
- ఓటు హక్కుపై నెల రోజులుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపట్టిన ఎన్నికల అధికారులు
- ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో సిటీలో54 శాతంలోపే ఓటింగ్
హైదరాబాద్, వెలుగు: ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గ్రేటర్ పరిధిలో ఓటింగ్ శాతం తక్కువగానే నమోదవుతుంటుంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 54 శాతానికి మించి ఓటింగ్ నమోదు కాలేదు. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొంత తేడా కనిపి స్తోంది. ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన అవేర్ నెస్ ప్రోగ్రామ్స్‌తో సిటీ ఓటర్లు బాగా చైతన్యమైనట్లుగా తెలుస్తోంది. గతంలో ఎన్నడూ జరగని రీతిలో ఈసారి గ్రేటర్ సిటీలో రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నెల రోజుల నుంచి ఎవరికి వారు తమదైన పద్ధతులతో ప్రచారం నిర్వహించారు. అయితే, ఓటర్లు ఎటు వైపు నిలుస్తారన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది.
మారిన పరిస్థితుల్లో పెరిగిన ఎన్నికల జోష్
గ్రేటర్హైదరాబాద్ పరిధిలో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారన్న విషయంపైనే ఇప్పుడు వివిధ పార్టీల అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇయ్యాల జరిగే పోలింగ్‌పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకనుగుణంగానే ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, బహిరంగ ప్రదేశాలు, సర్కిళ్లలో ఓటు హక్కు విలువను తెలియజేస్తూ ప్రచా
రాలు నిర్వహించారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా అవగాహన కల్పించాయి. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ పోలింగ్ రోజున టూర్లకు వెళ్లకుండా.. ఓటు వేసేలా వారిని చైతన్యం చేసేందుకు అధికారులు ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు. హైదరాబాద్ సిటీలో 7.5 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉండగా.. వీరిలో చాలామంది హైదరాబాద్‌లోనే పుట్టి ఇక్కడే ఓటు హక్కును కలిగి ఉన్నట్లు అంచనా. ఈసారి వారంతా కచ్చితంగా ఓటు వేసేలా ఎన్నికల సంఘం అధికారులు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపట్టారు.
సరైన తీర్పు ఇవ్వాలి..
ప్రతి ఎన్నికల్లోనూ గ్రేటర్ సిటీ వాసులు ఓటు వేయడంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటివరకూ జరిగిన జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే సిటీలో పోలింగ్ శాతం 54 శాతం లోపే ఉండటం ఆందోళన కలిగిస్తోందని ఎన్నికల అధికారులు, ప్రజాస్వామ్య వాదులు చెబుతున్నారు. ఉన్న ఓటర్లలో సగానికి సగం మంది ఓటేయకపోవడం వల్ల అతి తక్కువ మెజార్టీ తెచ్చుకున్న వారు సైతం ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని.. మెజార్టీ ప్రజలు సరైన తీర్పు ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రజాస్వామ్య వాదులు చెబుతున్నారు. అయితే, ఈసారి ఎన్నికల అధికారులు చేపట్టిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కారణంగా ఓటింగ్ శాతం పెరిగే అవకాశముందంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఓటర్లు చైతన్యవంతులైనట్లు తెలుస్తోంది.