
వాషింగ్టన్: గత కొద్ది రోజులుగా ఇండియాపై అక్కసు వెళ్లగక్కుతోన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై చిర్రుబుర్రులాడారు. రష్యాతో స్నేహ బంధం కొనసాగిస్తోందన్న కారణంతో ఇప్పటికే భారత దిగుమతులపై 25 శాతం వాణిజ్య సుంకాలు విధించిన ట్రంప్.. తాజాగా మరోసారి టారిఫ్స్ గణనీయంగా పెంచుతామని ఇండియాను హెచ్చరించారు. రష్యాతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఆ దేశం నుంచి భారీగా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై భారీగా సుంకాలు పెంచుతామని వార్నింగ్ ఇచ్చారు.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎంతో మంది చనిపోతున్నా భారత్ అవేమి పట్టించుకోకుండా రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకుంటుందని ట్రంప్ మండిపడ్డారు. యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్ దిగుమతి చేసుకుని.. బహిరంగా మార్కెట్లో అదే ఆయిల్‌ను భారత్ ఎక్కువ ధరకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు ట్రంప్.
‘‘భారతదేశం రష్యా నుంచి భారీ మొత్తంలో ఆయిల్ కొనుగోలు చేస్తోంది. అంతేకాకుండా కొనుగోలు చేసిన ఇంధనాన్ని ఓపెన్ మార్కెట్‌లో భారీ లాభాలకు విక్రయిస్తోంది. రష్యన్ వార్ మెషిన్ వల్ల ఉక్రెయిన్‌లో ఎంత మంది చనిపోతున్నారో ఇండియాకు పట్టింపు లేదు. దీని వల్ల అమెరికాలో భారత దిగుమతులపై గణనీయంగా సుంకాలు పెంచుతాం” అని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ వేదికగా పేర్కొన్నారు.
కాగా, దాదాపు మూడేళ్లుగా ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తోన్న రష్యాతో ఎవరూ వ్యాపార సంబంధాలు పెట్టుకోవద్దని ప్రపంచ దేశాలను అమెరికి బెదిరిస్తోంది. తమ మాట కాదని.. ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తే భారీగా సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తోంది. అయితే, భారత్ మాత్రం అమెరికా మాటలను ఏ మాత్రం లెక్కచేయడం లేదు. అమెరికా ఉడత ఊపులను పట్టించుకోకుండా మన చిరకాల మిత్రదేశమైన రష్యాతో వ్యాపార సత్సంబంధాలను అలాగే కొనుగోలు చేస్తోంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది.
ట్రంప్ కు ఇదే నచ్చడం లేదు. మేం వద్దని చెప్పినా వినకుండా ఇండియా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటుందని కడుపు మంటతో రగిలిపోతున్నారు. ఇందుకు ప్రతీకారంగా అమెరికాలో భారత దిగుమతులపై 25 శాతం వాణిజ్య సుంకాలు విధించాడు. అయితే, అమెరికా ఒత్తిడికి తలొగ్గి భారత్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి ఆపేసిందని ప్రచారం జరిగింది.
ట్రంప్ కూడా దీనిపై స్పందించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు ఆపేయాలని తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని పేర్కొన్నారు. అయితే, ఈ వార్తలను భారత ప్రభుత్వం వెంటనే తోసిపుచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపలేదని.. మాస్కో నుంచి యధావిధిగా ఆయిల్ దిగుమతి చేసుకుంటామని క్లారిటీ ఇచ్చింది.
దీంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు. చెప్పినా వినకుండా భారత రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు కొనసాగిస్తోందని.. అంతేకాకుండా ఆ ఆయిల్‌ను ఓపెన్ మార్కెట్లో లాభాలకు అమ్ముకుంటుందని భారత్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. రష్యా నుంచి భారీ మొత్తంలో ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న ఇండియాపై ఇప్పుడు విధించిన 25 శాతం కాకుండా ఇంకా గణనీయంగా ట్రేడ్ టారిఫ్స్ పెంచుతామని ట్రంప్ పేర్కొన్నాడు.