కింగ్‌స్టన్ (జమైకా): ఛేజింగ్‌లో షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (54 నాటౌట్), పావెల్ (33), హెట్‌మయర్ (32) చెలరేగడంతో.. ఆదివారం రాత్రి జరిగిన ఆఖరిదైన మూడో టీ20లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కరీబియన్లు 2–1తో సొంతం చేసుకున్నారు.
టాస్ ఓడిన లంక 20 ఓవర్లలో 169 రన్స్ చేసింది. దునిత్ వెల్లలాగే (43) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన షామెర్ జోసెఫ్ ఆఖరి ఓవర్‌లో మరో మూడు వికెట్లు పడగొట్టి లంక బ్యాటింగ్‌ను కూల్చాడు. తర్వాత విండీస్ 19.4 ఓవర్లలో 170/5 స్కోరు చేసి నెగ్గింది.
పావెల్, రూథర్‌ఫోర్డ్ ఐదో వికెట్‌కు 81 రన్స్ జోడించి ఆదుకున్నారు. 17వ ఓవర్ చివరి బాల్‌కు పావెల్ ఔటైనా.. హోల్డర్ (21 నాటౌట్) భారీ సిక్సర్లతో విజయాన్ని అందించాడు. జోసెఫ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
