చేపలు ఫుల్.. జిల్లాలో పెరిగిన చేపల దిగుబడులు

చేపలు ఫుల్..  జిల్లాలో పెరిగిన చేపల దిగుబడులు
  • ఏటా 10 వేల టన్నులకు పైగా ఉత్పత్తి 
  • లోకల్​గా కేజీ రూ.200 లోపే అమ్మకం
  • మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్​కు సప్లై
  • 31వేల కుటుంబాలకు జీవనోపాధి

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. వివిధ ప్రాజెక్టులతో పాటు చెరువుల్లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో సీడ్ వేసి చేపలను పెంచుతున్నారు. గతంలో జిల్లాలో చేపల కొరత ఉండగా.. ఐదారేండ్ల నుంచి వినియోగానికి మించి దిగుబడులు వస్తున్నాయి. ఈ చేపలను జిల్లాలోని వివిధ మార్కెట్లలో అమ్మడంతో పాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్​కు సప్లై చేస్తున్నారు. మత్స్య పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 31 వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. 

ఫ్రీగా చేప పిల్లల సప్లై 

జిల్లాలో 136 మత్స్య సహకార పారిశ్రామిక సంఘాలున్నాయి. వీటిలో 7,876 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉండగా, మరో 1,180 మంది లైసెన్స్​హోల్డర్లు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 389 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులతో పాటు మైనర్ ట్యాంకులు ఉన్నాయి. వీటిలో ప్రతి ఏటా 2 కోట్లకు పైగా చేప పిల్లలను ప్రభుత్వం నుంచి ఫ్రీగా విడుదల చేస్తున్నారు. ఈ సంవత్సరం 226.12 కోట్ల చేప పిల్లలను వదులుతున్నారు. 378 ట్యాంకుల్లో 35 నుంచి 40 ఎంఎం, 11 ట్యాంకుల్లో 80 నుంచి 100 ఎంఎం చేప పిల్లలను వేస్తున్నారు. ఇవి ఐదారు నెలల్లోనే కిలోకు పైగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. 

పెరిగిన దిగుబడులు 

గత ఐదారు సంవత్సరాలుగా జిల్లాలో చేపల ఉత్పత్తి పెరుగుతోంది. 2020–21లో 6,009 టన్నుల దిగుబడి రాగా, 2021–22 లో 9,636 టన్నుల దిగుబడి తీశారు. 2022–23లో ఏకంగా 12,486 టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయి. 2023–24లో 11,451 టన్నులు, 2024–25లో 10,658 టన్నుల దిగుబడులు వచ్చాయి. ప్రభుత్వం ట్యాంకుల్లో ఉచితంగా చేప పిల్లలను వదలడమే కాకుండా వాటికి దాణా సైతం సప్లై చేస్తోంది. మత్స్యకారులకు అనేక రకాల ప్రోత్సాహకాలను సబ్సిడీపై అందిస్తోంది. 

గోదావరి చేపలకు డిమాండ్

ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలతో పాటు ర్యాలీ వాగు, గొల్లవాగు, నీల్వాయి వాగు మీడియం ప్రాజెక్టుల్లోని చేపలకు జిల్లాలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. జిల్లాలో ఎక్కువగా కట్ల (బొచ్చె), రోహు (రవ్వ), బంగారుతీగ, మోసు, గడ్డి చేప, ముర్రెల్ (కోరమీను) రకాలు ఉత్పత్తి అవుతున్నాయి. కోరమీనుకు హైదరాబాద్ మార్కెట్​లో మంచి డిమాండ్ ఉంది. అక్కడ కిలో రూ.500 నుంచి రూ.600 వరకు పలుకుతాయి. ఇతర రకాలను లోకల్​గా కిలో రూ.200 చొప్పున అమ్ముతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర హోల్​సేల్​గా రూ.120 నుంచి రూ.150కే విక్రయిస్తున్నారు. బడా వ్యాపారులు హోల్​సేల్​గా కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తున్నారు.

జిల్లాలో వినియోగం తక్కువే..

మాంసాహారంలో చేపలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆరోగ్యానికి  చేపలు ఎంతో మంచివని వైద్య నిపుణులు చెప్తున్నారు. మన దేశంలో జాతీయ సగటు వినియోగం ఏటా 14 నుంచి 16 కిలోలు. కానీ మన రాష్ట్రంతో పాటు జిల్లాలో సగటున 4.50 కేజీల నుంచి 6.50 కేజీలు మాత్రమే తింటున్నారు. జిల్లా జనాభా 8 లక్షలు కాగా.. జాతీయ సగటు వినియోగం ప్రకారం ఏటా 12 వేల టన్నుల చేపలు అవసరం. ప్రస్తుతం 4 నుంచి 5 వేల టన్నులు మాత్రమే వినియోగిస్తున్నారు. దీంతో మిగిలిన చేపలను వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.   అవినాశ్, ఫిషరీస్​ ఏడీ, మంచిర్యాల