
ఫేక్ ప్రొఫైల్ తో మ్యాట్రిమోనీలో మోసాలకు పాల్పడుతున్న మహిళ ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. బేగంపేట లేడీస్ హాస్టల్ అడ్డాగా విదేశాల్లో ఉండే వారిని టార్గెట్ చేసిన మాయ లేడీని మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో ఉండే వ్యక్తి నుంచి రూ.4 లక్షలు కాజేసిన కొర్రం అర్చన(30)ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించారు. రాచకొండ జాయింట్ సీపీ తెలిపిన వివరాల ప్రకారం..
ట్రాప్ చేసింది ఇలా..
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సింహాద్రి పవన్ కుమార్ కు భారత్ మ్యాట్రిమోనీలో అర్చన పరిచయమైంది. టీఎస్-టీ5120836 ఐడీ నంబర్ తో క్రియేట్ చేసిన ప్రొఫైల్ లో తన పేరు పుస్తయి అలియాస్ అర్చనగా నమోదు చేసింది. తాను బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాని చెప్పింది. ఆ తరువాత వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాల్స్ చేయడం ప్రారంభించింది. ఇలా ఏప్రిల్ 13 నుంచి 23వ తేదీ వరకు ఇద్దరూ మాట్లాడుకున్నారు. అనంతరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని మ్యారేజ్ కోసం ఏర్పాట్లు చేసుకున్నాడు. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు.
బెంగళూరు నుంచి లగేజ్ షిఫ్టింగ్..
ఈ క్రమంలో తను కూడా యూఎస్ వెస్ట్ పామ్ బీచ్ వద్ద ఉన్న సిస్కోలో ఉద్యోగం వచ్చిందని చెప్పింది. బెంగళూరు నుంచి రావడానికి డబ్బు కావాలని పవన్ ను కోరింది. పవన్ కుమార్ ఓకే అనడంతో ఆలేటి ఆంజనేయులు అనే అకౌంట్ కి మనీ ట్రాన్స్ ఫర్ చేయాలని చెప్పింది. దీంతో 2,900 డాలర్లను ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ తరువాత అర్చన మొబైల్ నంబర్ మార్చేసింది.
అడ్డా కూలీల అడ్రెస్ తో బ్యాంక్ అకౌంట్లు
మోసపోయానని గుర్తించిన పవన్ కుమార్ కొత్తపేటలో ఉండే తన సోదరుడు మధుమోహన్ కు చెప్పడంతో అతడు ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు బెంగళూరుతో పాటు చెన్నైలో అర్చన కోసం గాలించారు. బ్యాంక్ అకౌంట్ ఆధారంగా ఏపీ లో గాలించారు. అర్చన ఇచ్చిన అకౌంట్ నంబర్లు అడ్డా కూలీలవిగా గుర్తించారు. లోన్స్ వస్తాయని నమ్మించి అకౌంట్స్ ఓపెన్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. తప్పించుకు తిరుగుతున్న అర్చనను చివరకు బేగంపేటలోని లేడీస్ హాస్టల్ లో మంగళవారం అరెస్టు చేశారు.
అర్చన నేర చరిత్ర..
నెల్లూరు జిల్లా ఇనమడుగుకు చెందిన కొర్రం అర్చన అలియాస్ జూతూరి వరప్రసాద్, ఇందిరా ప్రియదర్శిణి, పుస్తయి(30) ఎస్వీ యూనివర్సిటీలో ఎంబీఏ చదివింది. లెక్చరర్ గా పనిచేస్తున్న రంగనాయకుల పేటకు చెందిన కొర్రం దుర్గాప్రసాద్ ప్రవీణ్ ను వివాహం చేసుకుంది. తరువాత ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు తెలుగు మ్యాట్రిమోనిలో నకిలీ ప్రొఫైల్స్ లో అందమైన అమ్మాయిల ఫొటోలను పెట్టేది. కేవలం విదేశాల్లో ఉండే తెలుగు వారినే టార్గెట్ చేసి ఫారిన్ ఫోన్ నంబర్ ను ఉపయోగించేది. గతేడాది డిసెంబర్ లో సైబరాబాద్ పోలీసులకు చిక్కి చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంది.