
- ఎప్ సెట్ లో ర్యాంకు ఎంతొచ్చినా మొత్తం ఫీజు రీయింబర్స్ మెంట్
- గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో చదివిన వారికీ వర్తింపు
- రూ.2 లక్షల లోపు ఇన్ కమ్ ఉంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్లకు పూర్తి ఫీజు
- 6న ఎప్ సెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలు
- ఇవ్వాలో, రేపో బీటెక్ ఫస్టియర్ సీట్ల వివరాలు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సర్కారు ఇంటర్కాలేజీల్లో చదివిన విద్యార్థులకు ఫ్రీ ఇంజినీరింగ్ సీటు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నది. టీజీఈఏపీసెట్ లో ఎంత ర్యాంకు వచ్చినా ఇంజినీరింగ్ చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తోంది. తద్వారా పేద విద్యార్థులు మంచి కాలేజీలో చదువుకునే అవకాశం లభిస్తోంది. కాగా, ఇప్పటికే ఎప్ సెట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈ నెల 6 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలుకానున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫీజు రీయింబర్స్ మెంట్ స్కీము తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది కంటిన్యూ అవుతోంది. 2025–26 విద్యా సంవత్సరంలో బీటెక్ ఫస్టియర్ లో ప్రవేశాల కోసం గతనెల 28న అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
గురువారం నాటికి 88,802 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోగా.. 40 వేల మందికి పైగా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ క్రమంలోనే ఆదివారం నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. అయితే, ఈ ఏడాది బీటెక్ లో ఫీజుల పెంపు లేకపోవడం విద్యార్థులకు, పేరెంట్స్ కు పెద్ద ఊరటనే. కాగా, బీసీ, ఓసీ విద్యార్థులకు మాత్రం ఎప్ సెట్ లో పదివేల ర్యాంకు లోపు వచ్చిన వారికి మాత్రమే వందశాతం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వనున్నది. ఆ తర్వాతి ర్యాంకర్లకు కాలేజీలో ఎంత ఫీజు ఉన్నా.. ప్రభుత్వం మినిమమ్ ఫీజు రూ.35వేలు చెల్లించనుండగా, మిగిలిన మొత్తాన్ని విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది. అయితే, వీళ్లంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. కుటుంబ వార్షికాదాయం ప్రభుత్వం నిర్ణయించిన స్థాయికి మించి ఉంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ వారికి రాదు. మొత్తం ఫీజును విద్యార్థులే కట్టాల్సి ఉంటుంది.
త్వరలో సీట్లపై క్లారిటీ..
గత నెల30న ఏఐసీటీఈ నుంచి రాష్ట్రంలో అనుమతి పొందిన ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల లిస్టు వచ్చింది. 153 కాలేజీలకు అనుమతి రాగా.. వాటిలో సుమారు 1.30 లక్షల సీట్లకు పర్మిషన్ ఇచ్చింది. వీటిపై జేఎన్టీయూ సహా ఇతర వర్సిటీలు కాలేజీల్లోని వసతులపై మూడు రోజులుగా మేనేజ్మెంట్లతో సమావేశమవుతున్నాయి. ఆయా కాలేజీల్లో ఎన్ని సీట్లకు అనుమతించాలనే దానిపై చర్చిస్తున్నారు. ఈ నెల 6 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఇవ్వాలో, రేపో కాలేజీల్లోని సీట్లపై స్పష్టత రానున్నది. ఈ ఏడాది కోర్ సీట్లను తగ్గించకుండా, కొత్తగా అడిగితే పర్మిషన్ ఇవ్వనున్నారు. మరోపక్క కంప్యూటర్ సైన్స్ సీట్లపైనా సాధ్యమైనన్ని తక్కువగా పెంచే అవకాశం ఉంది.