
ఇస్లామాబాద్: పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్‌కు కౌంటర్‌గా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌తో పాటు పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మొత్తం 9 చోట్ల ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది. లష్కరే తోయిబా, జైషీ మహ్మద్ వంటి కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థల ప్రధాన స్థావరాలపైన ఇండియా ఎటాక్ చేసింది. భారత్ చేసిన ఈ మెరుపు దాడుల్లో భారీ సంఖ్యలో టెర్రరిస్ట్‌లు హతం కావడంతో పాటు ఉగ్రవాద శిబిరాలు నామారూపాల్లేకుండా పోయాయి.
ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ గురించి జైష్-ఎ-మొహమ్మద్ (JeM) టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ సంచలన విషయాలు బయటపెట్టాడు. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా బహవల్పూర్లోని జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాయలం సుభాన్ అల్లా కాంప్లెక్స్‌పై ఇండియా బాంబుల వర్షం కురిపించిందని తెలిపాడు. ఇండియన్ ఆర్మీ దాడిలో జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం సభ్యులు ముక్కలు ముక్కలయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు సర్వస్వం కోల్పోయామన్నాడు.
‘‘పాకిస్థాన్ దేశ సరిహద్దులను కాపాడటం కోసం ఉగ్రవాదాన్ని స్వీకరించాం. ఇందులో భాగంగా ఢిల్లీ, కాబూల్, కాందహార్‌లతో పోరాడాం. పాక్ కోసం సర్వం త్యాగం చేశాం. కానీ ఆపరేషన్ సిందూర్ పేరుతో 2025, మే 7న బహవల్‌పూర్‌లో మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని భారత దళాలు ముక్కలు ముక్కలు చేశాయి’’ అని అన్నాడు ఇలియాస్ కాశ్మీరీ. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఇండియా చేసిన దాడుల్లో తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయానని జైషీ చీఫ్ మసూద్ అజార్ కూడా అంగీకరించిన విషయం తెలిసిందే.
మసూద్ అజార్ ఎవరంటే..?
2001 భారత పార్లమెంటుపై దాడి, 2008 ముంబై దాడులు, 2016 పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి బాంబు దాడి వంటి అనేక ప్రధాన దాడుల మాస్టర్ మైండ్, కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్. ఇప్పటికే భారత్ అతడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించింది. 2019లో ఐక్యరాజ్యసమితి కూడా అజార్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది. గతంలో ఇండియా ఈ కరుడుగట్టిన టెర్రరిస్ట్‌ను అరెస్ట్ చేయగా.. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం IC-814 హైజాక్ చేసి ఉగ్రవాదులు మసూద్ అజార్‌ను విడిపించారు. ఆ తర్వాత జైషీ మహ్మద్ ఉగ్రవాద సంస్థ స్థాపించి భారత్‌లో ఎన్నో దాడులు చేయించాడు అజార్.