
ఇస్లామాబాద్: ఇండియా-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని తానే కుదిర్చానని ఊదరగొట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇండియా-పాకిస్థాన్ కాల్పుల విరమణ చర్చల్లో మూడవ పక్షం మధ్యవర్తిత్వానికి ఇండియా అంగీకరించలేదని.. ద్వైపాక్షికంగానే ఈ అంశాన్ని పరిష్కరించుకున్నామని పాక్ అంగీకరించింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అల్-జజీరాతో మాట్లాడుతూ.. ఇటీవల ఇరుదేశాల మధ్య చోటు చేసుకున్న సైనిక ఘర్షణల తర్వాత ఇండియా, పాక్ కాల్పులు విరమించాలని అమెరికా ప్రతిపాదించింది.
ఇరుదేశాలు తటస్థ వేదికలో సీజ్ ఫైర్ చర్చలు జరపాలని అమెరికా సూచించింది. కానీ కాల్పుల విరమణ చర్చల్లో అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఇండియా తిరస్కరించింది. ఇది ద్వైపాక్షిక విషయమని భారత్ తమ వైఖరిని పునరుద్ఘాటించిందని తెలిపారు. ద్వైపాక్షిక చర్చల ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీర్ అంశం, ఉగ్రవాదంపై చర్చలకు మూడవ పక్షం ప్రమేయానికి మాకేమి అభ్యంతరం లేదని.. కానీ ఇండియానే ద్వైపాక్షిక చర్చలకు పట్టుబడుతోందని అన్నారు.
ద్వైపాక్షిక చర్చలు జరపడానికి పాకిస్థాన్‌కు అభ్యంతరం లేదని.. కానీ సంభాషణలు ఉగ్రవాదం, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, జమ్మూ కాశ్మీర్, వంటి అంశాలపై సమగ్రంగా చర్చ జరగాలని కోరారు. పాకిస్తాన్ శాంతిని ప్రేమించే దేశమని.. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని మేం నమ్ముతున్నామన్నారు. ఇండియా చర్చలకు సిద్ధంగా ఉంటే మేం కూడా రెడీ అన్నారు.
కాగా, 2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసింది. ఉగ్రమూకలు 26 మంది పర్యాటకులను విచక్షణరహితంగా కాల్చి చంపారు. మతం అడిగి మరీ ఒకే వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేసుకుని హతమార్చారు. పహల్గాం టెర్రర్ ఎటాక్‌కు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.
ఈ మిషన్లో భాగంగా పాక్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి ఎక్కడికక్కడ టెర్రర్ క్యాంపులను నేలమట్టం చేసింది భారత సైన్యం. ఆపరేషన్ సిందూర్‌కు కౌంటర్‌గా పాక్ ప్రతిదాడులు చేయడంతో ఇండియా పాక్ మధ్య సైనిక ఘర్షణ మొదలైంది. ఇరుదేశాలు డ్రోన్లు, మిస్సైళ్లతో ఎటాక్ చేసుకున్నాయి. భారత్ దెబ్బకు తోకముడిచిన పాక్.. కాల్పుల విరమణ ఒప్పందం అంటూ కాళ్ల బేరానికి వచ్చింది. దీంతో ఇరుదేశాలు ద్వైపాక్షిక చర్చలు జరిపి కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
అయితే.. అమెరికా ట్రంప్ తన మాత్రం తన వల్లే ఇండియా పాక్ వార్ ఆగిందని పలుమార్లు క్లెయిమ్ చేసుకున్నారు. నేనే లేకుంటే అణు యుద్ధమే జరిగేదని ప్రగల్భాలు పలికారు. ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఎప్పటికప్పుడూ ఖండిస్తూ.. కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో దేశ లేదా వ్యక్తి ప్రమేయం లేదని.. ద్వైపాక్షిక చర్చల ద్వారానే సీజ్ ఫైర్ కుదిరిందని కౌంటర్ ఇస్తూ వస్తోంది.
అయినప్పటికీ ట్రంప్ మాత్రం నేనే యుద్ధం ఆపానంటూ గొప్పలు చెప్పుకోవడం ఆపడం లేదు. ఈ క్రమంలో ద్వైపాక్షిక చర్చల ద్వారానే కాల్పుల విరమణ ఒప్పంద కుదుర్చుకున్నామని.. ఇందులో మూడో పక్ష ప్రమేయం లేదని స్వయంగా పాకిస్థాన్ మంత్రి ఒప్పుకోవడంతో.. మాట మాటకు నేనే యుద్ధం ఆపానని చెప్పుకుంటున్న ట్రంప్ పరువు పోయింది.