పంద్రాగస్టులోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తవా?

పంద్రాగస్టులోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తవా?
  •     సీఎం రేవంత్​కు హరీశ్​రావు సవాల్
  •     కాంగ్రెస్​ గ్యారంటీలే ఆ పార్టీకి భస్మాసుర హస్తం అయితయ్​
  •     ఓట్ల కోసం రుణమాఫీ పేరిట నాటకాలు ఆడ్తున్నరు
  •     రేవంత్​రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడ్తున్నడు
  •     ఇప్పటికైనా సీఎం హోదాకు తగ్గట్టు మాట్లాడితే మంచిదని వ్యాఖ్య

సంగారెడ్డి, వెలుగు: ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా? అని సీఎం రేవంత్​రెడ్డికి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు సవాల్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలే ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి భస్మాసుర హస్తం అవుతాయని ఆయన అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్​లో బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో హరీశ్​రావు మాట్లాడారు.

‘‘4 నెలలైనా రుణమాఫీ హామీని కాంగ్రెస్​ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. ఇప్పుడు లోక్​సభ ఎన్నికల్లో ఓట్ల కోసం పంద్రాగస్టులోపు రుణమాఫీ అంటూ నాటకం ఆడుతున్నది” అని దుయ్యబట్టారు. ఇప్పటివరకు రైతుబంధు కూడా పూర్తిగా ఇవ్వలేదని విమర్శించారు. ‘‘కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి 100 కారణాలు ఉన్నాయి. రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్, ఆసరా పెన్షన్ల పెంపు, మహిళలకు 2,500 సాయం, కల్యాణలక్ష్మికి తులం బంగారం, నిరుద్యోగ భృతి.. ఇలా హామీలపై మాట తప్పినందుకు కాంగ్రెస్​ను ప్రజలు ఓడిస్తరు.

రేవంత్ రెడ్డి అంటే మాటల కోతలు.. కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు” అని హరీశ్​రావు వ్యాఖ్యానించారు. నాలుగున్నర నెలల్లోనే  ఏదేదో చేసినట్టు కాంగ్రెస్​ చెప్పుకుంటున్నదని, కాంగ్రెస్​కు ఓటేయకపోతే పథకాలు బంద్ పెడ్తామని ఆ పార్టీ లీడర్లు బ్లాక్​ మెయిల్​ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘‘మెడలో పేగులేసుకుంటా, మానవ బాంబునై పేలుతా, డ్రాయర్ ఊడగొడతా అంటూ రేవంత్​రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నడు. ఇప్పటికైనా సీఎం హోదాకు తగ్గట్టు మాట్లాడితే మంచిది” అని హరీశ్​రావు అన్నారు.