
- 140 కోట్ల మంది అని ఊదరగొడతారు.. బుట్టెడు మక్కలైనా కొనలేరని కామెంట్
వాషింగ్టన్: రష్యా నుంచి క్రూడాయిల్ కొంటూ ఉక్రెయిన్ పై పరోక్షంగా యుద్ధానికి కారణమవుతున్నారని ఇండియాపై ఇప్పటికే 50 శాతం టారిఫ్లు వేసిన అమెరికా తాజాగా మరో సవాలు విసిరింది. అమెరికాలో పండించిన మొక్కజొన్నలను భారత్ కొనాలని, లేకపోతే తమ మార్కెట్ లోకి రాకుండా భారత్ పై నిషేధం విధిస్తామని ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి హొవార్డ్ లుట్నిక్ హెచ్చరించారు. ఆదివారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. అమెరికాపై టారిఫ్ లను భారత్ తగ్గించాలని, లేకపోతే కష్టకాలాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇండియా, యూఎస్ సంబంధాలు ప్రస్తుతం వన్ వే మార్గంలో ఉన్నాయన్నారు. ‘‘వారు (భారత్) తమ వస్తువులను మాకు అమ్మి సొమ్ము చేసుకుంటారు. కానీ, వారి ఎకానమీలోకి వెళ్లకుండా మమ్మల్ని బ్లాక్ చేస్తారు. మేమేమో వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉండాలంటారు. వారేమో మా ప్రతి వస్తువుపైనా టారిఫ్ లు వేస్తారు.
అలాగే, తమది 140 కోట్ల జనాభా అని భారత్ గొప్పలు చెప్పుకుంటుంది. కానీ, అమెరికా నుంచి తట్టెడు మక్కలు కొనడానికి కూడా ముందుకు రాదు. 140 కోట్ల జనాభా ఉన్నపుడు తట్టెడు మొక్కజొన్నలు కొనవచ్చు కదా” అని లుట్నిక్ వ్యాఖ్యానించారు. భారత్ ను అమెరికా ఎలా చూస్తుందో, అమెరికాను కూడా భారత్ అలాగే ట్రీట్ చేయాలన్నారు. ఈ విషయాన్ని తమ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదివరకే స్పష్టం చేశారని గుర్తుచేశారు. ‘‘మా దేశ అధ్యక్షుడు ఒక్కసారి చెప్పిన తర్వాత వినాలి. లేకపోతే ప్రపంచంలోనే భారత్ కు అతిపెద్ద వినియోగదారునిగా ఉన్న అమెరికాతో వ్యాపారం చేసే అవకాశాన్ని కోల్పోతారు” అని లుట్నిక్ పేర్కొన్నారు.
మక్కలు కొనేలా ఎందుకు బలవంతం?
ఈ ఏడాది అమెరికాలో మక్క రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చైనాతో అమెరికా సంబంధాలు దెబ్బతిన్న తర్వాత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ నడుస్తుండడంతో చైనా నుంచి ఆర్డర్లు భారీగా తగ్గిపోయాయి. దీంతో అమెరికా రైతులు దివాలా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ మొక్కజొన్నలు కొనేలా భారత్ ను అమెరికా ఒత్తిడి చేస్తోంది.