మరో వీరేంద్రుడిలా రోహిత్?

మరో వీరేంద్రుడిలా రోహిత్?

ఐసీసీ టెస్ట్‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌లో టీమిండియా నంబర్‌‌‌‌వన్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌లో ఉంది. దానికి తగ్గట్టుగానే కరీబియన్‌‌‌‌ గడ్డపై రెండు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను క్లీన్‌‌‌‌ స్వీప్‌‌‌‌ చేసింది. దీనికితోడు ప్రతిష్టాత్మక టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ను కూడా ఘనంగా ఆరంభించింది. ఇంతవరకు అంతా ఓకే అనుకున్నా.. విరాట్‌‌‌‌సేనకు అసలు సిసలు సవాలు ఇప్పుడు ఎదురుకాబోతున్నది. సొంతగడ్డపై బలమైన పేస్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ లైనప్‌‌‌‌ ఉన్న సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌‌‌‌ల టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌ ఆడనుంది. ఈ సిరీస్‌‌‌‌ కోసం సెలెక్షన్‌‌‌‌ కమిటీ టీమిండియాను గురువారం ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ మిడిలార్డర్‌‌‌‌తోనే ఇబ్బంది అనుకుంటే.. ఇప్పుడు ఓపెనింగ్‌‌‌‌ కూడా అతిపెద్ద సమస్యగా మారింది. ఎంతమందిని ప్రయత్నించినా.. టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో విరాట్‌‌‌‌, పుజారాపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. ఆశలు పెట్టుకున్న ఆటగాళ్లందరూ ఫామ్‌‌‌‌తో ఇబ్బందులుపడుతున్న తరుణంలో టీమ్‌‌‌‌ కూర్పు ఎలా ఉండనుంది?

సెహ్వాగ్‌‌‌‌ ఫార్ములా..

వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ ఫామ్‌‌‌‌ తర్వాత రోహిత్‌‌‌‌ శర్మను టెస్ట్‌‌‌‌ల్లోనూ ఆడించాలనే డిమాండ్లు భారీగా పెరిగాయి. అందుకు అనుగుణంగా విండీస్‌‌‌‌ తీసుకెళ్లినా ఒక్క మ్యాచ్‌‌‌‌ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. గతంలో మిడిలార్డర్‌‌‌‌లో అవకాశం ఇచ్చినా.. ఈ ముంబైకర్‌‌‌‌ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో లిమిటెడ్‌‌‌‌ ఓవర్ల మాదిరిగా టెస్ట్‌‌‌‌ల్లోనూ రోహిత్‌‌‌‌ను ఓపెనర్‌‌‌‌ను చేయాలనే డిమాండ్‌‌‌‌ పెరిగింది. ఒకవేళ ఈ డిమాండ్‌‌‌‌ను సెలెక్షన్‌‌‌‌ కమిటీ నెరవేర్చినా..  ఓపెనర్‌‌‌‌గా రోహిత్‌‌‌‌ విఫలమైతే ఎలా? దీనికి సమాధానం లేకపోయినా.. కోచ్‌‌‌‌ రవిశాస్త్రి, కెప్టెన్‌‌‌‌ కోహ్లీ ముందు ఒకే ఒక్క అప్షన్‌‌‌‌ ఉంది. అదే ‘సెహ్వాగ్‌‌‌‌ ఫార్ములా’. అంటే రోహిత్‌‌‌‌ ఓపెనర్‌‌‌‌గా పంపడం.. ఉన్నంతసేపు చితక్కొట్టడం. బౌలర్లను భయపెట్టి తర్వాత వచ్చే వారికి రూట్‌‌‌‌ క్లియర్‌‌‌‌ చేయడం. గతంలో వీరూ ఎలా ఆడాడో.. అలాంటి పాత్రలోకి ఈ ముంబైకర్‌‌‌‌ను పునఃప్రవేశం చేయించడం. దీనివల్ల ఓపెనింగ్‌‌‌‌ బాధ తీరడంతో పాటు రోహిత్‌‌‌‌కు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది కాస్త రిస్క్‌‌‌‌తో కూడుకున్నదే అయినా.. అత్యంత టెక్నికల్‌‌‌‌గా బ్యాటింగ్‌‌‌‌ చేసే రోహిత్‌‌‌‌కు సెహ్వాగ్‌‌‌‌లా ఆడటం పెద్ద లెక్క కాదు. రెండో ఎండ్‌‌‌‌లో మయాంక్‌‌‌‌ కాస్త ఓపిక చూపెడితే చాలు. మూడు, నాలుగులో పుజారా, కోహ్లీ ఎలాగూ ఉంటారు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. మిడిలార్డర్‌‌‌‌లో రహానె, విహారిపై భారం కూడా తగ్గుతుంది. ఈ ప్రయోగం సక్సెస్‌‌‌‌ అయితే.. రాబోయే రోజుల్లో రాహుల్‌‌‌‌, ధవన్‌‌‌‌, విజయ్‌‌‌‌,  పృథ్వీ.. ఇలా ఎవరు వచ్చినా ఓపెనింగ్‌‌‌‌లో పెద్దగా ఫరక్‌‌‌‌ పడదు.

