- రూ. 25.20 కోట్లతో కేకేఆర్ టీమ్‌లోకి ఆసీస్ స్టార్
- చెరో రూ. 14.2 కోట్లు పలికిన ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ
- రూ. 25.2 కోట్లతో ఆస్ట్రేలియా స్టార్ కామెరాన్ గ్రీన్ రికార్డు
- ఐపీఎల్‌లో ఖరీదైన ఫారిన్ ప్లేయర్‌గా రికార్డు
- అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ప్రశాంత్, కార్తీక్‌పై సీఎస్కే కనక వర్షం
- చెరో రూ. 14.20 కోట్లతో కొత్త చరిత్ర
- రూ. 18 కోట్లు పలికిన శ్రీలంక పేసర్ మతీష
ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ జాక్‌పాట్ కొట్టాడు. రూ. 25.20 కోట్లతో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌లో చేరిన అతను ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. ఇండియా అన్‌క్యాప్డ్ క్రికెటర్లపైనా కోట్ల వర్షం కురిసింది. యూపీకి చెందిన 20 ఏండ్ల స్పిన్ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్, రాజస్తాన్‌కు చెందిన 19 ఏండ్ల వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ శర్మ చెరో రూ. 14.20 కోట్లతో చెన్నై జట్టులో చేరారు. మెగా లీగ్‌లో ఎక్కువ ధర పలికిన అన్‌క్యాప్డ్ క్రికెటర్లుగా చరిత్రకెక్కారు. ఇక, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీ ఎప్పట్లానే తెలంగాణ క్రికెటర్లను పట్టించుకోలేదు. హైదరాబాద్‌కు చెందిన పేరాల అమన్ రావు రూ. 30 లక్షలతో రాజస్తాన్ రాయల్స్ టీమ్‌లో చేరాడు.
అబుదాబి: ఐపీఎల్-2026 మినీ వేలంలో రికార్డుల మోత మోగింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ భారీ బిడ్డింగ్స్‌తో ఆశ్చర్యపరిచింది. మంగళవారం జరిగిన వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను రికార్డు స్థాయిలో రూ. 25.20 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు.
ఆసీస్‌కే చెందిన మిచెల్ స్టార్క్ (2024లో రూ. 24.75 కోట్లు) పేరిట ఉన్న రికార్డును గ్రీన్ బ్రేక్ చేశాడు. వేలం తొలి సెట్‌లో ఐదో ప్లేయర్‌గా వచ్చిన గ్రీన్ కోసం రాజస్తాన్ రాయల్స్, సీఎస్కే కూడా పోటీపడ్డాయి. పవర్ హిట్టింగ్‌తో పాటు పేస్ బౌలింగ్‌తోనూ ఆకట్టుకునే 26 ఏండ్ల ఆల్‌రౌండర్ కోసం రాయల్స్ 13.6 కోట్ల వరకూ వచ్చి డ్రాప్ అవ్వగా.. ఆ తర్వాత సీఎస్కే ఎంటరైంది.
కేకేఆర్‌తో పోటాపోటీగా బిడ్స్ వేసింది. చివరకు రికార్డు మొత్తానికి గ్రీన్ కేకేఆర్ సొంతమయ్యాడు. ఇదే జోరులో శ్రీలంక పేసర్ మతీష పతిరనను కూడా కేకేఆర్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ కోసం కేకేఆర్ రూ. 9.2 కోట్లు వెచ్చించింది. తొలి సెట్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయి చివర్లో మరోసారి వేలానికి వచ్చిన ఇంగ్లండ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను సన్ రైజర్స్ రూ. 13 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.
ఆసీస్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ (రూ. 8.60 కోట్లు–- లక్నో), ఇండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ (రూ. 7.20 కోట్లు–రాజస్తాన్), ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (రూ. 7 కోట్లు–ఆర్సీబీ), విండీస్ పేసర్ జేసన్ హోల్డర్ (రూ. 7 కోట్లు-–గుజరాత్), రాహుల్ చహర్ (రూ. 5.20 కోట్లు–సీఎస్కే) కూడా మంచి ధర పలికారు. క్వింటన్ డికాక్‌ను ముంబై అతని బేస్ ప్రైస్ రూ. కోటికే సొంతం చేసుకుంది.
కుర్రాళ్లపై కోట్ల మోత
ఈ వేలంలో ఎవరూ ఊహించని విధంగా అన్‌క్యాప్డ్ ఇండియా ప్లేయర్లు భారీ ధర పలికారు. గతంలో సీనియర్ల వెంట పడి డ్యాడ్స్ ఆర్మీగా పేరు తెచ్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఈసారి తమ ప్లాన్ మార్చి యంగ్ టాలెంట్స్‌పై కోట్లు కుమ్మరించింది. ఉత్తరప్రదేశ్ స్పిన్ ఆల్‌రౌండర్, 20 ఏండ్ల ప్రశాంత్ వీర్‌తో పాటు రాజస్తాన్‌కు చెందిన 19 ఏండ్ల వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ శర్మకు రికార్డు స్థాయిలో చెరో రూ.14.20 కోట్లు చెల్లించింది.
రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన ఈ ఇద్దరూ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న అన్‌క్యాప్డ్ ఆటగాళ్లుగా రికార్డు సృష్టించారు. అవేశ్ ఖాన్ (2022లో రూ. 10 కోట్లు–లక్నో) రికార్డును బ్రేక్ చేశారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌కు చెందిన 29 ఏండ్ల పేసర్ ఆఖిబ్ నబీ దార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 8.40 కోట్లకు దక్కించుకుంది. ఈ నెల 14న డొమెస్టిక్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ 23 ఏండ్ల మంగేశ్ యాదవ్ రూ.5.20 కోట్లు, తేజస్వి సింగ్ రూ. 3 కోట్లతో ఆర్సీబీ టీమ్‌లో చేరగా.. ముకుల్ చౌదరికి లక్నో రూ. 2.6 కోట్లు ముట్టజెప్పింది.
