తెలంగాణ ప్రభుత్వం మార్చి 18న జీవో ఎంఎస్ నెంబర్ 76, 77ను తీసుకురావడంతో సాదాబైనామా ద్వారా భూముల కొనుగోలు చేసిన రైతుల సమస్యల పరిష్కారానికి అడుగులు ముందుకుపడ్డాయి. సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూములన్నిటికీ పరిష్కారం లభిస్తుందా.. అసలు సాదాబైనామా అంటే ఏమిటి? గతంలో సాదాబైనామా క్రమబద్ధీకరణ వల్ల రైతులకు మేలు జరిగిందా వీటన్నింటికీ క్షుణ్ణంగా పరిశీలించాలి. గ్రామీణ ప్రాంతంలోని రైతులు తెల్ల కాగితం లేదా మౌఖికంగా పట్టా భూములను కొనుగోలు చేసిన అన్నింటిని క్రమబద్ధీకరించే ప్రక్రియనే సాదాబైనామా అంటారు.
ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలో భూముల అమ్మకాలు కొనుగోలు తెల్ల కాగితాలు, స్టాంప్ పేపర్ల మీద జరుగుతున్నాయి. ఒకవైపు భూముల వివరాలు భూముల అమ్మకాలు, కొనుగోలు అంతా కంప్యూటరీకరణ జరిగి ఆన్లైన్లోనే ఈ ప్రక్రియ జరుగుతూ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 76, 77 మార్చి 18న తీసుకురావటంతో సాదాబైనామా అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.
అసలు ఈ ప్రక్రియ మూలాలలోకి వెళితే భూముల అమ్మకాలు, కొనుగోలు ప్రక్రియ అంతా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరగాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే 1971లో పట్టాదారు పాస్ పుస్తకాలు చట్టం తీసుకువచ్చి 1989లో ఈ చట్ట నియమాలను రూపొందించింది. అనంతరం భూ యజమానులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వటం జరిగింది. అయినాకానీ గ్రామీణ ప్రాంతంలో రైతుల భూముల అమ్మకాలు, కొనుగోలు ప్రక్రియ తెల్ల కాగితాలు, మౌఖికంగా జరుగుతున్నాయి. ఈ భూముల క్రమబద్ధీకరణ కోసం 1989లో చట్ట సవరణ చేసి సెక్షన్ 5-Aని చేర్చడం జరిగింది. 1989 నుంచి 2020 వరకు కూడా సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణ కోసం దాదాపుగా 14 సార్లు ప్రభుత్వం జీవోలను తీసుకువచ్చింది. కానీ ఈ ప్రక్రియ అసంపూర్ణంగానే మిగిలిపోయింది.
హైకోర్టులో కేసు
2020వ సంవత్సరంలో 1971 చట్టాన్ని రద్దు చేస్తూ నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని (ధరణి) తీసుకువచ్చారు. ఈ క్రమంలో జీవో ఎంఎస్ నెంబర్ 112 తేదీ 12 -–10– -2020 నాడు తీసుకువచ్చి 2014 జూన్ 2 కంటే ముందు 12 ఏళ్ల పాటు భూమి తమ అధీనంలో ఉండి సన్న, చిన్న కారు రైతుల భూములను క్రమబద్ధీకరించటం కోసం అవకాశం కల్పించడం జరిగింది. ఈ జీవో ప్రకారం 10-– 11-– 2020 వరకు సాదాబైనామా ద్వారా కొన్న భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులను స్వీకరించగా... తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద తొమ్మిది లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలో అక్టోబర్ 29, 2020 నాడు కొత్త ఆర్ఓఆర్ ధరణి చట్టాన్ని
తీసుకువచ్చారు. కానీ ఈ ప్రక్రియపై హైకోర్టులో కేసు వేయడంతో సాదాబైనామా క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. కేవలం అక్టోబర్ 29, 2020 కంటే ముందు వచ్చిన రెండు లక్షల 26 వేల 693 దరఖాస్తులు మాత్రమే పరిష్కరించాలని హైకోర్టు సూచించింది. మిగిలిన 6 లక్షల 74 వేల పైచిలుకు దరఖాస్తులన్నీ పెండింగ్లో పెట్టాలని ప్రభుత్వానికి సూచన చేసింది. అప్పటినుంచి 2025 సంవత్సరంలో భూభారతి చట్టం వచ్చేంతవరకు ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం మార్గం లేకుండాపోయింది.
