
ముంబై: తల్లి మరణాన్ని ఓ కూతురు తట్టుకోలేకపోయింది. తల్లిని మర్చిపోలేక శవాన్ని తనతో ఇంట్లోనే ఉంచుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయిన తల్లి శవాన్ని కూతురు 8 నెలల పాటు తనతోనే ఉంచుకున్న ఘటన ముంబైలోని బాంద్రాలో జరిగింది. బాంద్రాలోని చుయిం గ్రామంలో 83 ఏళ్ల ముసలామె డెడ్‌బాడీని శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత మార్చిలోనే సదరు ముసలామె చనిపోయిందని అధికారులు తెలిపారు. 53 ఏళ్ల సదరు ముసలామె కూతురు తల్లి శవాన్ని తనతోపాటే ఉంచుకుంది. తల్లి చనిపోయి దాదాపు 8 నెలలు గడుస్తున్నప్పటికీ డెడ్‌బాడీకి దహన సంస్కారాలు నిర్వహించలేదు.
ఇంటి కిటికీలో నుంచి చెత్త పడేస్తోందని సదరు మహిళపై పొరుగింటి వాళ్లు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసలు సదరు మహిళ ఇంట్లోకి వెళ్లగా ఆమె తల్లి శవం వారికి కనిపింది. సదరు మహిళ మానసిక సమస్యలతో బాధపడుతోందని.. అందుకే తల్లి మరణం గురించి ఎవ్వరికీ చెప్పలేదని పోలీసులు పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం సదరు మహిళ పెంచుకుంటున్న ఓ కుక్క చనిపోయిన సమయంలో కూడా ఈ విషయాన్ని ఆమె ఇతరులకు చెప్పలేదని పొరుగు వాళ్లు గుర్తు చేశారు. ముసలామె శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కూపర్ ఆస్పత్రికి తరలించారు. ముసలామె కూతుర్ని మెడికల్ పరీక్షల కోసం ఆస్పత్రికి పంపామని పోలీసులు పేర్కొన్నారు.