పరిహారం తేల్చకుండా భూములెట్ల తీస్కుంటరు? ఎన్కేపల్లి గోశాల పనులను అడ్డుకున్న రైతులు

పరిహారం తేల్చకుండా భూములెట్ల తీస్కుంటరు? ఎన్కేపల్లి గోశాల పనులను  అడ్డుకున్న రైతులు
  • ఉద్రిక్తతల మధ్య ఎన్కేపల్లిలో గోశాల భూమిపూజ

  • చదును పనులను అడ్డుకుని రైతుల ఆందోళన


చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​ మండలం ఎన్కేపల్లి గ్రామంలో గోశాల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించగా.. భూసేకరణ విషయంలో రైతులు, అధికారులకు మధ్య కొన్ని రోజులుగా గొడవ నడుస్తోంది. ప్రభుత్వం ఎకరాకు 200 గజాల చొప్పున స్థలాన్ని ఇస్తామని ప్రకటించగా.. 500 గజాలు ఇవ్వాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. 

ఈ క్రమంలో 99 ఎకరాల్లో పనులు చేపట్టేందుకు సోమవారం (జులై 07) ఎన్కేపల్లిలో అధికారులు ఎమ్మెల్యే కాలె యాదయ్యతో భూమి పూజ చేయించారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి భారీగా చేరుకున్నారు. తమతో చర్చలు జరుపుతామని చెప్పి  భూమి పూజ ఎలా చేయిస్తారని మండిపడ్డారు. పరిహారంపై తేల్చకుండానే పనులకు పూనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. 

ఆందోళనకారులు ఎమ్మెల్యేను చుట్టుముట్టగా పోలీసులు ఆయనను అక్కడి నుంచి పంపించేశారు. జేసీబీతో చెట్లను తొలగిస్తుండగా రైతులు కర్రలతో దాడులకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. సాయంత్రం రైతులను మాజీ ఎమ్మెల్యే కె.ఎస్​.రత్నం కలిసి తన మద్దతు ప్రకటించారు. గోశాల నిర్మాణానికి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను తీసుకోవాలని, రైతులను ఇబ్బంది పెట్టొద్దని  ప్రభుత్వాన్ని కోరారు.