ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నా విద్యార్థుల నుంచే పైసలు గుంజుతున్న కాలేజీలు.!

ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నా విద్యార్థుల నుంచే పైసలు గుంజుతున్న కాలేజీలు.!
  • ఫీజు రీయింబర్స్ విధానం మార్చాలని భావిస్తున్న సర్కారు 
  • ఇకపై స్టూడెంట్లు, పేరెంట్స్ అకౌంట్లలోనే జమ చేయాలని యోచన 
  • ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లో జమ

హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ చెల్లింపుల విధానంలో మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కాలేజీ యాజమాన్యాలకు ప్రతి ఏటా రీయింబర్స్​మెంట్ కింద వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నా.. విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. పైగా సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అందుకే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సర్కారు.. ఫీజు రీయింబర్స్‌‌మెంట్ చెల్లింపుల విధానంలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నది. 

ఇకపై ఫీజు రీయింబర్స్ మెంట్ కింద కాలేజీ యజమాన్యాలకు చెల్లిస్తున్న మొత్తం వారికి కాకుండా విద్యార్థులు, పేరెంట్స్ ఖాతాలకు జమ చేసే విధానంపై ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. గతంలో ఏపీ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఎస్సీ విద్యార్థులకు స్కాలర్​షిప్, రీయింబర్స్​మెంట్ నిధులను నేరుగా వారి అకౌంట్లలోనే జమ చేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను​కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల నుంచి స్టూడెంట్లు, వారి పేరెంట్స్ ఖాతాల్లోకి జమ చేయడంలో సాధ్యసాధ్యాలను సర్కారు స్టడీ చేస్తోంది. అయితే ఈ విధానంలో లోటుపాట్లు ఏముంటాయి? విద్యార్థులకు మేలు జరుగుతుందా? అనే అంశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. 

అదనపు వసూళ్లతో సర్కారుకు చెడ్డపేరు

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌‌మెంట్​ను నేరుగా కాలేజీల యాజమాన్యాలకు చెల్లిస్తోంది. ప్రతి ఏడాది దాదాపు రూ.4 వేల కోట్ల దాకా అవుతోంది. అయితే ఈ విధానం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌‌మెంట్ వచ్చినా, కాలేజీలు అదనపు ఫీజుల పేరిట విద్యార్థుల నుంచి కొంత మొత్తం వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. కొన్నిసార్లు ముందే విద్యార్థుల నుంచి వసూలు చేసి, ప్రభుత్వం నుంచి వచ్చిన తరువాత తిరిగి ఇస్తామని చెబుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సర్టిఫికెట్ల సమయంలో, పరీక్షల టైంలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ ఫీజులు గుంజుతున్నరని తేలింది. దీంతో ఒకవైపు ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ ఇస్తున్నా.. మరోవైపు విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేస్తూ చెడ్డపేరు తెస్తున్నారని ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని సర్కార్​ నిర్ణయించింది. ఈ సమస్యకు పరిష్కారంగా, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విషయాన్ని పరిశీలిస్తోంది. 

ఇన్​స్టాల్​మెంట్స్ లా ఇవ్వడంపైనా ఫోకస్.. 

కేంద్ర ప్రభుత్వం పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌‌షిప్ పథకం కింద ఎస్సీ విద్యార్థులకు స్కాలర్‌‌షిప్‌‌లు, ఫీజు రీయింబర్స్​మెంట్ అందిస్తోంది. ఈ పథకం కింద, కేంద్ర ప్రభుత్వం తన వాటా 60% నిధులను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తోంది. మిగిలిన వాటా 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. గతంలో కేంద్రం తన వాటాను రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పంపించేది. ఇదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చే బీసీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌‌మెంట్ మొత్తాన్ని కూడా నేరుగా వారి అకౌంట్లలోనే జమ చేయాలని యోచిస్తోంది. దీంతో కాలేజీల అదనపు ఫీజు వసూళ్లకు అవకాశం ఉండదు. ఒకవేళ కాలేజీలు అదనపు ఫీజులు వసూలు చేయాలని చూస్తే, విద్యార్థులు నిలదీసే అవకాశం ఉంటుందని భావిస్తోంది. అయితే, ఒకేసారి కాకుండా, మూడు లేదా నాలుగు విడతల్లో (క్వార్టర్ల వారీగా) రీయింబర్స్ మెంట్ ను చెల్లించే విషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.