వైన్​ షాపులు పెట్టొద్దంటున్నరు

వైన్​ షాపులు పెట్టొద్దంటున్నరు
  • షెటర్లను అద్దెకు ఇవ్వమంటున్న యజమానులు
  • ఊరి మధ్యలో వద్దంటున్న గ్రామస్తులు
  • క్లస్టర్ విధానంతో పట్టణ ప్రజల ఆందోళన
  • ఒకే దగ్గర పెట్టేందుకు వ్యాపారులు ఆరాటం

రంగారెడ్డి జిల్లా, వెలుగు : 

టెండర్ ప్రక్రియలో వైన్​ షాపులు దక్కినా వాటిని ఏర్పాటులో నిర్వాహకులు  సంకట పరిస్థితులు  ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా గిరాకి ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటున్న దశలో వారికి స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండడం గమనార్హం.  గ్రామీణ ప్రాంతాల్లో  వైన్‌‌‌‌ షాపులు ఊరి మధ్యలో ఏర్పాటు వల్ల స్థానికంగా సమస్యలు ఎదురవుతుండడమే ఇందుకు ప్రధాన కారణం. ఆచరణలో ఎన్ని నిబంధనలు ఉన్నప్పటికీ మద్యంషాపులు అర్ధరాత్రి వరకు విక్రయిస్తుండడం, మద్యం మత్తులో ఎవరి వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న భయంతో గ్రామస్తులు వైన్ షాపుల ఏర్పాటుకు ససేమిరా అంటూ అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు పునరావృతం కావొద్దనే యోజనతో కొన్ని గ్రామపంచాయతీలు తీర్మానాలు కూడా చేస్తున్నాయి. వైస్​షాపులను గ్రామానికి చివర్లో ఏర్పాటుచేసుకోవాలని గ్రామ పెద్దలు సూచిస్తుండడం విశేషం.   అదేవిధంగా పట్టణాల్లో క్లస్టర్ వారీగా టెండర్లు ఆహ్వనించడంతో ఆ పరిధిలో ఉన్న షాపులు ఒకే దగ్గర పెడితే లాభం ఉంటుందని వ్యాపారులు ఆలోచిస్తున్నారు. నగరంలోని కాచిగూడ, ముషీరాబాద్, అంబర్‌‌‌‌పేట, సికింద్రాబాద్‌‌‌‌, చార్మినార్‌‌‌‌ ప్రాంతాల్లో మద్యం షాపులు ఏర్పాటుకు స్థానికులు సహకరించడం లేదని తెలుస్తోంది.

క్లస్టర్‌‌‌‌తో సమస్యలు

ఎక్సైజ్‌‌‌‌ శాఖ కొత్తగా క్లస్టర్‌‌‌‌ విధానాన్ని ప్రవేశ పెట్టింది. కొందరు మద్యం వ్యాపారులు ముఖ్యమైన అడ్డాలను వారి వద్దనే ఉంచుకుని కొత్తగా వైన్‌‌‌‌షాపు లైసెన్స్‌‌‌‌ పొందినవారికి ఆ అడ్డాలు దొరకకుండా మోకాలడ్డుతున్నారనే  ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త అడ్డాలు ఎంచుకునే ప్రదేశాల్లో స్థానికులు నో ఆబ్జెక్షన్​ సర్టిఫికెట్​(ఎన్​వోసీ) రాకుండా ఫిర్యాదుల పరంపరతో సహాయ నిరాకరణ పాటిస్తున్నారు.  క్టస్టర్​ విధానంలో ఎక్సైజ్​ శాఖ  మున్సిపాలిటీలో 4 నుంచి 6 డివిజన్‌‌‌‌లు కలిపి ఒక క్లస్టర్‌‌‌‌గా ఏర్పాటు చేశారు.  ఆ క్లస్టర్‌‌‌‌లో 3 నుంచి 6 వైన్‌‌‌‌షాపులు ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని ఈసారి  నిబంధనలు విధించారు. ఒక క్లస్టర్‌‌‌‌లోని షాపులకు అడ్డాలు లభించని సందర్భంలో పక్కపక్కనే ఏర్పాటు చేసుకునే అవకాశముంటుంది. అప్పుడు పట్టణ ప్రజలకు ప్రశాంతత లేకుండా పోతుంది. ఆ పక్కనే సిట్టింగ్‌‌‌‌లు ఏర్పాటు చేయడంతో మరింత అల్లరి ప్రాంతంగా మారుతుందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నవంబర్‌‌‌‌  ఒకటి నుంచి కొత్త షాపులు

కొత్త  ఎక్సైజ్‌‌‌‌ పాలసీ ప్రకారం నవంబర్​ నుంచి రెండేండ్ల వరకు  మద్యం షాపుల లైసెన్స్‌‌‌‌లను జారీ చేయనున్నారు. 2019 నవంబర్‌‌‌‌ 1 వ తేదీ నుంచి 2021 అక్టోబరు 31వ తేదీ వరకు ఈ లైసెన్స్‌‌‌‌లు చెల్లుబాటవుతాయి. ఇప్పటికే ఆయా గెజిట్‌‌‌‌ నంబర్లలో ఉన్న వైన్‌‌‌‌షాపుల్లో ఈ నెల 30 వరకు మిగిలిన మద్యాన్ని డిపోలో డిపాజిట్‌‌‌‌ చేయాల్సి ఉంటుంది. లేదా కొత్తగా లైసెన్స్‌‌‌‌ పొందిన మద్యం షాపుకు బదిలీ చేసేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా పాత షాపుల్లోమద్యం స్టాక్‌‌‌‌ ఉండకుండానే లైసెన్స్‌‌‌‌దారులు జాగ్రత్తలు పడుతుంటారు. మిగిలిపోయిన స్టాక్‌‌‌‌ను పాత లైసెన్స్‌‌‌‌దారులు బెల్ట్‌‌‌‌ షాపులకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

586 షాపులకు టెండర్‌‌‌‌ ఓకే

హైదరాబాద్‌‌‌‌, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో 595 మద్యం షాపులుండగా 586 షాపులకే లాటరీ ద్వారా డ్రా తీశారు. మిగిలిన 9 మద్యం షాపులకు డ్రాను వాయిదా వేసినట్లు ఎక్సైజ్‌‌‌‌ అధికారులు తెలిపారు.   హైదరాబాద్‌‌‌‌ జిల్లాలో 173 మద్యం షాపులకు 166 షాపులు ఎంపిక చేశారు. అదేవిధంగా రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో 422 షాపులకు 420 షాపులను ఎంపిక చేశారు.

Wine shop owners are facing difficulties in setting up wine shops