ఇక సౌతాఫ్రికాతో సిరీస్‌‌‌‌ విషయానికొస్తే.. సీనియర్లు ధవన్‌‌‌‌, విజయ్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో లేకపోవడంతో మార్పులు అనివార్యం. గత 30 టెస్ట్‌‌‌‌ల్లో 664 పరుగులు మాత్రమే చేసిన కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ను కొనసాగించడం కష్టమే. గత ఏడు మ్యాచ్‌‌‌‌ల్లో కనీసం సింగిల్‌‌‌‌ హాఫ్‌‌‌‌ సెంచరీ కూడా చేయలేదు. కాబట్టి అతని స్థానంలో రోహిత్‌‌‌‌ను ఎంపిక చేస్తే… బెంగాల్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ అభిమన్యు ఈశ్వరన్‌‌‌‌కు రిజర్వ్‌‌‌‌ ఓపెనర్‌‌‌‌గా అవకాశం ఇవ్వొచ్చు. డొమెస్టిక్‌‌‌‌, ఇండియా–ఎ తరఫున అతను పరుగుల వరద పారించాడు. ఒకవేళ ఎవరైనా గాయపడినా అతన్ని మిడిల్‌‌‌‌లోనూ ఉపయోగించుకోవచ్చు. ప్రియాంక్‌‌‌‌ పాంచల్‌‌‌‌, శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ కూడా రేసులో ఉన్నా.. మయాంక్‌‌‌‌ నాలుగు మ్యాచ్‌‌‌‌లు ఆడినా మూడు హాఫ్‌‌‌‌ సెంచరీలు కొట్టాడు. ఇక మిగతా సెలెక్షన్‌‌‌‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌లేని భువనేశ్వర్‌‌‌‌ ఈ సిరీస్‌‌‌‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. టీ20 ప్రపంచకప్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుంటే హార్దిక్‌‌‌‌ పాండ్యాను వైట్‌‌‌‌బాల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌కే పరిమితం చేయొచ్చు. బ్యాకప్‌‌‌‌ పేసర్‌‌‌‌గా నవ్‌‌‌‌దీప్‌‌‌‌ సైనీ రావొచ్చు. స్పెషలిస్ట్‌‌‌‌ కీపర్‌‌‌‌గా సాహా అందుబాటులోకి వచ్చినా.. రిషబ్‌‌‌‌కే ఎక్కువ చాన్స్‌‌‌‌ ఉంది. ముగ్గురు స్పిన్నర్లుగా జడేజా, కుల్దీప్‌‌‌‌, అశ్విన్‌‌‌‌, ముగ్గురు పేసర్లుగా బుమ్రా, ఇషాంత్‌‌‌‌, షమీ అందుబాటులో ఉన్నారు. షమీకి విశ్రాంతి ఇవ్వాలనుకుంటే ఉమేశ్‌‌‌‌ యాదవ్‌‌‌‌ వస్తాడు. అక్టోబర్‌‌‌‌ 2 నుంచి విశాఖలో తొలి టెస్ట్‌‌‌‌… ఆ తర్వాతి రెండు మ్యాచ్‌‌‌‌లు పుణే, రాంచీలో జరుగనున్నాయి