- 17 రోజులుగా హోరెత్తిన క్యాంపెయిన్
- ఇంటింటికీ వెళ్లిన కాంగ్రెస్ లీడర్లు, కేడర్
- స్వయంగా ప్రచారంలోకి దిగిన సీఎం రేవంత్
- సిట్టింగ్ సీటును కాపాడుకునే పనిలో బీఆర్ఎస్
- స్టార్ క్యాంపెయినర్ లిస్టులో కేసీఆర్ పేరు ఉన్నా ప్రచారానికి రాలే
- త్రిముఖ పోరులో ఓట్లు చీలి తమకు కలిసి వస్తుందంటున్న బీజేపీ
- ఎల్లుండి పోలింగ్.. ఫలితాన్ని నిర్దేశించనున్న బీసీ, మైనారిటీల ఓట్లు
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ హీటెక్కింది. 17 రోజులుగా హోరాహోరీగా సాగుతున్న బైపోల్ ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగియనుంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చివరిరోజు భారీ ర్యాలీలు, రోడ్ షోలకు ప్లాన్ చేసుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. గత నెల 13న నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నెల 11న పోలింగ్ జరుగనుండగా.. 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 3.92 లక్షల మంది ఓటర్లున్న ఈ హై-ప్రొఫైల్ నియోజకవర్గంలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారడంతో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ప్రచార గడువు ముగియనుండటంతో చివరి అస్త్రంగా పోల్ మేనేజ్‌మెంట్‌పై నాయకులు ఫోకస్ పెట్టారు.
స్కీమ్‌లతో జనంలోకి కాంగ్రెస్
జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో ఇప్పటికే ఇంటింటి ప్రచారం పూర్తిచేసిన కాంగ్రెస్.. చివరిరోజైన ఆదివారం కూడా ప్రతి గడపకూ వెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం మంత్రుల ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి.. రెండేండ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఓట్లు అభ్యర్థించనున్నారు. దీంతోపాటు నియోజకవర్గం చుట్టివచ్చేలా భారీ బైక్ ర్యాలీకి ప్లాన్చేశారు. ఈ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా ప్రతిపక్షాల విమర్శలకు చెక్‌పెట్టడంతో పాటు కాంగ్రెస్చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా చేపట్టిన భారీ ప్రాజెక్టులను నిరభ్యంతరంగా ముందుకు తీసుకెళ్లవచ్చనే ఆలోచనలో అధికారపార్టీ ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారంలోకి దిగి.. వరుసగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్‌లో పాల్గొన్నారు. మంత్రులు కూడా ప్రచారంలో భాగస్వాములయ్యారు. వారిలో 13 మందికి నియోజకవర్గంలోని ఒక్కో డివిజన్ బాధ్యతలు అప్పగించగా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన మహాలక్ష్మి, గృహలక్ష్మి వంటి ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. కాంగ్రెస్ ప్రధానంగా మహిళలు, మైనారిటీలు, బీసీలు, యువత ఓట్లపై ఆశలు పెట్టుకుంది. బీసీ నాయకుడైన నవీన్ యాదవ్‌ను గెలిపించుకోవడం ద్వారా బీసీ సాధికారతపై తమకున్న చిత్తశుద్ధిని చాటుకోవాలని అధికారపార్టీ భావిస్తున్నది.
సిట్టింగ్ సీటును కాపాడుకునే పనిలో బీఆర్ఎస్
ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఇక్కడ మళ్లీ విజయం సాధించడం ద్వారా అర్బన్ ఏరియాలో తన పట్టును నిరూపించుకోవాలనే భావిస్తున్నది. ఎన్నికల్లో వరుస పరాజయాల కారణంగా నిరాశలో కూరుకుపోయిన కేడర్‌లో జోష్ నింపేందుకు, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చాటిచెప్పేందుకు జూబ్లీహిల్స్‌లో ఎలాగైనా గెలిచితీరాలని బీఆర్ఎస్ అగ్రనేతలు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రచార బాధ్యతలను భుజన వేసుకొని, తమ అభ్యర్థి మాగంటి సునీత తరఫున విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తూ వచ్చారు. వీరికి సహాయంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, టి. పద్మారావు గౌడ్, మహమూద్ అలీ వంటి సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. ఆరు గ్యారెంటీలను అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ ప్రజలకు ‘బాకీ కార్డులు’ పంచుతూ ప్రచారం చేశారు. బీఆర్ఎస్చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఉన్నప్పటికీ.. ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇది శ్రేణులను నిరాశపరిచింది. కాగా, చివరి రోజైన ఆదివారం బీఆర్ఎస్నేతలు బైక్ ర్యాలీకి ప్లాన్ చేశారు.
