సోనియా గాంధీ అయోధ్యకు వెళ్తారా? లేదా?

సోనియా గాంధీ అయోధ్యకు వెళ్తారా? లేదా?

న్యూఢిల్లీ: అయోధ్యలో  వచ్చే నెల 22న జరిగే రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్‌ పార్టీ మాజీ చీఫ్‌ సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై ఒకటి రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించాయి. సోనియా గాంధీ, పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌‌ రంజన్‌ చౌధురికి కేంద్ర ప్రభుత్వం ఇన్విటేషన్‌ పంపిందని, దీనిపై సరైన టైమ్‌లో నిర్ణయం తీసుకుంటామని పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్‌ ట్విట్టర్‌‌లో పేర్కొన్నారు.

 ప్రభుత్వం పంపిన అయోధ్య ప్రారంభోత్సవ ఇన్విటేషన్‌పై సోనియా సానుకూలంగా స్పందిచారని కాంగ్రెస్‌ సీనియర్ నేత దిగ్విజయ్‌ సింగ్‌ తెలిపారు. అయితే, ‘ఇండియా’ కూటమి సభ్యులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని సీపీఐ (ఎం), సీపీఐ ఇదివరకే తమ నిర్ణయాన్ని వెల్లడించాయి. కార్యక్రమాన్ని రాజకీయ ప్రోగ్రాంలా చేస్తున్నారని సీపీఎం నేత బృందా కారత్‌ ఆరోపించారు.