రాజస్తాన్‌లోకి అమన్ రావు.. సన్‌రైజర్స్‌కు పట్టని హైదరాబాద్ ప్లేయర్లు
హైదరాబాద్ ప్లేయర్లలో పేరాల అమన్ రావుకు ఐపీఎల్ చాన్స్ వచ్చింది. అతడిని రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌కు రాజస్తాన్ రాయల్స్ తీసుకుంది. మరోవైపు సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఎప్పట్లానే హైదరాబాద్ ప్లేయర్లను పట్టించుకోలేదు. ఏడుగురు అన్ క్యాప్డ్ ఇండియన్స్‌ను కొనుగోలు చేసిన ఆ టీమ్ తమ బేస్ అయిన భాగ్యనగరం నుంచి ఒక్కరిని కూడా తీసుకోలేదు. తనయ్ త్యాగరాజన్, రక్షణ్ రెడ్డి, ఆరోన్ జార్జ్, రాహుల్ బుద్ధి, మనీష్ రెడ్డి, నిశాంత్ శరణు, అర్ఫాజ్, నితిన్ సాయి బరిలో నిలిచినా పట్టించుకోలేదు.
నయా జడేజా.. ప్రశాంత్ వీర్
యూపీ అమేథీకి చెందిన లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌ను ‘మరో రవీంద్ర జడేజా’గా క్రికెట్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఇటీవల డొమెస్టిక్ టోర్నమెంట్స్‌లో ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో వీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ దృష్టిని ఆకర్షించాడు. అందుకే అతని కోసం వేలంలో తొలుత ముంబై, లక్నో పోటీలోకి రాగా.. సన్ రైజర్స్ చివరి వరకూ సీఎస్కేతో పోటీ పడింది.
ఈ సీజన్ యూపీ మెన్స్ అండర్-23ట్రోఫీలో ఏడు మ్యాచ్‌ల్లో వీర్ 94 సగటుతో 376 రన్స్ చేయడంతో పాటు, 18 వికెట్లు కూడా పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో 170 స్ట్రైక్ రేట్‌తో 112 రన్స్ చేసి 9 వికెట్లు తీశాడు. లోయర్ ఆర్డర్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో పాటు మిడిల్ ఓవర్లలో బౌలింగ్ వేయగల వీర్ టాలెంట్ జడేజా పాత్రను పోలి ఉండటంతో సీఎస్కే భారీ మొత్తాన్ని వెచ్చించింది.
సిక్సర్లలో దిట్ట కార్తీక్
రాజస్తాన్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ అయిన కార్తీక్ శర్మ సిక్సర్లు కొట్టడంలో దిట్ట. తనకు చోటా ప్యాకెట్.. బడా ధమాకాగా పేరుంది. ఐదేండ్ల వయసులో ప్లాస్టిక్ బ్యాట్‌తో ఆట మొదలు పెట్టినప్పటి నుంచి అతను సిక్సర్లు కొట్టే క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. ఇండియా క్రికెటర్ దీపక్ చహర్ తండ్రి లోకేంద్ర సింగ్ చహర్ అకాడమీలో శిక్షణ పొందిన కార్తీక్‌కు ఐదేండ్ల క్రితం దీపక్ గ్లౌజులు గిఫ్టుగా ఇచ్చి బ్యాటింగ్‌తో పాటు కీపింగ్ చేయడం నేర్చుకొని మల్టీ -డైమెన్షనల్ ప్లేయర్‌గా మారాలని సలహా ఇచ్చాడు.
అప్పటినుంచి కీపింగ్ కూడా చేయడం మొదలుపెట్టాడు. చిన్నతనంలోనే సీనియర్ క్లబ్ టోర్నమెంట్లలో భారీ షాట్లు ఆడిన కార్తీక్.. ఓ మ్యాచ్‌లో 300 రన్స్‌తో రికార్డు సృష్టించాడు. తన హిట్టింగ్ చూసి ఏడు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ట్రయల్స్‌కు పిలిచాయి. కేకేఆర్ ట్రయల్స్‌లో 18 సిక్సర్లతో ఔరా అనిపించాడు. ఆర్‌సీబీ క్యాంప్‌లో శర్మ ఆటను చూసి దినేష్ కార్తీక్ ఫిదా అయ్యాడు. ఐపీఎల్ కాంట్రాక్ట్ వచ్చినా సంతృప్తి చెందవద్దని పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోవాలని సూచించాడు. ఇప్పుడు లెజెండ్ ధోనీ ఉన్న సీఎస్కే టీమ్‌లో చేరడంతో కార్తీక్ లైఫ్ టర్న్ అవడం ఖాయం.
వేలం టాపర్లు
- ప్లేయర్ టీమ్ బిడ్
- కామెరాన్ గ్రీన్ కోల్‌కతా 25.20 కోట్లు
- మతీష పతిరన కోల్‌కతా 18 కోట్లు
- కార్తీక్ శర్మ చెన్నై 14.20 కోట్లు
- ప్రశాంత్ వీర్ చెన్నై 14.20 కోట్లు
- లివింగ్‌స్టోన్ హైదరాబాద్ 13 కోట్లు
