చండీగఢ్: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన నేతను ఓ మహిళ పెళ్లి చేసుకుని కొన్ని నెలలకు అతని ఇంట్లోని నగలు, విలువైన వస్తువులతో పరారైంది. ఫతేగఢ్ సాహిబ్ జిల్లాకు చెందిన ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌కు.. మన్విందర్ కౌర్ అనే మహిళతో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది.
అయితే, కొన్నాళ్లకే ఆమె నగలు, ఇతర విలువైన వస్తువులతో ఇంటినుంచి పారిపోయింది. పోలీసుల ప్రకారం.. మన్విందర్ కౌర్ ప్రావిన్షియల్ సివిల్ సర్వీసెస్ (పీసీఎస్) అధికారినంటూ అందరినీ నమ్మించింది. అంతేకాదు, తనకు అసలు పెళ్లే కాలేదని అబద్ధం చెప్పి తన వయసును కూడా దాచిపెట్టింది. మన్విందర్ కౌర్ మాటలను నమ్మిన అమరిందర్ సింగ్.. ఆమెను పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు.
పంజాబ్ అసెంబ్లీ స్పీకర్, మంత్రులు సహా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. అయితే, పెళ్లయిన కొన్ని నెలలకే ఆ మహిళ అసలు రూపం బయటపడింది. ఓ రోజు ఇంట్లో ఉన్న బంగారం, వెండి నగలు, ఇతర విలువైన వస్తువులను సర్దుకుని పారిపోయింది. దీంతో అమరిందర్ సింగ్ ఆరా తీయగా.. కౌర్ చెప్పినదంతా అబద్ధమని, ఆమెకు ఇదివరకే పెళ్లయి విడాకులు అయ్యాయని తేలింది.
ఆమెకు ఏకంగా 18 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని తెలిసి ఆయన షాకయ్యారు. తనను నిలువునా మోసం చేసి, నగలన్నీ దోచుకెళ్లిన మన్విందర్ కౌర్‌పై అమరిందర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న కౌర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
