సిరీస్‌‌‌‌పై ఇండియా గురి.. ఇవాళ (డిసెంబర్ 17) సౌతాఫ్రికాతో నాలుగో టీ20

సిరీస్‌‌‌‌పై ఇండియా గురి.. ఇవాళ (డిసెంబర్ 17) సౌతాఫ్రికాతో నాలుగో టీ20

లక్నో: కెప్టెన్‌‌‌‌ సూర్యకుమార్‌‌‌‌, శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ ఫామ్‌‌‌‌లోకి రావాలని ఆశిస్తున్న ఇండియా.. సౌతాఫ్రికాతో నాలుగో టీ20 మ్యాచ్‌‌‌‌కు రెడీ అయ్యింది. బుధవారం జరిగే ఈ పోరులో గెలిచి ఇక్కడే సిరీస్‌‌‌‌ను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. గత మ్యాచ్‌‌‌‌లో పెద్ద టార్గెట్‌‌‌‌ లేకపోవడంతో బ్యాటర్లపై పెద్దగా ఒత్తిడి కనిపించలేదు. కానీ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు మరో ఏడు మ్యాచ్‌‌‌‌లే మిగిలి ఉండటంతో టాప్‌‌‌‌ స్టార్లందరూ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్‌‌‌‌లో టీ20 ఫార్మాట్‌‌‌‌లో 15 కంటే తక్కువ సగటు నమోదు చేసిన సూర్య..  ఒక్క హాఫ్‌‌‌‌ సెంచరీ కూడా చేయలేదు.

ప్రతీ మ్యాచ్‌‌‌‌లో 20 బాల్స్‌‌‌‌ కంటే ఎక్కువగా ఆడలేకపోతున్నాడు. ఇతర ఫార్మాట్లలో రాణిస్తున్న గిల్‌‌‌‌.. షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో కుదురుకోకపోవడం సెలెక్టర్లను, మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ను ఆందోళనలో పడేసింది. ఓపెనింగ్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ దూకుడు ముందు తేలిపోవడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. అభిషేక్‌‌‌‌తో మంచి జోడీ కుదిరిన శాంసన్‌‌‌‌ను తప్పించి గిల్‌‌‌‌ను ఆడించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కనీసం ఈ మ్యాచ్‌‌‌‌లోనైనా గిల్, సూర్య గాడిలో పడతారేమో చూడాలి. 

అనారోగ్యం కారణంగా అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ ఈ సిరీస్‌‌‌‌కు దూరమయ్యాడు. అతని ప్లేస్‌‌‌‌లో షాబాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే అక్షర్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో కుల్దీప్‌‌‌‌ను కొనసాగించొచ్చు. వ్యక్తిగత కారణాలతో గత మ్యాచ్‌‌‌‌కు దూరమైన బుమ్రా ఆడటంపై సందిగ్ధత కొనసాగుతోంది. అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉండటం.. హర్షిత్‌‌‌‌ రాణా అతనికి అండగా నిలవడం ఇండియాకు కలిసొచ్చే అంశం. 

మరోవైపు సిరీస్‌‌‌‌లో 1–2తో వెనకబడిన సౌతాఫ్రికా లెక్క సరిచేయాలని భావిస్తోంది. అయితే బ్యాటింగ్‌‌‌‌లో నిలకడ లేకపోవడం ప్రొటీస్‌‌‌‌ను దెబ్బతీస్తోంది. గత టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ నుంచి ఇప్పటి వరకు ఆడిన 28 మ్యాచ్‌‌‌‌ల్లో సఫారీ టీమ్ 18 సార్లు ఓడటం గమనార్హం. ఒకరిద్దరు మెరుస్తున్నా సమష్టిగా విజయాలు అందుకోవడంలో సఫారీలు ఫెయిలవుతున్నారు. దాంతో వీలైనంత త్వరగా టీమ్‌‌‌‌ను సుస్థిరం చేసుకోవాలని ప్రొటీస్‌‌‌‌ లక్ష్యంగా పెట్టుకుంది.