అయోమయానికి గురికావొద్దు .. 70 సీట్లలో మాదే విజయం: కేటీఆర్​

అయోమయానికి  గురికావొద్దు .. 70 సీట్లలో మాదే విజయం: కేటీఆర్​

 

  • ఎగ్జిట్​ పోల్స్​తో సంబంధం లేకుండా గెలుస్తం
  • నకిలీ వీడియోలను సర్క్యులేట్​ చేసేవాళ్లపై ఈసీ చర్యలు తీసుకోవాలి
  • ఎగ్జిట్​ పోల్స్​ తప్పయితే ఆయా సంస్థలు క్షమాపణ చెప్పాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: ఎగ్జిట్​పోల్స్​తో కార్యకర్తలు అయోమయానికి గురికావొద్దని, 70 సీట్లలో బీఆర్​ఎస్​ పార్టీనే గెలుస్తుందని ఆ పార్టీ​వర్కింగ్​ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​అన్నారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ముగిసిన అనంతరం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 21న బీఆర్ఎస్​అభ్యర్థులను ప్రకటించిన రోజు నుంచి పార్టీ గెలుపు కోసం పని చేసిన కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు చెప్తున్నట్లు పేర్కొన్నారు.

 ఎగ్జిట్​పోల్స్​తో సంబంధం లేకుండా గెలుస్తామన్న ధీమా ఉందని అన్నారు. 2018లో ఒక్క ఏజెన్సీ మినహా మిగతావన్నీ తప్పుడు ఫలితాలు ఇచ్చాయని విమర్శించారు.  ఎగ్జిట్​పోల్స్​తప్పు అని నిరూపించడం తమ పార్టీకి కొత్త కాదని కేటీఆర్​ అన్నారు. అసలైన ఫలితం డిసెంబర్​ 3న వస్తుందని, మరోసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓటర్లు క్యూలైన్లలో ఉన్నప్పుడు ఎగ్జిట్​పోల్స్ ప్రకటిస్తే వాళ్లు ప్రభావితం అవుతారని, దీనిపై ఎలక్షన్​కమిషన్​ఆలోచించాలని అన్నారు. ఇదే అంశంపై సీఈవోతో మాట్లాడితే ఎన్నికల కమిషన్​నిబంధనలు అలా ఉన్నాయని చెప్తున్నారని కేటీఆర్​ పేర్కొన్నారు. ఎగ్జిట్​పోల్స్​తప్పని తేలితే ఆయా సంస్థలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ ​చేశారు.

 అబద్ధాలు, నకిలీ వీడియోలతో ప్రజలను ప్రభావితం చేసే పార్టీలపై ఎలక్షన్​కమిషన్​చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంత పోలింగ్​నమోదైందనే వివరాలు శుక్రవారం ఉదయమే వస్తాయని, అప్పుడు సరైన విశ్లేషణలు చేయడానికి అవకాశం ఉంటుందని కేటీఆర్​ తెలిపారు. ఒక్క హైదరాబాద్​లోనే కాదు అన్ని మెట్రో సిటీల్లో ఓటింగ్​శాతం తక్కువగానే నమోదవుతుందని, సిటీ జనాలు బయటకు వచ్చి ఓట్లు వేయాలని తాము అప్పీల్​చేశామని అన్నారు.