E20 పెట్రోల్ వాడితే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతాయా? ICICI ఏమంటోందంటే..

E20 పెట్రోల్ వాడితే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతాయా? ICICI ఏమంటోందంటే..

దేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి, క్రూడ్ దిగుమతులను అదుపు చేయడానికి ప్రభుత్వం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అందుబాటులోకి తెస్తోంది. అయితే ఈ మార్పు వాహనదారుల్లో ఒక పెద్ద గందరగోళానికి కారణమైంది. ముఖ్యంగా పాత వాహనాల్లో E20 ఇంధనాన్ని వాడితే.. భవిష్యత్తులో వచ్చే ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను కంపెనీలు తిరస్కరిస్తాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి కారణం ఇన్సూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ లోంబార్డ్ గతంలో పెట్టిన ఒక బ్లాగ్ పోస్టే.

వాహనానికి సరిపడని పెట్రోల్ వేరియంట్స్ వాడటం అనేది నిర్లక్ష్యం కిందికే వస్తుంది, కాబట్టి క్లెయిమ్‌లను తిరస్కరించే అవకాశం ఉందని ఆ బ్లాగ్‌లో ఐసీఐసీఐ పేర్కొనడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో E20 పెట్రోల్ వల్ల వాహనదారులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం మెుదలైంది.

ఈ వివాదంపై నెటిజన్ల నుంచి వ్యతిరేకత రావడంతో.. ఐసీఐసీఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తక్షణమే స్పందించి ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాహనదారుల భయాలను పటాపంచలు చేస్తూ సంస్థ కీలక విషయాలను వెల్లడించింది..

* పాలసీలు పూర్తిగా వర్తిస్తాయి: E20 ఇంధనాన్ని ఉపయోగించినంత మాత్రాన మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు రద్దు కావు. అవి ఎప్పటిలాగే పూర్తిగా చెల్లుబాటు అవుతాయి.
* నిర్లక్ష్యంగా భావించము: పాత వాహనాల్లో E20 ఇంధనాన్ని ఉపయోగించడాన్ని తాము నిర్లక్ష్యంగా పరిగణించబోమని కంపెనీ స్పష్టం చేసింది. పైగా ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్‌ను పర్యావరణహితమైన ప్రగతిశీల అడుగుగా స్వాగతిస్తున్నట్లు తెలిపింది.
* ఇంధనం ఆధారంగా రిజెక్షన్స్ ఉండవు: పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ లాగే E20 కూడా ఒక ఇంధనమే. క్లెయిమ్ అడ్మిసిబిలిటీని నిర్ణయించడంలో ఇంధనం రకం ఎన్నడూ ప్రామాణికం కాదని తేల్చి చెప్పింది. సాంప్రదాయ ఇంధనంతో క్లెయిమ్ ఎలా వస్తుందో.. E20 ఇంధనంతోనూ అలాగే లభిస్తుంది.

క్లెయిమ్‌లను ఎలా అంచనా వేస్తారు?

ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు అనేవి వాహనంలో వాడే ఇంధనం మీద కాకుండా, జరిగిన ప్రమాదం లేదా సంఘటన ఆధారంగా మాత్రమే అంచనా వేయబడతాయని ఐసీఐసీఐ లోంబార్డ్ స్పష్టం చేసింది. పాలసీదారులు ఎంచుకున్న కవరేజ్ పరిధిలోకి వచ్చే ప్రమాదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా క్లెయిమ్ లభిస్తుంది.
1. వాహన ప్రమాదాలు
2. దొంగతనాలు
3. థర్డ్-పార్టీ లయబిలిటీస్ 
4. యజమాని-డ్రైవర్ లేదా ప్రయాణికులకు జరిగే వ్యక్తిగత ప్రమాదాలు

వాహనదారులకు ఎందుకు ఊరట?
ప్రభుత్వం ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకాన్ని ఎంత ప్రోత్సహిస్తున్నా.. వాహనదారులు తమ పాత బండ్ల ఇన్సూరెన్స్ విషయంలో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఐసీఐసీఐ లోంబార్డ్ ఇచ్చిన ఈ అధికారిక స్పష్టతతో వాహనదారులకు పెద్ద ఊరట వచ్చింది. కేవలం ఇంధనం మార్పును సాకుగా చూపి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా క్లెయిమ్‌లను తిరస్కరించలేదని ఈ ప్రకటన ద్వారా స్పష్టమైంది. సో E20 ఇంధనం వాడుతున్న వారు ఎలాంటి భయాలు అక్కర్లేదు ఇన్సూరెన్స్ కవరేజీ, క్లెయిమ్స్ విషయంలో.