ఫుడ్​ కంపెనీల డెడ్​లైన్లతో  డెలివరీ బాయ్స్​కు చలాన్లు

ఫుడ్​ కంపెనీల డెడ్​లైన్లతో  డెలివరీ బాయ్స్​కు చలాన్లు

హైదరాబాద్, వెలుగు: ఆన్​లైన్​ఫుడ్​కంపెనీలు పెట్టిన స్పీడ్​డెలివరీ నిబంధనతో బాయ్స్​కు ట్రాఫిక్​చలాన్ల కష్టాలు వచ్చి పడుతున్నాయి. కస్టమర్​ఆర్డర్ చేసిన ఫుడ్​ను 30 నిమిషాల్లో చేరవేయకుంటే ఫుడ్​కంపెనీలు ​కమీషన్​కట్​చేస్తున్నాయి. దీంతో  రోడ్లపై ఫాస్ట్​గా వెళ్తూ డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. స్పీడ్​గా డెలివరీ చేయాలనే టార్గెట్ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి వెళ్లాల్సి వస్తుందని బాయ్స్​ అంటున్నారు. కస్టమర్​కు ఇన్​టైమ్​లో డెలివరీ చేయకుంటే తమకు వచ్చే కమీషన్ లో కొంత మొత్తాన్ని కట్ చేస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు.  గ్రేటర్ పరిధి లో ఒక్కో  రైడర్ పైన కనీసం రూ. 3 వేల వరకు పెండింగ్ చలాన్లు ఉన్నాయని చెప్తున్నారు. వచ్చే సంపాదన ట్రాఫిక్​చలాన్లు చెల్లించడానికే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
సిగ్నల్ జంప్..సెల్ ఫోన్ డ్రైవింగ్
వారం కిందట మణికొండలో ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లిన ఓ బాయ్ ఇన్​టైమ్​లో ఇవ్వాలని స్పీడ్​గా వెళ్తూ  సిగ్నల్ జంప్ చేశాడు. మరుసటి రోజు అతడి బైక్ పై రూ.వెయ్యి చలాన్ జనరేట్ అయ్యింది. ఇదే విధంగా చాలామంది డెలివరీ బాయ్స్ సిగ్నల్ జంప్, సెల్​ఫోన్​లో కస్టమర్లతో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ఇటీవల యూసుఫ్ గూడ వద్ద డెలివరీ ఇచ్చేందుకు వెళ్తున్న ఓ బాయ్ ను ట్రాఫిక్ పోలీసులు ఆపి చెక్ చేయగా  రూ. 1500 పెండింగ్ లో ఉన్నట్లు తేలింది. పోలీసులు అతడి బైక్ ను లాక్కోవడంతో డెలివరీ కి లేట్ అవుతుందని అప్పటికప్పుడు  రూ. 800 అప్పు చేసి కట్టాల్సి వచ్చిందని అతడు చెప్పాడు. 
పట్టించుకోని కంపెనీలు
స్పీడ్​గా డెలివరీ చేసేందుకు రిస్క్ చేసి కస్టమర్లకు ఆర్డర్లు అందిస్తుంటే తమను కంపెనీలు పట్టించుకోవడం లేదని బాయ్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సరిగా ఆర్డర్లు లేక, ఈఎంఐలు చెల్లించడమే కష్టంగా మారిందని, కంపెనీలు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదని కూకట్​పల్లికి చెందిన ఓ డెలివరీ బాయ్ ఆవే దన వ్యక్తం చేశాడు. సిటీలో50 వేలకు పైగా  బాయ్స్ ఉండగా,  80 శాతం మంది బైక్ లకు పెండింగ్ చలాన్లు ఉన్నాయన్నాడు. అన్ని ఫుడ్​ కంపెనీలు చొరవ తీసుకుని, డెలివరీ బాయ్స్ పై ఆర్థిక భారం పడకుండా చూడాలని తెలంగాణ గిగ్ ప్లాట్ ఫాం వర్కర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ సలావుద్దీన్ కోరారు.