వడ్లు ఉన్నాయా .. సీఎంఆర్ మిల్లుల్లో ఎఫ్ సీఐ, సివిల్ సప్లై తనిఖీలు

వడ్లు ఉన్నాయా .. సీఎంఆర్ మిల్లుల్లో ఎఫ్ సీఐ, సివిల్ సప్లై తనిఖీలు
  •  నాలుగు రోజులుగా కంటిన్యూ
  •  ముగిసిన సీఎంఆర్ గడువు
  •  పొడిగింపుపై సెంట్రల్ కు లెటర్ 
  •  మిల్లుల్లో వడ్ల లెక్క తీయాలని ఆదేశాలు 
  •   రంగంలోకి దిగిన బృందాలు

యాదాద్రి, వెలుగు : గడువు ముగిసినా వానాకాలం సీఎంఆర్​అప్పగించకపోవడంతో సివిల్ సప్లయ్, ఎఫ్​సీఐ రంగంలోకి దిగింది. అసలు మిల్లుల్లో వడ్లు ఉన్నాయా..? దారి మళ్లించారా..? అనే కోణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్ని మిల్లులు సీజన్ల వారీగా వడ్ల బస్తాలను వేర్వేరు స్టాక్​ చేయగా, మరికొన్ని మిల్లులు గంపగుత్తగా ఒకే చోట స్టాక్​ చేశారు. దీంతో వడ్ల బస్తాలను లెక్కించడం ఆఫీసర్లకు ఇబ్బందిగా మారింది. 

గడువు ముగిసినా అప్పగించని సీఎంఆర్..

2024 వానాకాలం సీజన్​లో 2,22,444 టన్నులను సివిల్ సప్లయ్​డిపార్ట్​మెంట్ సేకరించింది. సీఎంఆర్ కోసం జిల్లాలోని 48 మిల్లులకు వాటి కెపాసిటీ ఆధారంగా కేటాయించారు. ఈ వడ్లకు సీఎంఆర్ రూపంలో 1,01,163 టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అప్పగించాల్సి ఉంది. సీఎంఆర్ అప్పగించడానికి మే 15తో గడువు ముగిసింది. ఇప్పటివరకు 68,7911(68 శాతం) టన్నులను సివిల్ సప్లయ్, ఎఫ్​సీఐకి మిల్లర్లు అప్పగించారు. ఇంకా 49,430 టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అప్పగించాల్సి ఉంది. ఇందులో 14 మిల్లులు తమ వడ్లకు సంబంధించిన సీఎంఆర్​లో 95 నుంచి 100 శాతం అప్పగించారు. బకాయి ఉన్న సీఎంఆర్​ సేకరణ కోసం సెంట్రల్ గవర్నమెంట్​కు సివిల్ సప్లయ్ డిపార్ట్​మెంట్ లెటర్ రాసింది. 

వడ్లు ఉన్నాయా..? చెక్​ చేయండి..

సివిల్ సప్లయ్​డిపార్ట్​మెంట్ లెటర్ అందుకున్న కేంద్ర ప్రభుత్వం సీఎంఆర్ సేకరణ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. గడువు పెంపు సంగతి సరే.. సీఎంఆర్ బకాయిగా ఉన్న మిల్లుల్లో అసలు.. ‘వానాకాలం వడ్లు ఉన్నాయా..?’ అని అనుమానం వ్యక్తం చేసింది. ముందు సీఎంఆర్​ పెండింగ్​ఉన్న మిల్లులను చెక్ చేసి వడ్లు ఉన్నాయో.. లేవో..? తేల్చండి అంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎఫ్​సీఐ, సివిల్ సప్లయ్ డిపార్ట్​మెంట్​మూడు టీములుగా ఏర్పడి 90 నుంచి 100 శాతం సీఎంఆర్​అప్పగించిన మిల్లులను పక్కన పెట్టి మిగతా వాటిల్లో తనిఖీలు నిర్వహిస్తోంది.  

రెండు సీజన్ల వడ్లు కలిపి..

2024 వానాకాలం సీజన్ వడ్లను దారిమళ్లించిన మిల్లర్లు.. 2025 యాసంగి వడ్లను చూపించే అవకాశం ఉందని ఆఫీసర్లు భావించి రెండు సీజన్ల వడ్లను లెక్కిస్తున్నారు. అయితే ఎఫ్​సీఐ, సివిల్ సప్లయ్ టీమ్స్​కు లెక్కింపు సమయంలో కొన్ని మిల్లుల్లో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. కొందరు మిల్లర్లు వడ్ల స్టాక్​ లెక్కింపునకు అనువుగా పేర్చగా, మరికొందరు అడ్డదిడ్డంగా పేర్చారు. 2024 వానాకాలం సీజన్​వడ్లు, 2024–25  యాసంగి సీజన్లకు సంబంధించి వేర్వేరుగా స్టాక్స్ పేర్చగా, మరికొందరు మిక్సింగ్ చేశారు. దీంతో ఆఫీసర్లకు లెక్కింపు కొంత ఇబ్బందిగా మారినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు సగం మిల్లుల్లో లెక్కింపు ముగిసింది. 

తనిఖీలు చేస్తున్నాం

2024 వానాకాలం సీజన్ సీఎంఆర్ బకాయిగా ఉన్న మిల్లుల్లో తనిఖీలు చేస్తున్నాం. ఏ మిల్లుకా మిల్లు రిపోర్ట్ రెడీ చేస్తున్నాం. తనిఖీలు ముగిసిన తర్వాత రిపోర్ట్​ను హయ్యర్ ఆఫీసర్లు అందజేస్తాం. 

హరికృష్ణ, డీఎం, యాదాద్రి