
- కేంద్రానికి తమ్మినేని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. ఇది చరిత్రను వక్రీకరించడమేనని, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆయన మండిపడ్డారు. వెంటనే ఆ నోటిఫికేషన్‌ను వాపస్ తీస్కోవాలని కేంద్రహోంశాఖను ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో ఎలాంటి సంబంధం లేని బీజేపీ నేతలు దీనిని విమోచన దినం అంటున్నారని పేర్కొన్నారు.
జమీందారీ వ్యవస్థ నుంచి విముక్తి కోసం పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి నాయకులు నడిపిన పోరాటమని తెలిపారు. సాయుధ రైతాంగ పోరాటాన్ని అణచలేక, నిజాంరాజు చేతులెత్తేసే సమయంలో నెహ్రూ ప్రభుత్వ సైన్యాలు ప్రవేశించాయని, నిజాంరాజు లొంగిపోయాడని గుర్తుచేశారు. హైదరాబాద్ రాజ్యాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేస్తూ సెప్టెంబర్ 17న సంతకం చేసాడని, తద్వారా ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ రాజ్యం విలీనమైన రోజుగా మారిందని వివరించారు.
ఈ వాస్తవాల నుంచి కొత్తతరం ప్రజలను పక్కదోవ పట్టిస్తూ, ఆనాటి పోరాటానికి మతం రంగు పులిమే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.