ప్రభుత్వం మారంగనే.. కీలక ఫైళ్లు మాయం!

ప్రభుత్వం మారంగనే.. కీలక ఫైళ్లు మాయం!
  • ప్రభుత్వం మారంగనే.. కీలక ఫైళ్లు మాయం!
  • రిజల్ట్స్​కు ఒకరోజు ముందు టూరిజం ఆఫీస్​లో ఫైర్ యాక్సిడెంట్
  • కీలక ఫైళ్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ దగ్ధం
  • పశుసంవర్ధక శాఖ ఆఫీసులో డాక్యుమెంట్లు చింపేసిన తలసాని శ్రీనివాస్​ ఓఎస్డీ
  • విద్యాశాఖ ఆఫీసులోనూ ఫైళ్లు, ఫర్నీచర్ తరలించే ప్రయత్నం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వివిధ శాఖల్లోని కీలక ఫైళ్లను కొందరు అధికారులు చింపేస్తున్నారు. మరికొందరు ఫర్నీచర్​తో పాటు ఫైళ్లను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పాత సర్కార్ పాలనపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే.. పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. ఎన్నికల ఫలితాలకు ఒక్కరోజు ముందు టూరిజం కార్పొరేషన్ బిల్డింగ్​లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కీలక ఫైళ్లన్నీ కాలిబూడిదయ్యాయి. 

తర్వాత పశు సంవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కూడా ఫైళ్లను చింపేశారు. అదేవిధంగా, విద్యాశాఖలో ఫర్నీచర్, ఫైళ్లను ఎత్తుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నించారు. గతంలో ప్రభుత్వాలు మారినప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదని, ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ ఫైళ్లు, కంప్యూటర్లలో ఏం దాగుందన్న చర్చ మొదలైంది. భారీ ఎత్తున అవినీతి జరగడంతోనే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఫైల్స్ చించేసిన తలసాని ఓఎస్డీ కల్యాణ్

సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన మర్నాడే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్.. పశు సంవర్ధక శాఖలోని ఫైళ్లను చించేశారు. అది కాస్తా సిబ్బంది, మీడియా కంట పడడంతో కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఫైళ్లను ఎందుకు చించేస్తున్నారని మీడియా ప్రశ్నించడంతో బీరువాలో పెట్టిన ఫైళ్లను ఎలుకలు కొడుతున్నాయని, అందుకే చించేస్తున్నామని, కొన్నింటిని తరలిస్తున్నామని పొంతనలేని సమాధానాలు చెప్పారు. గొర్రెల పంపిణీ వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వంలో వాటిపై విచారణ జరిపి ఫైళ్లను బయటకు తీస్తే.. అవినీతి బాగోతం బయటపడుతుందనే ఫైళ్లను చించేశారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు.

విద్యాశాఖలోనూ ఫైళ్లు మాయం

విద్యాశాఖలోనూ కీలక ఫైళ్లను మాయం చేసే ప్రయత్నం జరిగింది. బషీర్​బాగ్​లోని విద్యా పరిశోధన శిక్షణా సంస్థ ఆఫీస్​లో ఉద్యోగులే ఫైళ్లు, సామాగ్రిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఓ ఉద్యోగి సమాచారంతో మీడియా అక్కడకు రావడంతో తొలుత బుకాయించే ప్రయత్నం చేసిన సిబ్బంది.. ఆ తర్వాత అక్కడి నుంచి పరారైంది. గతంలో ఇదే బిల్డింగ్​లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆఫీసు ఉండడం గమనార్హం. ఉద్యోగులే సామాగ్రిని తరలించడం, మీడియా అడగడంతో అక్కడి నుంచి పారిపోవడం తీవ్ర అనుమానాలకు తావిచ్చింది.

రవీంద్రభారతి నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్​లోని ఫర్నీచర్​ను టీజీవో వాళ్లు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ఓయూ విద్యార్థి నేతలు అడ్డుకున్నారు. అయితే, అవి ప్రభుత్వ ఆస్తులని తమకు తెలియదంటూ తర్వాత టీజీవో సంఘం నేతలు ప్రకటించారు. ఆ ఫర్నీచర్​ను తిరిగి ఆఫీసులో పెట్టేశారు. వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల్లోని ఫర్నీచర్​నూ ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు.