వాషింగ్‌మెషిన్‌లో రూ. 145 కోట్ల లాటరీ టికెట్

వాషింగ్‌మెషిన్‌లో రూ. 145 కోట్ల లాటరీ టికెట్

చెయిదాకా వచ్చింది.. నోటి దాకా రాకపోవడమంటే ఇదే మరి. ఒక మహిళ లాటరీ టికెట్ కొని పాకెట్‌లో మరిచిపోయి.. ఉతకడానికి వేసింది. ఇంకేముంది ఆ లాటరీ టికెట్ కాస్తా పాడైపోయింది. పోతేపోయిందేలే అనుకుందామనుకునే లోపు.. పిడుగులాంటి వార్త తెలిసింది. ఆ లాటరీ టికెట్‌కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. లబోదిబోమంటూ లాటరీ ఆఫీసుకు పరుగుతీసింది. ఇంతకీ ఆ మహిళకు డబ్బులు వచ్చాయా? లేదా?

కాలిఫోర్నియాకు చెందిన ఒక మహిళ లాస్ ఏంజిల్స్ శివారు నార్వాక్‌లోని ఆర్కో కన్వీనియెన్స్ స్టోర్‌లో సూపర్ లోట్టో ప్లస్ లాటరీ టికెట్లు కొనుగోలు చేసింది. వాటి నెంబర్లు 23, 36, 12, 31, 13, మరియు 10. ఆ తర్వాత టికెట్లను ప్యాంట్ జేబులో పెట్టుకొని మరచిపోయింది. మరుసటి రోజు బట్టలు వాషింగ్ మెషిన్‌లో వేసింది. దాంతో ఆ టికెట్లు పూర్తిగా పాడైపోయాయి. కొన్ని రోజుల తర్వాత లాటరీ కంపెనీ వాళ్లు డ్రా తీశారు. ఆ డ్రాలో సదరు మహిళ కొన్న టికెట్‌కు బంపర్ ప్రైజ్ తగిలింది. వందో, వెయ్యో, లక్షో కాదు. దాదాపు 20 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో అక్షరాలా దాదాపు 145 కోట్లు. ఇంకేముంది లబోదిబోమంటూ ఆగమేఘాల మీద లాటరీ కంపెనీకి చేరుకుంది. డ్రాలో గెలిచిన టికెట్‌ను తానే కొన్నానని సంస్థ ప్రతినిధులకు చెప్పింది. దాంతో వారు మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా అని అడిగితే.. నేను మీ షాపుకు వచ్చి టికెట్ కొన్న వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డయిందని చెప్పింది. ఆమె చెప్పిన దాని ప్రకారం చూస్తే.. ఆ మహిళ నిజంగానే టికెట్ కొన్నది. దాంతో లాటరీ కంపెనీ ప్రతినిధులు ఆ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. మహిళ టికెట్ ఆధారాలు చూపించి క్లెయిమ్ చేసుకుంటే.. ఆమెకు దాదాపు రూ. 145 కోట్లు వస్తాయని తెలిపారు. అలాకాకుండా విడతలవారీగా తీసుకుంటే ఆమెకు మొత్తంగా దాదాపు రూ. 190 కోట్లు వస్తాయని తెలిపారు. టికెట్ అమ్మిన స్టోర్‌కు బోనస్‌గా 1,30,000 డాలర్లు లభిస్తాయని లాటరీ నిర్వాహకులు తెలిపారు.

లాటరీ టికెట్ కొనుగోలుదారు డ్రాలో గెలుపొందితే కచ్చితంగా క్లెయిమ్ ఫామ్‌ను పూర్తి చేయాలని లాటరీ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ
ఎవరైనా ప్రైజ్ గెలుపొంది.. టికెట్ పోగొట్టుకుంటే.. ఆ టికెట్ ముందు మరియు వెనుక భాగంలో తీసిన ఫోటో అయినా చూపించాలని అధికారులు తెలిపారు. ఒకవేళ టికెట్ లేని పక్షంలో క్లెయిమ్ చేసుకోకపోతే.. ఆ డబ్బంతా కాలిఫోర్నియా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తాయని లాటరీ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అధిక మొత్తాలు గెలుచుకున్న టికెట్లు క్లెయిమ్ చేయకపోవడం అసాధారణమని లాటరీ కంపెనీ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 20 మిలయన్ డాలర్లు, 63 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ టికెట్లు సహా మరో రెండు టికెట్లు మాత్రమే క్లెయిమ్ చేయబడలేదని లాటరీ కంపెనీ ప్రతినిధి తెలిపారు.