
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చలి క్రమంగా పెరుగుతున్నది. నైరుతి రుతుపవనాల కాలం అయిపోవడం.. వర్షాలు చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో రాత్రిపూట చలిగాలులు వీస్తున్నాయి. ఆరేడు జిల్లాల్లో చలి తీవ్రత కొంచెం ఎక్కువగానే నమోదవుతున్నది. సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్లో 16 డిగ్రీల మేర రాత్రి టెంపరేచర్లు నమోదయ్యాయి.
అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా మోగ్దంపల్లిలో 16.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. రంగారెడ్డి జిల్లా ఎలిమినేడులో 16.3 డిగ్రీలు, వికారాబాద్లో 16.6, మెదక్లో 16.6, సిద్దిపేటలో 17.4, రాజన్న సిరిసిల్లలో 17.6, కామారెడ్డిలో 17.8, నాగర్కర్నూల్ జిల్లాలో 17.8 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, నారాయణపేట, మహబూబ్నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, వనపర్తి, యాదాద్రి, జనగామ, నల్గొండ జిల్లాల్లో 18 డిగ్రీల వరకు టెంపరేచర్లు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో మాత్రం రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉన్నాయి.
కాగా.. రాష్ట్రంలోని పలు చోట్ల ఆదివారం మోస్తరు వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వానలు పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో అత్యధికంగా 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో మాత్రం వర్షం పడే అవకాశం లేదని, పొగమంచు పరిస్థితులు ఉంటాయని తెలిపింది.