తమకు కలిసి వస్తుందంటున్న బీజేపీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా తానే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయమని చాటుకునేందుకు బీజేపీ కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నది. హైదరాబాద్ నగరంపై పట్టు నిలుపుకోవడం ద్వారా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి కార్పొరేషన్‌పై జెండా ఎగరేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రారంభంలో పెద్దగా పట్టించుకోకపోయినా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడంతో సీన్ మారింది. ప్రచార బాధ్యతలను స్వయంగా పర్యవేక్షిస్తున్న ఆయన.. విజయం తమదే అంటూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.
పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరఫున ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించారు. కిషన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ వంటి పార్టీ ముఖ్య నేతలు, అలాగే ఆంధ్రప్రదేశ్ యూనిట్ చీఫ్ పి.వి.ఎన్. మాధవ్ వంటి నేతల ప్రచారానికి, రోడ్‌షోలకు జనాల నుంచి మంచి స్పందన వచ్చింది. మోదీ చరిష్మా, జాతీయవాదం తమకు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తున్నది. త్రిముఖ పోరు కారణంగా ఓట్లు చీలిపోతాయని, ఇది తమకు అనుకూలంగా మారుతుందని అంచనా వేస్తున్నది.
పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి
ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో రెండు రోజులుగా ప్రధాన పార్టీలన్నీ బహిరంగ సభలు, రోడ్‌షోల కంటే పోల్ మేనేజ్‌మెంట్ వ్యూహాలకే ప్రాధాన్యమిస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఒక్కో పోలింగ్ బూత్‌కు ఇద్దరు చొప్పున కీలక కార్యకర్తలను నియమించడం, ఓటర్ స్లిప్పులు సకాలంలో పంపిణీ అయ్యేలా చూడటం, చివరి నిమిషంలో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడం వంటి అంశాలపైనే నేతలు దృష్టి సారించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ నేతలు బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి, ఓటింగ్‌ను పెంచడానికి అవసరమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కూడా బూత్ స్థాయి నుంచి పోల్మేనేజ్మెంట్కు ఏర్పాట్లు చేస్తున్నారు.
కుల సమీకరణాలు.. మైనారిటీ ఓట్లే కీలకం!
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుల సమీకరణాలు.. ముఖ్యంగా బీసీ, మైనారిటీ వర్గాల ఓట్లు ఎన్నికల ఫలితాలపై అధిక ప్రభావం చూపనున్నాయి. కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఆ వర్గం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ తరఫున ఓసీ అభ్యర్థి బరిలో ఉండడంతో బీసీ వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలను బీఆర్ఎస్ రంగంలోకి దించింది. ఇక బీజేపీ నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్కేటాయించడంతో ఈటల రాజేందర్ లాంటి లీడర్లతో ప్రచారం చేయించడం ద్వారా బీసీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం బీజేపీ చేసింది.
నియోజకవర్గంలో మూడోవంతు ఉన్న మైనారిటీ ఓట్లపైనే అందరి దృష్టి నెలకొన్నది. మైనారిటీల సమస్యలపై, వారి హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ తమదేనని మొదటి నుంచీ చెప్తున్న కాంగ్రెస్ కు ఎంఐఎం కూడా మద్దతు ఇవ్వడంతో ఈ ఓట్లన్నీ గంపగుత్తగా తమ అభ్యర్థికే పడ్తాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీనికి తోడు మైనారిటీ వర్గానికి చెందిన అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం, ఏకంగా ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ కూడా ప్రచారం నిర్వహిస్తుండడం తమకు కలిసివస్తుందని భావిస్తున్నారు. అటు బీఆర్ఎస్ తరఫున మాజీ హోం మంత్రి మహమూద్ అలీ రంగంలోకి దిగారు.
