‘RRR’ లో వేషం ఇప్పిస్తానని అరకోటి మోసం!

‘RRR’ లో వేషం ఇప్పిస్తానని అరకోటి మోసం!
  • ఆఫీస్ బాయ్ నుంచి ప్రొడ్యూసర్ అవతారం
  • లీగల్ అడ్వైజర్ నుంచి రూ.50 లక్షలు స్వాహా
  • ముగ్గురు నిందితులు అరెస్ట్

హైదరాబాద్, వెలుగు: ఆర్.ఆర్.ఆర్  సినిమాలో ఆర్టిస్టుగా అవకాశం ఇప్పిస్తామని ఓ మహిళను మోసం చేసిన ఫేక్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ల గుట్టు రట్టైంది. లీగల్ అడ్వైజర్ ను ట్రాప్ చేసి రూ.50 లక్షలు వసూలు చేసిన16 మంది సభ్యుల చీటింగ్ ముఠాలో ముగ్గురు సభ్యులను సిటీ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 19.270 గ్రాముల బంగారం,111.550 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.65 వేల నగదు, స్విఫ్ట్ డిజైర్ కారు, రెండు బటన్ చాకులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. వీరబత్తిని నరేష్ కుమార్ అలియాస్ ఆదిత్య(28)  ఉండేది గోల్నాక.  బంజారాహిల్స్ లోని ఓ ల్యాబ్​లో ఆఫీస్ బాయ్ గా పనిచేశాడు. విలాసాలకు అలవాటుపడి పెద్ద పెద్ద మోసాలకు స్కెచ్ వేశాడు.  రాజమౌళి, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తు్న్న ఆర్ఆర్ఆర్ మూవీని టార్గెట్ చేశాడు.  జస్ట్ డయల్ లో నంబర్స్ కలెక్ట్ చేసి ఫోన్లు చేసి తానొక పెద్ద ఫిల్మ్ ప్రొడ్యూసర్ నని చెప్పుకునే వాడు. డైరెక్టర్ రాజమౌళితో సన్నిహిత సంబంధాలున్నాయని నమ్మించాడు. సినీ ప్రముఖులతో దిగిన ఫొటోలను వాట్సాప్​ ద్వారా పంపాడు.

హీరో తల్లి వేషం ఇప్పిస్తానని..

సినిమాల పట్ల ఆమె ఆసక్తిని గమనించిన నరేష్​ ఆమెకు  ఆర్ఆర్ఆర్​ సినిమాలో హీరో తల్లి పాత్రను ఇప్పిస్తానని నమ్మబలికాడు. న్యాయవాది అంగీకరించడంతో ‘‘ఫిల్మ్ ఛాంబర్ ఐడీ కార్డ్, మా ఐడీ కార్డ్, టీవీ సీరియల్ కార్డ్ లు తీసుకోవాలని చెప్పాడు.  మెంబర్ షిప్స్ పేరుతో లక్షల్లో వసూలు చేశాడు. సదరు బాధితురాలు జనవరి నుంచి జూన్ వరకు రూ.40 నుంచి 50 లక్షలు నరేశ్ ఇచ్చిన 15 అకౌంట్స్ లో డబ్బులు డిపాజిట్ చేసింది. బాధిత మహిళను పూర్తిగా తన ట్రాప్ లోకి లాగిన నరేశ్ తాను తీయబోయే సినిమా సైట్ చూసేందుకు వెళ్తున్నానని చెప్పాడు. తన కారు రిపేర్ కి ఇచ్చానని నమ్మించి న్యాయవాదిని తన కారు ఉంటే ఇవ్వాలని కోరాడు. దీంతో న్యాయవాది టీఎస్10ఈఆర్4251 నంబర్ గల తన స్విఫ్ట్ డిజైర్ కారును నరేశ్ కు ఇచ్చింది. ఆ కారుతో ఉడాయించిన నరేశ్ తిరిగి రాలేదు. దీంతో బాధితురాలు బోయినపల్లి పీఎస్​లో ఫిర్యాదు చేసింది.

టాస్క్​ఫోర్స్ ​బృందం గాలింపు

కేసు నమోదు చేసిన బోయినపల్లి పోలీసులు దర్యాప్తును టాస్క్ ఫోర్స్ కి అప్పగించారు. ఆదిత్యగా పరిచయమైన నరేశ్ తన ఫ్రెండ్స్ కి చెందిన బ్యాంక్ అకౌంట్లతో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు.  నల్లగొండ జిల్లాకు చెందిన పెయింటర్ రామకృష్ణ(20) అకౌంట్లో  రూ.15 లక్షలు,  కొమ్ము సోమన్న(33) అకౌంట్లో రూ.6 లక్షలు డిపాజిట్​ చేసినట్లు ఆధారాలు సేకరించారు. నరేశ్, రామకృష్ణ, సోమన్నలను  రిమాండ్ కు తరలించారు.