చెరువుల సర్వే ముందుకు సాగేనా!

చెరువుల సర్వే ముందుకు సాగేనా!
  • సిటీలో చెరువుల సర్వే ముందుకు సాగేనా!
  • హెచ్ఎండీఏ నుంచి అడిషనల్ కలెక్టర్లకు బాధ్యతలు బదిలీ
  • పదేళ్లలో 220 చెరువుల గుర్తింపు
  • ఇప్పటివరకు రూ. 12 కోట్లు ఖర్చు చేసిన అధికారులు 
  • రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల నిర్లక్ష్యంతో పెరిగిన కబ్జాలు 
  • తాజా ఆదేశాలతో పూర్తిగా కనుమరుగవుతయనే విమర్శలు

హైదరాబాద్, వెలుగు: హెచ్ఎండీఏ  పరిధిలోని  చెరువులు, కుంటల  పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా... ఆచరణలో కనిపించడం లేదు. 7 జిల్లాల్లో విస్తరించిన హెచ్ఎండీఏనే  మొన్నటి వరకు చెరువుల సర్వే, హద్దుల నిర్ధారణ వంటి పనులను చూసింది. తాజాగా సర్వే బాధ్యతలను హెచ్ఎండీఏ నుంచి జిల్లా అడిషనల్ కలెక్టర్లకు ప్రభుత్వం బదిలీ చేసింది. పదేళ్లుగా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా చెరువుల హద్దుల గుర్తింపు ఇంకా పూర్తి కాలేదు. దాదాపు 3 వేల చెరువులు, కుంటల సర్వే పెండింగ్​లోనే ఉంది. ఇక ముందు ఎలా సాగుతుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా నిర్లక్ష్యం చేస్తే కబ్జాలు పెరిగిపోతాయనే  విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్ధారణ కాకపోగా చాలా ప్రాంతాల్లో అన్యాక్రాంతమవుతున్నాయి. రియల్ భూమ్ ఎక్కువగా ఉన్న హెచ్ఎండీఏ పరిధిలోనే  కబ్జాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  చెరువుల సర్వే పూర్తి చేయలేకపోయిన అధికారులు సర్వే పేరిట మాత్రం నిధులను ఖర్చు చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం 3,132 చెరువులు ఉన్నాయి. వీటి పరిరక్షణకు హెచ్ఎండీఏ కమిషనర్, రెవెన్యూ, ఇరిగేషన్, జిల్లాల కలెక్టర్లతో  2010లో  లేక్​ ప్రొటెక్షన్​ కమిటీని ఏర్పాటు చేశారు. చెరువుల సర్వే, డీ మార్కేషన్, బఫర్ జోన్ల నిర్ధారణ, ఆక్రమణల గుర్తింపు, హద్దు రాళ్ల ఏర్పా టు, బ్యూటిఫికేషన్ వంటి పనులను పర్యవేక్షించేది. సర్వే పనులు హెచ్ఎండీఏ కొనసాగిస్తుండగా, ప్రస్తుతం దీని బాధ్యతలు జిల్లా అదనపు కలెక్టర్లకు బదిలీ అయ్యాయి. 

220  చెరువులే గుర్తించారు 
ఇప్పటివరకు చెరువులు, కుంటలకు సర్వే నెంబర్లు, బఫర్ జోన్ల నిర్ధారణ, హద్దు రాళ్ల గుర్తింపు వాటి వాటిని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల వద్ద ఉన్న మ్యాపులతో సరి చూసినవి 220 మాత్రమే. మిగిలిన 2,900 చెరువుల్లో  1,900 వాటికి ప్రాథమికంగా సర్వే చేశారు.  రెవెన్యూ, ఇరిగేషన్ వివరాల ఆధారంగా గుర్తించాల్సి ఉంది. మిగిలిన మరో వెయ్యి చెరువుల సర్వే పనులు ఇంకా మొదలు కాలేదు. ఇప్పటికే సర్వే పేరిట హెచ్ఎండీఏ రూ. 12 కోట్లు ఖర్చు చేసింది. పదేళ్లలో సగం చెరువులను కూడా పూర్తి చేయలేకపోయింది.  కొత్తగా సర్వే పనులను జిల్లా యంత్రాంగానికి బదిలీ చేస్తే నోటిఫై చేయడంలో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

పర్యవేక్షణ లేకుండా పోతుందనే..
జూన్ మొదటి వారంలోనే జిల్లా యంత్రాంగానికి సర్వే బాధ్యతలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేసిన సర్వేలో దాదాపు 230 ఎకరాల్లో చెరువుల భూములు కబ్జాలకు గురయ్యాయనే అంచనాలు వేశారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి బదిలీ చేయడం వల్ల చెరువుల సంరక్షణపై పర్యవేక్షణ లేకుండా పోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కబ్జాలు, హద్దు రాళ్ల నిర్ధారణ, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల మార్పుల్లోనూ అవకతవకలు జరిగొచ్చని భావిస్తున్నారు. బల్దియా పరిధిలో ఎన్​వోసీ పేరిట అధికారులు దోచుకుంటున్నారనే  ఆరోపణలున్నాయి. ఎఫ్టీఎల్ భూముల్లోని నిర్మాణాలకు అనుమతులు పొందిన నేపథ్యంలో హెచ్ఎండీఏ నుంచి సర్వే పనులు బదిలీ చేయడం ద్వారా పూర్తిగా పరిరక్షణ లేకుండా పోతుందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. 

ఇప్పట్లో సాధ్యమయ్యేనా? 
చెరువులు, కుంటల సర్వే బాధ్యతలు అదనపు కలెక్టర్లకు బదిలీ అయిన నేపథ్యంలో  ఇప్పటిదాకా హెచ్ఎండీఏ గుర్తించిన 3,132 చెరువుల సర్వే ఎప్పుడు పూర్తి చేస్తారనే దానిపై ఉన్నతాధికారులకు స్పష్టత లేకుండా పోయింది. మరో ఐదారేళ్లు సర్వే పేరిట నిధులు ఖర్చు చేయడంతో పాటు మరిన్ని ఆక్రమణలకు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అడిషనల్ కలెక్టర్లకు పని భారం పెరిగిపోగా ఈ క్రమంలో ఆ రెండు శాఖలను సమన్వయం చేస్తూ సర్వే పూర్తి చేయడం ఇప్పట్లో సాధ్యం కాదని సీనియర్ ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.