కేసీఆర్​ ఫ్రంటు ప్లాన్​ బెడిసినట్లేనా?

కేసీఆర్​ ఫ్రంటు ప్లాన్​ బెడిసినట్లేనా?
  • టీఆర్​ఎస్​ సర్కారుపై అవినీతి ముద్ర వేసిన ఆప్​ 
  • అంతగా కలిసి రాని మిగతా పార్టీలు 
  • నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంతో మారిన సమీకరణాలు

హైదరాబాద్​, వెలుగు: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో.. సీఎం కేసీఆర్​ ఫ్రంట్ ముందుకా, వెనక్కా అనేది ఆసక్తి రేపుతున్నది. దేశంలో బీజేపీ, కాంగ్రెస్​కు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలతో ఫ్రంట్​ ఏర్పాటు చేయాలనుకుంటున్న కేసీఆర్​కు.. ఈ ఫలితాలు నిరాశకు గురి చేశాయి. ఐదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల బీజేపీ, మరోచోట ఆప్​ విజయం సాధించాయి. దీంతో ఫ్రంట్​ స్పీడ్​కు బ్రేకులు పడ్డట్లేనని టీఆర్​ఎస్​ శ్రేణులు ఢీలా పడ్డాయి.  చాన్స్​ దొరికితే నేషనల్​ పాలిటిక్స్​లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్న కేసీఆర్.. ఇటీవల ప్రధాని మోడీపై రాజకీయ యుద్ధం ప్రకటించారు. తనే స్వయంగా ఇతర రాష్ట్రాల సీఎంలు, ప్రాంతీయ పార్టీల నేతల దగ్గరికి వెళ్లి ఫ్రంట్​ ఏర్పాటుకు సహకారం కోరారు. ఇందులో భాగంగానే తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి అక్కడి సీఎంలను, ఇతర నేతలను కలిసివచ్చారు. ఈ భేటీలకు ఆశించిన స్పందన రాకపోగా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చర్యలు ముమ్మరం చేస్తానంటూ అంతర్గత సంభాషణల్లో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పలువురు నేతలతో చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతింటుందని, ఉత్తరప్రదేశ్ లో సమాజ్​వాదీ పార్టీ పుంజుకుంటుందనే ధీమా టీఆర్​ఎస్​ శ్రేణులు ఆశించాయి. కానీ ఫలితాలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉండటం, పంజాబ్​లో గెలిచిన ఆప్​తో కూడా టీఆర్​ఎస్​కు సఖ్యత లేదనే సంకేతాలు వెలువడటంతో.. ఫ్రంట్​ ఏర్పాటుపై సందేహాలు మొదలయ్యాయి. 

మొన్న ఢిల్లీకి పోతే..!

ఈ నెల మొదటి వారంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌... ఆ రాష్ట్ర సీఎం, ఆప్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ అరవింద్‌‌‌‌‌‌‌‌ కేజ్రివాల్‌‌‌‌‌‌‌‌తో భేటీ కావాలని అనుకున్నారు. అదే సమయానికి కేజ్రివాల్‌‌‌‌‌‌‌‌ బెంగళూరుకు వ్యక్తిగత పర్యటనకు వెళ్లారు. కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌ అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కోసం టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నేతలు ప్రయత్నించినా అందుకు ఆమ్‌‌‌‌‌‌‌‌ ఆద్మీ నేతలు ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ దేశంలోనే అవినీతిపరుడని ఆప్​ ఎమ్మెల్యే సోమ్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌ భారతి బాహాటంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్మ స్వామితో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ భేటీ కావడంపైనా ఆయన సెటైర్లు వేశారు. ఇప్పుడు పంజాబ్‌‌‌‌‌‌‌‌లో  ఆప్‌‌‌‌‌‌‌‌ ఘన విజయం సాధించడంతో దేశంలోని మిగతా రాష్ట్రాలపై ఆ పార్టీ ఫోకస్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నది. కేసీఆర్​తో కలిసేందుకు దూరంగా ఉన్న కేజ్రీవాల్​ తెలంగాణలోనూ తమ పార్టీ కార్యకలాపాలు విస్తరించే అవకాశాలు లేకపోలేదు. దీంతో జాతీయ స్థాయిలోనూ కేసీఆర్‌‌‌‌‌‌‌‌తో జట్టు కట్టే చాన్స్​ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా, ఇటీవల సోమ్​నాథ్​ భారతి మీడియాతో మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణలో పాదయాత్ర చేపడుతామన్నారు.

