
ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మంగళవారం (సెప్టెంబర్ 16) ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 735 రేటింగ్ పాయింట్లతో టాప్కు చేరుకుంది. ఇటీవలే ఇంగ్లాండ్ కెప్టెన్ నాట్ స్కైవర్-బ్రంట్‌కు నెంబర్ వన్ ర్యాంక్‌ను కోల్పోయిన మంధాన.. ఆస్ట్రేలియాతో జరిగిన తిరిగి వన్డేల్లో హాఫ్ సెంచరీ చేసి టాప్కు చేరింది. స్మృతి 2019లో తొలిసారి నెంబర్ ర్యాంక్‌లో నిలిచింది. ఆ తర్వాత 2025 జూన్‌లో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. రెండో స్థానంలో ఉన్న బ్రంట్‌కు స్మృతి మందానకి కేవలం నాలుగు రేటింగ్ పాయింట్స్ మాత్రమే తేడా ఉంది.
ఆస్ట్రేలియాతో జరగనున్న మిగిలిన రెండు వన్డేల్లో మందాన రాణిస్తే వన్డే వరల్డ్ కప్ కు టాప్ ర్యాంక్ తో వెళ్తుంది. న్యూ చండీగఢ్‌లో ఆస్ట్రేలియాపై జరిగిన తొలి వన్డేలో ఇండియన్ వైస్ కెప్టెన్ మందాన 58 పరుగులతో రాణించింది. ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ చేసిన ప్రతీకా రావల్ నాలుగు స్థానాలు ఎగబాకి 42వ స్థానానికి చేరుకుంది. హర్లీన్ డియోల్ ఐదు స్థానాలు ఎగబాకి 43వ స్థానానికి చేరుకుంది. ఇంగ్లాండ్ ప్లేయర్ నాట్ స్కైవర్-బ్రంట్ రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ మూడో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అలిస్సా హీలీ నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉండడం విశేషం.
ALSO READ: Asia Cup 2025: ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రాలేదు.. ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ తప్పుకుంటుందా..
బౌలింగ్ విభాగంలో ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫియా ఎక్లిస్టన్ టాప్ ర్యాంక్ లో ఉంది. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆష్ గార్డనర్ రెండో స్థానంలో నిలిచింది. ఇటీవలే ఇండియాపై అద్భుతంగా బౌలింగ్ చేసిన పేసర్ కిమ్ గార్త్ ఒక స్థానం ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకుంది. ఆసీస్ స్పిన్నర్ అలానా కింగ్ ఒక స్థానం ఎగబాకి ఐదో స్థానానికి చేరుకుంది. ఇండియన్ బౌలర్లలో దీప్తి శర్మ మాత్రమే టాప్-10 లో ఉంది. మూడు స్థానాలు దిగజారి ఏడో స్థానానికి పడిపోయింది.