
హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. బేగంపేటలో నిర్వహించిన సభలో మోడీ ప్రసంగం పార్టీ కార్యకర్తలకు మరింత ఊపునిచ్చింది. మోడీ ప్రసంగిస్తున్న సమయంలో కార్యకర్తలు మోడీ మోడీ అనే నినాదాలతో సభను మారుమోగించారు. కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి మోడీ మురిసిపోయారు. ఈ సందర్భంగా ‘హైదరాబాద్ నాకు ఇచ్చిన ప్రేమను వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తా’ అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కేసులు పెడుతున్నా.. బీజేపీ కార్యకర్తలు భయపడడం లేదని చెప్పిన సమయంలోనూ కార్యకర్తలు మరింత ఉత్సాహంతో నినాదాలు చేశారు. రాష్ర్టంలో బీజేపీ బలపడేందుకు అవకాశం ఉందని అన్నారు. తనను, బీజేపీని తిట్టినా భరిస్తాను గానీ.. తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే మాత్రం సహించనని చెప్పడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోయినా పోరాడి గెలిచామనే సందేశాన్ని బేగంపేటలో నిర్వహించిన సభ ద్వారా మోడీ పార్టీ శ్రేణులకు ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓడిపోయినంత మాత్రాన ఢీలా పడిపోవద్దని, రెట్టింపు ఉత్సాహంతో మరింత ముందుకు వెళ్లాలనే ఆదేశాన్ని బీజేపీ శ్రేణులకు ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా రాష్ట్రానికి ప్రధాని రాకతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత రెట్టింపు అయ్యిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.