ఇంటి పెద్దను కోల్పోయినం సారూ.. ఆదుకోండి

ఇంటి పెద్దను కోల్పోయినం సారూ.. ఆదుకోండి
  • కిషన్ రెడ్డిని కలిసిన నేతన్నల భార్యలు

న్యూఢిల్లీ, వెలుగు: ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న తమను ఆదుకోవాలని ఆత్మహత్య చేసుకున్న నేతన్నల భార్యలు కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డిని కోరారు. జాతీయ నేతన్నల జేఏసీ చైర్మన్ దాసు సురేశ్‌‌తో వెళ్లి ఢిల్లీలో కిషన్‌‌రెడ్డిని కలిశారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను  సర్కారు ఆదుకోవడం లేదని బాధితులు మంత్రికి తెలిపారు. గడిచిన ఏడేండ్లలో రాష్ట్రంలో నేతన్నల బతుకులు దయనీయంగా మారాయని దాసు సురేశ్‌‌ మంత్రికి వివరించారు. చేనేత రంగం, నేతన్నలపై వివక్ష కొనసాగుతోందని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. భర్తను కోల్పోయి సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, ఈ బాధలు తట్టుకోవడం తమ వల్ల కాదని, తాడో పేడో తేల్చుకోవడానికే కష్టపడి ఢిల్లీ వచ్చామని బాధిత మహిళలు కిషన్‌‌రెడ్డి వద్ద కన్నీరుపెట్టుకున్నారు. తెలంగాణలో నేతన్నల ఆత్మహత్యలు బాధాకరమని, బాధిత కుటుంబాలకు పక్కా ఇళ్లు, హెల్త్ కార్డులు, పెన్షన్లు ఇప్పించడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ సీఎస్‌‌ను ఆదేశిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.