వరుస వానలతో అడుగుకో గండం

వరుస వానలతో అడుగుకో గండం

భారీ వానలకి సిటీ రోడ్లు డ్యామేజ్
మెయిన్ రోడ్ల రిపేర్లు పట్టించుకోని ఏజెన్సీలు
ఇంటర్నల్ రోడ్లపైనే బల్దియా ఫోకస్

హైదరాబాద్, వెలుగువరుస వానలతో సిటీ రోడ్లపై జర్నీ డేంజర్‌గా మారింది. ఎక్కడికక్కడ దెబ్బతిన్న రోడ్లు, అడుగడుగునా గుంతలతో అధ్వానంగా తయారైంది. రోజులు గడుస్తున్నా, జనం ప్రమాదాల బారిన పడుతున్నా రిపేర్లు మాత్రం చేయడం లేదు.  మెయిన్ రోడ్ల నిర్వహణ చూస్తున్న ఏజెన్సీలు నిర్లక్ష్యంగా ఉన్నాయి. గ్రేట‌ర్ లో  709 కిలోమీట‌ర్ల  ప్రధాన రోడ్ల నిర్వహణ బాధ్యతలను బల్దియా 1,838 కోట్లతో ప్రైవేట్ ఏజెన్సీల‌కు అప్పగించింది. ఈ ఏడాది జనవరిలో మొదలైన కాంట్రాక్ట్  ఐదేండ్ల వరకు కొనసాగనుంది. దాంతో  జీహెచ్ఎంసీ    కూడా పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. గ‌తేడాది వ‌ర్షాల తో దెబ్బతిన్న రోడ్ల రిపేర్లకు బ‌ల్దియా రూ. 596 కోట్లతో మరమ్మతులు చేపట్టింది. అందులో 1,968 ప‌నులున్నాయి. ఇప్పుడు ఏజెన్సీలు, అధికారులెవరూ  పట్టించుకోవడం లేదు.

బల్దియా ఏంచేస్తోందంటే…

జీహెచ్‌ఎంసీ అధికారులు అంత‌ర్గత రోడ్లమీదే ఫోక‌స్ పెట్టారు. గత ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు వాటి రిపేర్లకు రూ.22కోట్లు ఖ‌ర్చు చేశారు. ఇటీవలి  వానలకు వంద‌ల కిలోమీట‌ర్ల మేర డ్యామేజ్ అయ్యాయి. వాటి రిపేర్లు, కొత్త రోడ్లకు దాదాపు 100 కోట్లకు పైగా అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ముఖ్యమైన ఏరియాల్లో, తప్పనిసరి అనుకున్నచోట మరమ్మతులు చేస్తున్నారు.  మిగ‌తా చోట్ల వానలు తగ్గాకే పనులు చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. గ‌తేడాది ఆగ‌స్టులో సీఆర్ఎంపీ తోపాటు ఇత‌ర రోడ్లలో 3,069 స్పాట్ హోల్స్ ఏర్పడ్డట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం 5 వేల‌కిపైనే స్పాట్ హోల్స్ పడ్డట్లు తెలిసింది.

4 రోజుల్లో 106కి పైగా కంప్లయింట్స్ 

నాలుగు రోజుల్లో రోడ్లు, స్పాట్ హోల్స్ రిపేర్ల కోసం బ‌ల్దియా కాల్ సెంట‌ర్‌కు 106 కంప్లయింట్స్ వ‌చ్చాయి. ప్రస్తుతం వ‌స్తున్న కాల్స్‌లో 70శాతం రోడ్ల మ‌రమ్మతులకు సంబంధించినే ఉంటున్నాయి. అధికారులు స్పందించ‌క‌పోవ‌డంతో కాల్స్ పెరుగుతున్నాయి.