ఉచిత బస్సు ప్రయాణంతో.. మహిళల్లో చైతన్యం : కె.సౌజన్య

ఉచిత బస్సు ప్రయాణంతో.. మహిళల్లో చైతన్యం : కె.సౌజన్య

రాష్ట్రంలో  కాంగ్రెస్  ప్రభుత్వం  ప్రకటించిన 6 గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. ఆడవాళ్లు అడిగారా అని, ఖజానాకు పెను భారమని ఉచిత బస్సు ప్రయాణంపై కొందరు పెదవి విరుస్తున్నారు. నాలుగు గోడల మధ్య ఇంటికే బందీ అయిన మహిళలకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి  వెళ్లే స్వేచ్ఛ ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం వల్ల లభించింది. భారతీయ మహిళల్లో  ముఖ్యంగా గ్రామీణ, పేద,  మధ్యతరగతి మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉండదు. బాల్యంలో తండ్రి, పెళ్లి అయ్యాక భర్త,  వృద్ధాప్యంలో కన్న బిడ్డలపై ఆధారపడి ఉండాలి.  ఏ అవసరానికి ఎక్కడికి వెళ్లాలన్నా ముందే  మొర పెట్టుకోవాల్సిందే. ఆర్థిక పరిస్థితి అనుకూలించి  అవసరమైన డబ్బులు ఉంటేనే ఆడవారు ఇంట్లో నుంచి వెళ్లగలుగుతారు. ఈ బానిస బంధాన్ని ఉచిత ప్రయాణం బద్దలు కొట్టింది. మహిళలు రాష్ట్రమంతా స్వేచ్ఛగా ప్రయాణించడానికి గ్యారంటీ ఏర్పడింది. ప్రయాణం చైతన్యానికి మొదటి మెట్టు.  స్త్రీలు స్వేచ్ఛగా, ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం వారి జీవితంలో అనేక ఆశలు రేకెత్తిస్తోంది.

50శాతం ఆడవాళ్లు వంటింటికే పరిమితం

 దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఇంకా 50శాతం ఆడవాళ్లు వంటింటికే పరిమితమై ఉన్నారు. బయటి సమాజం గురించి, అభివృద్ధి చెందుతున్న విజ్ఞానం గురించి,  ప్రపంచంలో అనునిత్యం జరిగే సరికొత్త మార్పుల గురించి తెలియని మహిళలు నేడు జనాభాలో  సగం ఉన్నారు. పుణ్యక్షేత్రాల సందర్శనతో పాటు, విజ్ఞాన విహారాన్ని కూడా మహిళల దరి చేరుస్తుంది ఈ ఉచిత బస్సు ప్రయాణం.  అడ్డ కూలీలు, వ్యవసాయ కూలీలు, నిరుపేద మహిళలు,  పైవేట్‌‌ ఉద్యోగాలు చేసే మహిళలు తమ  సంపాదనలో ఎక్కువశాతం ప్రయాణానికే ఖర్చు పెట్టేవారు.  కేసీఆర్​ ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలతో సగటు జీవులు ఎంతో బాధపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రస్తుతం వీరికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. మంచి కూలి దొరుకుతుందంటే దూరం పోవడానికి ఇక వెనుకాడరు. అదేవిధంగా పేద మహిళలు ఉచిత బస్సు సౌకర్యంతో ఆర్థికంగా ఎంతో మేలు పొందుతారు. పేద, మధ్యతరగతి మహిళలకు ఉపాధి మార్గాలు తెరుచుకుంటాయి.

స్వయం ఉపాధి పొందే మహిళలకు బాసట

ఖర్చులకు వెనకాడే  మహిళా ప్రయాణికుల కష్టాలకు ఉచిత బస్సు ముగింపు పలుకుతుంది.  పూలు, కూరగాయలు అమ్ముకుంటూ చిన్నపాటి వ్యాపారం చేసే మహిళలకు ఉచిత బస్సు ఎంతో అండగా నిలుస్తోంది.  రోజంతా కష్టపడి పనిచేసి సంపాదించే 300 నుంచి  500 రూపాయల్లో కొంతైన పొదుపు చేసి వారి కుటుంబాలను ఆదుకోగలుగుతారు. ఉచిత బస్సు ప్రయాణంతో మిగిలే డబ్బులతో నిత్యావసర సరుకులు, పిల్లల చదువులు కోసం ఖర్చు పెడతారు. మహిళలు పురుషుల కంటే చాలా పొదుపరులు,  దుబారా చేయరనే వాస్తవాన్ని  పాలకులు గుర్తించాలి. పిల్లల భవిష్యత్తు కోసమో, కుటుంబం కోసం ప్రతి పైసా పొదుపు చేస్తారు.  ఉచిత బస్సు ప్రయాణంతో మిగిలే పైసలతో వారిపై వారికి మరింత నమ్మకం కలుగుతుంది. తీర్థయాత్రలు,  విహారయాత్రలకు వెళ్లే ఆర్థిక స్తోమత లేని మహిళలు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మన రాష్ట్రంలోనే కాకుండా కర్నాటక, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలలో కూడా అమలులో ఉంది.  ఈ సౌకర్యం ఆ రాష్ట్రాల్లోని మహిళలకు కూడా  ప్రయోజనకరంగా ఉన్నట్లు అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి.  ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళలకు కొండంత అండనిస్తోంది.  వారిలో  చైతన్యాన్ని పెంచుతుంది. తెలంగాణ మహిళా లోకంలో కొత్త వెలుగు కనిపిస్తోంది.

పేద, మధ్యతరగతి మహిళలకు లబ్ధి

మన తెలంగాణ ఐదున్నర లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మారింది. కాళేశ్వరం, భగీరథ,  ధరణితో  కేసీఆర్​ సర్కార్​ లక్ష కోట్ల అవినీతికి పాల్పడింది. లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. రాష్ట్రాన్ని భూకబ్టాల రాష్ట్రంగా మార్చారు బీఆర్‌‌ఎస్‌‌ నాయకులు. మోదీ ప్రభుత్వం సంపన్నుల రుణాలను 16 లక్షల కోట్లకు పైగా మాఫీ చేసింది. వీటితో ఎన్ని కోట్ల మంది మహిళలకు ఎన్ని సంవత్సరాల పాటు అభివృద్ధి పథకాలు అమలు చేయవచ్చో ఉచిత బస్సు ప్రయాణాన్ని విమర్శించేవారు చెప్పాలి.  ప్రజా ఖజానా లూటీని విమర్శించనివారు దురదృష్టవశాత్తు నేడు మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని విమర్శించడం బాధాకరం. గత రెండు మూడు రోజుల్లో బస్సుల్లో ప్రయాణించిన అనేకమంది మహిళలు, తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత సంతోషంగా గతంలో ఎన్నడూ లేమని అనడం పాలకులు గమనించాలి. వాస్తవానికి ఉచిత బస్సు ప్రయాణికుల్లో నిరుపేద, పేద, మధ్యతరగతి వర్గాల మహిళలే ఎక్కువ. ఉన్నత వర్గాలకు చెందినవారు  వ్యక్తిగత వాహనాలు, కార్లలో తప్ప బస్సుల్లో ప్రయాణించరు.  సంపన్న వర్గాలవారు ఉచిత బస్సు ప్రయాణం చేయమన్నా చేయరు. ఈ గ్యారంటీ వల్ల పేద, మధ్య తరగతి మహిళలు ఎంతో లబ్ధి పొందుతున్నారనేది నిజం.

- కె.సౌజన్య, పీఓడబ్ల్యూ రాష్ట్ర  కమిటీ సభ్యురాలు