విచారణ అనంతరం క్రమబద్ధీకరణ
2025 సంవత్సరంలో భూభారతి చట్టంలో సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం సెక్షన్ 6 రూల్ -6ని పొందుపరిచారు. అప్పటికే కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసు WP నెంబర్ 270 ఆఫ్ 2020. ఈ కేసులో వెంటనే 2025 భూభారతి చట్టంలో నిబంధనలను చూసి సాదాబైనామా ప్రక్రియను కొనసాగించాల్సిందిగా జడ్జిమెంట్ ఇవ్వటంతో జీవో 106ను తీసుకొచ్చారు. ఏదైతే గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమి 2014 జూన్ 2 కంటే ముందు సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసి 12 సంవత్సరాలుగా అనుభవంలో ఉంటూ 12– -10 –-2020 నుంచి 10–- 11–- 2020 మధ్య కాలంలో క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న భూములకు ఆర్డీఓ విచారణ చేసి సర్టిఫికెట్ జారీ చేసేలా మార్గదర్శకాలను రూపొందించారు. ఈ క్రమంలో భూములు అమ్మిన వ్యక్తులు లేదా వారి వారసుల నుంచి ఆఫిడవిట్ తీసుకురావాలి అనే నిబంధన అతిపెద్ద సమస్యగా మారడంతో ఈ సమస్యకు పరిష్కారం దొరకకుండా పోయింది. ఈ తరుణంలో సాదాబైనా ప్రక్రియ ప్రభుత్వానికి సమస్యగా మారడంతో పునరాలోచన చేసి సాదాబైనామా ప్రక్రియ పరిష్కారం కోసం జీవో ఎంఎస్ నెంబర్ 76, 77 లను తీసుకువచ్చారు. జీఓ ఎం ఎస్ 76 ప్రకారం సాదాబైనామా ద్వారా భూములను కొనుగోలు చేసినటువంటి వ్యక్తి అఫిడవిట్ ఇస్తూ లింకు డాక్యుమెంట్స్ ఇచ్చి దరఖాస్తు చేసుకున్నట్లయితే, విచారణ అనంతరం సాదాబైనామా క్రమబద్ధీకరణ చేసేందుకు అవకాశం లభించింది.
అవకతవకలు ఉన్నట్లయితే క్రిమినల్ చర్యలు
ఒకవేళ ఈ ప్రక్రియలో అవకతవకలు ఉన్నట్లయితే క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు ఈ ప్రక్రియను రద్దు చేసేలా ప్రభుత్వం ఈ జీవో ద్వారా అవకాశం కల్పించింది. జీవో 77 ప్రకారం హెచ్ఎండిఏ, కుడా, మున్సిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీలలో కలిపిన గ్రామీణ ప్రాంతాలలో సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం వెసులుబాటు కల్పించింది. సాదాబైనామా క్రమబద్ధీకరణ అనేది భూసంస్కరణల చట్టం 1973, పట్టణ భూ పరిమితి చట్టం 1976, ఎల్టిఆర్ చట్టం 1959 (1/70), అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధిత చట్టం 1977, వక్ఫ్ చట్టం 1955, ఎవక్యూ ప్రాపర్టీ 1950, ఎనిమీ ప్రాపర్టీ చట్టం 1968, భూదాన్ చట్టం 1965, దేవాదాయ చట్టం 1987 ఈ చట్టాల కింద హక్కులు కల్పించిన భూములను సాదాబైనామా కింద క్రమబద్ధీకరించడానికి అవకాశం లేదు. ప్రధానంగా గిరిజన ప్రాంతంలో ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ 1959 (1/70) చట్టం అమలులో ఉంది. ఈ చట్టం ప్రకారం భూముల అమ్మకాలు, కొనుగోలు గిరిజనులు, గిరిజనులతో కూడిన సొసైటీకి మాత్రమే అవకాశం ఉంటుంది. కనుక గిరిజన ప్రాంతంలో 1/70 చట్టాన్ని ఉల్లంఘించి సాదాబైనామా క్రమబద్ధీకరణ చేయకూడదు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సాదాబైనామా క్రమబద్ధీకరణ చేయాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగం మీద ఉంది.
- వాసం
ఆనంద్ కుమార్
న్యాయవాది
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
