- బీజేపీపై మండిపడ్డ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
చండీగఢ్: ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ ఎప్పుడూ నెరవేర్చలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీ ఎక్స్ పర్ట్ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం హర్యానాలో పర్యటించారు. ఈ సందర్భంగా చర్కీ దాద్రీలోని బధ్రాలో నిర్వహించిన బహిరంగ సభలో ఖర్గే మాట్లాడుతూ.." అక్టోబర్ 2న మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.
మహాత్మాగాంధీ మనకు సత్యం, అహింస నేర్పారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నవారు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. గత పదేళ్లలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీలకు పరిమితే లేదు. తాను గెలిస్తే దేశంలోని ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పారు. కానీ ఇప్పటిదాకా రూపాయి కూడా వేయలేదు. పదేళ్లు ప్రధానిగా ఉన్న వ్యక్తి ఇలా అబద్ధాలు చెప్పొచ్చా? మాజీ ప్రధానులు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇలా ఎప్పుడైనా హామీ ఇచ్చి నెరవేర్చకుండా ఉన్నారా ? యువతకు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ లెక్కన పదేళ్లలో ఇవ్వాల్సిన 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయి? హర్యానాలో 1.60 లక్షల పోస్టుల ఖాళీగా ఉన్నా బీజేపీ సర్కార్ భర్తీ చేయలేదు. కానీ ఇప్పుడు మళ్లీ గెలిస్తే ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెబుతోంది" అని ఖర్గే పేర్కొన్నారు. ఈ నెల 5న హర్యానా ఎన్నికలు జరగనుండగా..8న ఫలితాలు వెలువడుతాయి.