ఎస్పీకి బహిరంగంగా మద్దతు ప్రకటించినా..!

ఉత్తరప్రదేశ్​ ఎన్నికల్లో సమాజ్​వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్​ అఖిలేశ్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌కు కేసీఆర్‌‌‌‌‌‌‌‌ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఆ రాష్ట్రంలో రెండోసారి బీజేపీ గెలిచినా ఎస్పీ సీట్లు గణనీయంగా పెరుగుతాయని బహిరంగంగానే చెప్పారు. చివరి విడత యూపీ ఎన్నికల్లో ఎస్పీ తరఫున కేసీఆర్‌‌‌‌‌‌‌‌ వారణాసిలో ప్రచారం చేస్తారని టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకులు అక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే.. అఖిలేశ్‌‌‌‌‌‌‌‌కు మద్దతుగా కేసీఆర్​ ప్రచారం చేయకపోయినా నైతిక మద్దతు ప్రకటించారు. ఒకానొక దశలో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లోని యాదవ నాయకులు ఉత్తరప్రదేశ్​ వెళ్లాలని అనుకున్నా, ప్రతికూల ఫలితాలు ఖాయమని నిర్దారించుకున్న తర్వాతే వెనక్కి తగ్గినట్టుగా పార్టీలో చర్చ సాగుతున్నది. ఆర్జీడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌‌‌‌‌‌‌‌  ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వచ్చి కేసీఆర్​తో భేటీ కావటం వెనుక యూపీ ఎన్నికల వ్యూహమే ఉందనే ప్రచారం కూడా జరిగింది. యూపీలో ఎస్పీకి మద్దతుగా టీఎంసీ చీఫ్‌‌‌‌‌‌‌‌, పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌ సీఎం మమతా బెనర్జీ ప్రచారం చేశారు. యూపీలో రెండోసారి బీజేపీ ఘన విజయం సాధించడంతో కేంద్రంలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. 

ఎవరి దారిలో వాళ్లు

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీని నిలబెట్టుకున్న బీజేపీ, మిగతా మూడు రాష్ట్రాల్లోనూ గెలిచింది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌‌‌‌‌‌‌‌గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి బీజేపీ ఊపుమీద ఉంది. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీజేపీకి సమదూరం పాటిస్తున్న ఆమ్‌‌‌‌‌‌‌‌ ఆద్మీ పార్టీ.. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను దగ్గరకు రానివ్వడం లేదు. గతంలో కేసీఆర్‌‌‌‌‌‌‌‌తో సన్నిహితంగా ఉన్న ఏపీ సీఎం జగన్‌‌‌‌‌‌‌‌ కూడా ఇటీవల అంటీముట్టనట్లే ఉంటున్నారు.  తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్​ స్టాలిన్‌‌‌‌‌‌‌‌, మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్​ ఉద్ధవ్‌‌‌‌‌‌‌‌  థాక్రే, జార్ఖండ్​ సీఎం హేమంత్‌‌‌‌‌‌‌‌ సోరెన్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీతో కలిసే ఉన్నారు. కేసీఆర్​తో చర్చలు జరిపిన మరుసటి రోజే కాంగ్రెస్​ లేని కూటమి ఏర్పాటు సాధ్యం కాదని శివసేన బహిరంగంగానే ప్రకటించింది. కేంద్రంలో ప్రత్యామ్నాయ కూటమి అంటూ ఏర్పాటు చేస్తే దానికి తానే నాయకత్వం వహించాలనే ఆలోచనలో పశ్చిమ బెంగాల్​ సీఎం మమత ఉన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌తో కలిసి పనిచేయడంపై కమ్యూనిస్టులు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ చెప్తున్న ఫ్రంట్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటవుతుందా అనే చర్చ మొదలైంది.