తీవ్రమైతే పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్లు, కోర్టులను ఆశ్రయించేలా మద్దతుగా నిలుస్తారు. కాగా రెండేళ్లలో కేవలం రెండు ఫిర్యాదులు రావడం గమనార్హం. 

ఇటీవల జరిగిన ఘటనలు 

పెగడపల్లి తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓ మహిళా ఉద్యోగితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ఈనెల 12న తనను వేధింపులకు గురిచేశాడని అతనిపై టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు ఈ విషయంలో కొందరు రాజకీయ నాయకులు ఇన్‌‌‌‌‌‌‌‌వాల్వ్​ అయినట్లు సమాచారం. అయినప్పటికీ డివిజన్ స్థాయి అధికారి వద్దకు వెళ్లి గోడు వెల్లబోసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్ చేశారు.

ఈఏడాది జూలై 19న జగిత్యాల జిల్లాలో డీసీపీవోగా పనిచేస్తున్న హరీశ్‌‌‌‌‌‌‌‌ తనను తరచూ వేధిస్తున్నాడంటూ అదే కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఔట్‌‌‌‌‌‌‌‌రీచ్ వర్కర్ వీడియో రిలీజ్ చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, కమిషన్ జూలై 5న చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నోటీసులు జారీ చేసింది. 

8 నెలల కింద జిల్లాలోని ఓ రెవెన్యూ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న ఓ టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తోటి ఉపాధ్యాయురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో నేరుగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి సదరు టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మెమో జారీ చేశారు. కాగా అప్పటికే ఓ ఉపాధ్యాయ సంఘం నాయకులు బాధితురాలిపై రాజీ కుదుర్చుకోమని ఒత్తిడి చేసినట్లు సమాచారం. 

అంతర్గతంగానే సర్ధి చెప్పే ప్రయత్నాలు 

జిల్లాలోని వివిధ శాఖల్లో జరిగే వేధింపుల ఘటనలు చాలా సార్లు బయటకు రాకుండా లోలోపలే సర్దిచెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు వెలుగులోకి రాకూడదని సమస్యను నొక్కిపెట్టేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా వేధింపులకు పాల్పడినవారు తప్పించుకుంటున్నారు. గతంలో కోరుట్లలో ఓ శాఖలో ఉన్నతాధికారి ఇద్దరు మహిళా ఉద్యోగులను వేధించినా రాజకీయ జోక్యంతో శిక్ష పడకుండానే కేసు తేలిపోయింది.

 జిల్లా విద్యాశాఖలో ఇటీవల ఓ ఉద్యోగిని వేధించిన సహోద్యోగిపై కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. గతంలో కూడా ఒక ఉద్యోగిని వేధించిన కారణంగా సస్పెండ్ చేశారు.