ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతా: సోయం బాపూరావు

ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతా: సోయం బాపూరావు

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: ఆదివాసీల హక్కులు, సమస్యల పరిష్కారం కోసమే రాజ్​గోండు సేవా సమితిని స్థాపించామని రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ సోయం బాపూరావు తెలిపారు. దేశంలోని అన్ని వ్యవస్థలపైన బీజేపీ దాడి చేస్తుందని ఆరోపించారు.  బీజేపీ దాడులను ఆపడానికి సమితి పోరాడుతుందని చెప్పారు.  ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎస్​టీయూ భవన్​​లో ఆదివారం రాజ్​గోండు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా సోయం బాపురావు ప్రమాణ స్వీకారం చేశారు. వివిధ రాష్ర్టాల నుంచి ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. 

అంతకుముందు టౌన్ లో కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి భారీ ర్యాలీ తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి, ఆదివాసీలకు వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తను బీజేపీలో ఉన్నప్పటికీ ఆదివాసీల హక్కుల కోసం ఖానాపూర్​ఎమ్మెల్యేగా బొజ్జు పటేల్​ను గెలిపించాలని పిలుపునిచ్చానని గుర్తుచేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ​కుట్ర పన్ని జీఓ నంబర్.49 తీసుకొచ్చాయని, భవిష్యత్ లోనూ అమలు చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

ఈ సందర్భంగా తీర్మానం చేసిన11 అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. సంఘాలను ఎవరూ కూడా విమర్శించవద్దని, ఏదైనా సమస్య ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలని ఖానాపూర్​ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు.  సోయం బాపురావుతోనే ఆదివాసీ సంఘం బలోపేతమైందని పేర్కొన్నారు.  ఆయనకు మద్దతుగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. 

కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్​ మల్లెపూల నర్సయ్య, సంఘం జిల్లా అధ్యక్షుడు పంద్రం శంకర్, రాష్ట్ర కార్యదర్శి విషం రావు, జాతీయ ఉపాధ్యక్షుడు సీడం అర్జు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాంగ్రెస్​ నేతలు ఆత్రం సుగుణ, కంది శ్రీనివాస్​రెడ్డి, ఆడె గజేందర్, శ్రీకాంత్​రెడ్డి, పసుల చంటి, బోథ్​ ఆత్మ చైర్మన్​ రాజు యాదవ్​ తదితరులు పాల్గొన్నారు.